
కొండమల్లేపల్లి (దేవరకొండ): నల్లగొండ జిల్లా దేవరకొండ ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న తుమ్మలపల్లి జైపాల్‌రెడ్డి(57) సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందాడు. జైపాల్ కుటుంబంతో కలసి హైదరాబాద్‌లోని సాగర్‌రింగ్‌రోడ్డు సమీపంలోని ఓంకార్‌నగర్‌లో నివసిస్తున్నాడు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా ఆదివారం దేవరకొండ డిపో వద్ద జేఏసీ నిర్వహించిన ధర్నాలో జైపాల్ పాల్గొన్నాడు. తర్వాత తన స్వగ్రామమైన నాంపల్లి మండలం పగిడిపల్లికి వెళ్లాడు. అక్కడ గుండెపోటు రావడంతో ఆయనను దేవరకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఆర్టీసీ జేఏసీ నాయకులు, కార్మికులు, మృతుడి కుటుంబసభ్యులు, వివిధ పార్టీల నేతలు దేవరకొండలోని డిపో వద్దకు చేరుకున్నారు. మృతదేహాన్ని డిపో ఎదుట ఉంచి ఆందోళనకు దిగారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం స్పందించకపోవడంతో జైపాల్ మనస్తాపానికి గురై మృతి చెందాడన్నారు. కార్మికుల ఆందోళనకు అఖిలపక్ష నాయకులు మద్దతు తెలిపారు. కార్మికుల ఆందోళనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో.. పోలీసులు మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు.