
సాక్షి, హైదరాబాద్: ‘వెనక్కి తిరిగి చూసుకోకుండానే 35 ఏళ్ల సర్వీసు పూర్తయింది. శిక్షణ తర్వాత 1984లో నా ఫస్ట్ పోస్టింగ్ నిర్మల్ నుంచి ఇప్పుడు డీజీపీ హోదా వరకు ఎన్నో సవాళ్లు, వాటిని మించిన విజయాలు. నాతో పాటు పనిచేసి పోలీస్ శాఖకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన వారందరిని వదిలి వెళ్లిపోవడం బాధనిపించినా.. అంతకుమించిన సంతోషాన్ని పంచుకుంటున్నాను. డీజీపీ బాధ్యతలు చేపట్టే నాటికి అధికారుల విభజన పూర్తి కాలేదు. కేవలం 29 మంది ఐపీఎస్ అధికారులతో ప్రభుత్వం, సీఎం అప్పగించిన బాధ్యతలను పూర్తిచేస్తూ వచ్చాం.
తోటి ఐపీఎస్ అధికారులతో కలసి ఎన్నో సమస్యలు పరిష్కరించాం. వాటికి తగ్గట్టుగా వచ్చిన విజయాలను పంచుకున్నాం. పోలీస్ శాఖలోని అన్ని విభాగాల్లో పనిచేశా. కేంద్ర సర్వీసు, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్.. ఇలా అన్ని చోట్ల పూర్తి స్థాయిలో సంతృప్తి చెందా. నా విజయానికి బాటలు వేసి, రాష్ట్ర పోలీస్ శాఖను దేశంలోనే బెస్ట్‌గా నిలిచేలా కృషిచేసినా హోంగార్డుల నుంచి ఐపీఎస్‌ల వరకు అందరికీ కృతజ్ఞతలు’అంటూ అనురాగ్ శర్మ డీజీపీ హోదా నుంచి భావోద్వేగంతో పదవీ విరమణ చేశారు.
ఆదివారం రాజాబహదూర్ వెంకట్రామిరెడ్డి పోలీస్ అకాడమీలో ఏర్పాటు చేసిన వీడ్కోలు పరేడ్‌లో ఆయన పాల్గొని పోలీస్ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ గ్రేహౌండ్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ తనతోటే ప్రారంభమయ్యాయని, అవి ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రాముఖ్యత కలిగిన విభాగాలుగా గుర్తింపు రావడం గర్వకారణంగా ఉందన్నారు.
పదేళ్ల ముందుగానే..
దేశంలో ఉన్న అన్ని పోలీస్ విభాగాల కన్నా పదేళ్ల ముందుగానే రాష్ట్ర పోలీస్ శాఖ ఆధునీకరణ చెందిందని అనురాగ్ శర్మ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ కమిషనరేట్‌లో మహేందర్‌రెడ్డి, సైబరాబాద్‌లో అప్పటి కమిషనర్ సీవీ ఆనంద్ అద్భుతంగా పని చేసి స్మార్ట్ పోలీసింగ్‌లో అదుర్స్ అనిపించారని ప్రశంసించారు. ఉన్న సిబ్బందితోనే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టామని చెప్పారు.
తెలంగాణ ఏర్పడితే నక్సలిజం వస్తుందని, మత కల్లోలాలు జరుగుతాయని ఆరోపణలు వచ్చినా, అలాంటి ఒక్క సందర్భం కూడా జరగకుండా విజయం సాధించామని తెలిపారు. ఇలాంటి అనేక విజయాలను నూతన డీజీపీ మహేందర్‌రెడ్డి అందిస్తారని ఆకాక్షించారు. సీఎం కేసీఆర్ అందిస్తున్న తోడ్పాటుతో మరింత ముందుకెళ్లాలని, ప్రజలకు మరింత చేరువై అంకితభావంతో సేవలందిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. తన భార్య కూడా ఐపీఎస్ కావడంతో సమస్యల విషయంలో కొత్త ఆలోచనలు, వ్యూహాలు అందించిందని తెలిపారు.
హోంశాఖ సలహాదారుడిగా బాధ్యతలు స్వీకరించిన అనురాగ్ శర్మ
రాష్ట్ర పోలీస్, శాంతి భద్రతలు, నేర నియంత్రణ ప్రభుత్వ సలహాదారుడిగా రిటైర్డ్ డీజీపీ అనురాగ్ శర్మ బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం ఈ మేరకు ప్రభుత్వం నుంచి అందిన అధికారిక ఉత్తర్వులను స్వీకరించి, జాయినింగ్ రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించారు. సచివాల యంలో పూర్తి స్థాయిలో కార్యాలయం ఏర్పాటైన తర్వాత కార్యకలాపాలు సాగించనున్నట్టు తెలిపారు.
ఆ గొప్పతనం అనురాగ్ శర్మదే: మహేందర్‌రెడ్డి
మూడున్నరేళ్ల పాటు రాష్ట్ర పోలీస్ శాఖను దేశంలో నంబర్ వన్ స్థానంలో నిలబెట్టిన ఘనత డీజీపీ అనురాగ్ శర్మకు దక్కుతుందని నూతన డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. హోంగార్డు నుంచి ఐపీఎస్‌ల వరకు అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి అనేక సమస్యలు పరిష్కరించుకుంటూ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిపెట్టిన గొప్పతనం ఆయనకే దక్కుతుందన్నారు.
మావోయిస్టుల సమస్య, ఉగ్రవాద సమస్య రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉందని హెచ్చరికలు వచ్చిన సమయంలోనూ ఆయన ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పనిచేసి విజయవంతమయ్యామని చెప్పారు. స్పెషల్ పోలీస్, ఆర్మ్‌డ్ రిజర్వ్, గ్రేహౌండ్స్, ఆక్టోపస్, సైబర్ టీమ్స్, లా అండ్ ఆర్డర్.. ఇలా అన్ని విభాగాల ఆధునీకరణకు కృషి చేసి సక్సెస్ అయ్యారని కొనియాడారు. అనురాగ్ శర్మ అందిస్తున్న ఈ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లాలని అధికారులు, సిబ్బందికి మహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment