
సాక్షి, హైదరాబాద్ : బీజేపీ జాతీయ సమావేశాలు ఉత్సాహభరితంగా జరిగాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. మరోసారి మోదీ అనే నినాదంతో ఎన్నికలకు వెళ్లాలని జాతీయ సమావేశం నిర్వహించిందని పేర్కొన్నారు. ఇద్దరు చంద్రులు ఫ్రంట్ల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని, ఇద్దరి ప్రయత్నాలు విఫలం కావడం తథ్యమన్నారు.
ఎవరైనా ఫ్రంట్ పెట్టుకోవచ్చు, టెంట్లు వేసుకోవచ్చని, దాని వల్ల ఎవరికీ ఇబ్బంది లేదని లక్ష్మణ్ తెలిపారు. ఈ ఫ్రంట్లు టెంట్ల వల్ల ప్రయోజనం లేదన్నారు. గతంలో ఇలాంటి ప్రయత్నాలు విఫలమయ్యాయని చెప్పారు. ఇదంతా కుటుంబపార్టీలన్ని కలిసి తమ ఉనికి చాటుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు మాత్రమేనన్నారు. జాతీయ పార్టీ లేని కూటములు ఎన్నికట్టినా అది విఫలమవుతుందన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణప్రజలు సైతం మోదీకే పట్టం కట్టాలని ఆసక్తి చూపుతున్నారని, పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌కు ఓటు వేసే పరిస్థితి లేదని చెప్పారు. కూటములు, ఫ్రంట్లు ప్రధాని అభ్యర్థి ఎవరనేది తేల్చుకోలేకపోతున్నాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కూటమి కూడా ప్రధాని అభ్యర్థి ఎవరనేది తేల్చుకోవాలని లక్ష్మణ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment