
సాక్షి, హైదరాబాద్: సమాచార హక్కు చట్టం కమిషనర్లుగా కొత్తగా ఐదుగురిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. నమస్తే తెలంగాణ పత్రిక సంపాదకుడు కట్టా శేఖర్‌రెడ్డి, టీ–న్యూస్ సీఈఓ మైదా నారాయణరెడ్డి, టీఆర్‌ఎస్ నేత డాక్టర్ గుగులోతు శంకర్‌నాయక్, న్యాయవాదులు మహమ్మద్ అమీర్ హుస్సేన్, సయ్యద్ ఖలీలుల్లా సమాచార కమిషనర్లుగా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనల ప్రకారం మూడేళ్ల పాటు లేదా 65 ఏళ్ల వయస్సు వచ్చే వరకు..ఈ రెండింటిలో ఏది ముందు వస్తే అప్పటి వరకు వీరు ఈ పదవిలో కొనసాగనున్నారు. రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం ప్రధాన సమాచార కమిషనర్‌తో పాటు మరో కమిషనర్ పనిచేస్తున్నారు. కొత్తగా మరో ఐదుగురు కమిషనర్లను ప్రభుత్వం నియమించింది. కొత్త సమాచార కమిషనర్ల గురించి క్లుప్తంగా...
కట్టా శేఖర్ రెడ్డి..
నల్లగొండ జిల్లా మాడుగులపల్లి గ్రామంలో పుట్టిన శేఖర్‌రెడ్డి ఎంఏ, ఎంఫిల్ చేశారు. 33 ఏళ్లుగా వివిధ పత్రికలు, చానళ్లలో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు.
శంకర్‌నాయక్..
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం భోజ్యతండాకు చెందిన శంకర్ నాయక్ హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఎంఏ, తెలుగు వర్సిటీలో ఎంఫిల్, ఉస్మానియా వర్సిటీలో పీహెచ్‌డీ చేశారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.
మహమ్మద్ అమీర్..
నగరంలోని శాంతినగర్‌కు చెందిన మహమ్మద్ అమీర్ ఎంబీఏ, ఎల్‌ఎల్‌బీ, పీహెచ్‌డీ చేశారు. 11 ఏళ్లుగా నగరంలో న్యాయవాదిగా సేవలందిస్తున్నారు.
సయ్యద్ ఖలీలుల్లా
నగరంలోని అగాపురాకు చెందిన ఖలీలుల్లా గుల్బర్గ వర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ చేసి సిటీ క్రిమినల్ కోర్టుల్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు.
ఎం. నారాయణ రెడ్డి..
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం ముబారుస్పూర్‌కు చెందిన నారాయణరెడ్డి గత 24 ఏళ్లుగా జర్నలిస్టుగా వివిధ పత్రికలు, చానళ్లలో పనిచేశారు. ఉస్మానియా నుంచి గ్యాడ్యుయేషన్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment