Information Commissioners
-
సమాచార కమిషనర్ల నియామకంపై తెలంగాణ హైకోర్టులో విచారణ
సాక్షి, హైదరాబాద్: సమాచార కమిషనర్ల నియామకంలో జాప్యంపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పిల్ పై సీజే జస్టిస్ అలోక్ అరాధే ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రధాన, రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చామన్న ప్రభుత్వం.. ప్రధాన సమాచార కమిషనర్ కోసం 40 దరఖాస్తులు వచ్చాయని పేర్కొంది. రాష్ట్ర సమాచార కమిషనర్ పోస్టుల కోసం 273 దరఖాస్తులు వచ్చాయని, సమాచార కమిషనర్ల నియామకం కోసం ఎంపిక కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. సమాచార కమిషనర్ల ఎంపిక కోసం నాలుగు వారాల గడువును ఉన్నత న్యాయస్థానాన్ని ప్రభుత్వం కోరింది. దీంతో సమాచార కమిషనర్ల నియామకంపై విచారణ నాలుగు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది. చదవండి: తెలంగాణ ప్రజా ప్రతినిధుల కోర్టు జడ్జిపై ససెన్షన్ వేటు -
సీఎం జగన్‌ను కలిసిన ఇన్ఫర్మేషన్ కమిషనర్లు
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆర్.మహబూబ్ భాషా, ఇన్ఫర్మేషన్ కమిషనర్ శామ్యూల్ జొనాథన్ బుధవారం కలిశారు. రాష్ట్ర ముఖ్య సమాచార కమిషనర్, రాష్ట్ర సమాచార కమిషనర్‌గా ప్రమాణం చేసిన అనంతరం ఆర్ఎం. బాషా, శామ్యూల్ ఇరువురి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: ‘టీడీపీ కుట్ర.. ఆక్వా పాలిట విలన్ చంద్రబాబే’ -
ఐదుగురు సమాచార కమిషనర్ల నియామకం
సాక్షి, హైదరాబాద్: సమాచార హక్కు చట్టం కమిషనర్లుగా కొత్తగా ఐదుగురిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. నమస్తే తెలంగాణ పత్రిక సంపాదకుడు కట్టా శేఖర్‌రెడ్డి, టీ–న్యూస్ సీఈఓ మైదా నారాయణరెడ్డి, టీఆర్ఎస్ నేత డాక్టర్ గుగులోతు శంకర్‌నాయక్, న్యాయవాదులు మహమ్మద్ అమీర్ హుస్సేన్, సయ్యద్ ఖలీలుల్లా సమాచార కమిషనర్లుగా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనల ప్రకారం మూడేళ్ల పాటు లేదా 65 ఏళ్ల వయస్సు వచ్చే వరకు..ఈ రెండింటిలో ఏది ముందు వస్తే అప్పటి వరకు వీరు ఈ పదవిలో కొనసాగనున్నారు. రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం ప్రధాన సమాచార కమిషనర్‌తో పాటు మరో కమిషనర్ పనిచేస్తున్నారు. కొత్తగా మరో ఐదుగురు కమిషనర్లను ప్రభుత్వం నియమించింది. కొత్త సమాచార కమిషనర్ల గురించి క్లుప్తంగా... కట్టా శేఖర్ రెడ్డి.. నల్లగొండ జిల్లా మాడుగులపల్లి గ్రామంలో పుట్టిన శేఖర్‌రెడ్డి ఎంఏ, ఎంఫిల్ చేశారు. 33 ఏళ్లుగా వివిధ పత్రికలు, చానళ్లలో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. శంకర్‌నాయక్.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం భోజ్యతండాకు చెందిన శంకర్ నాయక్ హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఎంఏ, తెలుగు వర్సిటీలో ఎంఫిల్, ఉస్మానియా వర్సిటీలో పీహెచ్డీ చేశారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. మహమ్మద్ అమీర్.. నగరంలోని శాంతినగర్‌కు చెందిన మహమ్మద్ అమీర్ ఎంబీఏ, ఎల్ఎల్బీ, పీహెచ్డీ చేశారు. 11 ఏళ్లుగా నగరంలో న్యాయవాదిగా సేవలందిస్తున్నారు. సయ్యద్ ఖలీలుల్లా నగరంలోని అగాపురాకు చెందిన ఖలీలుల్లా గుల్బర్గ వర్సిటీ నుంచి ఎల్ఎల్బీ చేసి సిటీ క్రిమినల్ కోర్టుల్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎం. నారాయణ రెడ్డి.. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం ముబారుస్పూర్‌కు చెందిన నారాయణరెడ్డి గత 24 ఏళ్లుగా జర్నలిస్టుగా వివిధ పత్రికలు, చానళ్లలో పనిచేశారు. ఉస్మానియా నుంచి గ్యాడ్యుయేషన్ చేశారు. -
నూతన సీఐసీగా సుధీర్ భార్గవ
న్యూఢిల్లీ: నూతన ప్రధాన సమాచార కమిషనర్(సీఐసీ)గా కేంద్ర ప్రభుత్వం సుధీర్ భార్గవను నియమించింది. ఈయనతో పాటు మరో నలుగురు సమాచార కమిషనర్ల నియామకం చేపట్టింది. భార్గవ సీఐసీ సమాచార కమిషనర్‌గా చేశారు. ప్రధాన సమాచార కమిషనర్‌తో కలిపి మొత్తం 11 మంది ఉండాల్సిన ఈ కమిషన్‌లో ప్రస్తుతం ముగ్గురే ఉన్నారు. ఐఎఫ్ఎస్ అధికారి అయిన యశ్వర్ధన్ కుమార్ సిన్హా, మాజీ ఐఆర్ఎస్ అధికారి వనజా ఎన్ సర్నా, మాజీ ఐఏఎస్ నీరజ్ కుమార్ గుప్తా, మాజీ లా సెక్రటరీ సురేశ్ చంద్రలను సమాచార కమిషనర్లుగా నియమిస్తూ సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరంతా ఈ ఏడాదే ప్రభుత్వోద్యోగులుగా పదవీ విరమణ పొందారు. ఇటీవల ప్రధాన సమాచార కమిషనర్ ఆర్.కె.మాథుర్‌తో పాటు ముగ్గురు సమాచార కమిషనర్లు శ్రీధర్ ఆచార్యులు, యశోవర్ధన్ ఆజాద్, అమితవ భట్టాచార్య పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. దీంతో అప్పుడున్న ఇతర ముగ్గురు కమిషనర్లు వీలైనంత త్వరగా ఈ ఖాళీలను భర్తీ చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నియామకాల్లో పారదర్శకత ఏది?: మాడభూషి సాక్షి, న్యూఢిల్లీ: సీఐసీ నియామకాల్లో పారదర్శకత పాటించాలని మాజీ సీఐసీ మాడభూషి శ్రీధరాచార్యులు కోరారు. కేవలం పరిపాలన రంగానికి చెందిన అధికారులనే కాకుండా ఇతర రంగాలకు చెందిన వారినీ కమిషనర్లుగా నియమించాలన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీకి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత ఖర్గేకు లేఖలు రాశారు. సీఐసీ సభ్యుల ఎంపిక కమిటీలో ప్రధాని, ప్రతిపక్ష నేత సభ్యులు. సీఐసీ సభ్యుల ఎంపిక సమాచార హక్కు చట్టం నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నందునే పలువురు కోర్టుల్లో ప్రజాప్రయోజన వ్యాజ్యా(పిల్)లు దాఖలు చేస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. ‘సీఐసీ కమిషనర్లుగా కేవలం పరిపాలన వర్గాల వారినే ఎందుకు నియమిస్తున్నారు? న్యాయం, సామాజిక సేవ, మీడియా, జర్నలిజం, సైన్స్, టెక్నాలజీ తదితర రంగాల వారినీ నియమించాలన్న సమాచార హక్కు చట్ట నిబంధనలను ఎందుకు పాటించరు? ఇటీవల నియమించిన నలుగురినీ బ్యూరోక్రాట్ల నుంచే ఎందుకు ఎంపిక చేశారు?’ అని ప్రశ్నించారు. సీఐసీతోపాటు రాష్ట్రాల సమాచార హక్కు కమిషన్(ఎస్ఐసీ)లలో సకాలంలో నియామకాలు చేపట్టాలన్న నిబంధనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. -
కేంద్రమే కేసులతో బెదిరిస్తోంది
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంలో భాగమైన సమాచార కమిషన్‌పై ఆ కేంద్రమే స్వయంగా కోర్టుల్లో కేసులు వేసి బెదిరిస్తోందని ఇటీవలే సమాచార కమిషనర్ పదవి నుంచి విరమణ పొందిన మాడభూషి శ్రీధర్ ఆచార్యులు ఆరోపించారు. సమాచారం బయటకు రాకుండా అడ్డుకునేందుకు, సమాచార కమిషన్, కమిషనర్లను కేసులతో భయపెట్టేందుకే కేంద్రం ఇలా చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా కోరుతూ రాష్ట్రపతికి లేఖ రాశారు. ఉద్దేశపూర్వక రుణ ఎగవేత దారుల వివరాలు బయటపెట్టాలంటూ ఇటీవల భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ)ను శ్రీధర్ ఆచార్యులు ఆదేశించడం, అనంతరం ఈ విషయంలో ప్రధాన సమాచార కమిషనర్ ఆర్కే మాథుర్‌తో ఆయనకు విభేదాలు తలెత్తడం తెలిసిందే. ‘ఇక్కడ కేంద్రం లక్ష్యం సీఐసీ (కేంద్ర సమాచార కమిషన్), భారత పౌరులే. ఈ కేసులను గెలవడం కేంద్రం ఉద్దేశం కాదు. సీఐసీ కమిషనర్లను భయపెట్టడమే వారికి కావాలి’ అని శ్రీధర్ ఆరోపించారు. రుణ ఎగవేతదారుల వివరాలు బయటపెట్టాలని సుప్రీంకోర్టు కూడా గతంలోనే ఆర్బీఐని ఆదేశించిందనీ, అయినా సమాచారం బయటకు రాకపోవడంతో తాను మరోసారి ఆదేశాలు జారీ చేశానని ఆయన తెలిపారు. అయితే ఆర్బీఐ తనపై బాంబే హైకోర్టులో కేసు వేసిందని పేర్కొన్నారు. ఒక్క కేసులో మూడు నోటీసులు ప్రధాని మోదీ విద్యార్హతలకు సంబంధించిన వివరాలు ఇవ్వాల్సిందిగా గుజరాత్ విశ్వవిద్యాలయాన్ని తాను ఆదేశిస్తే గుజరాత్ హైకోర్టులో యూనివర్సిటీ ఆ ఆదేశాలను సవాల్ చేసిందని శ్రీధర్ ఆచార్యులు తెలిపారు. ఆ కేసులో తనను సమాచార కమిషనర్‌గా, సీఐసీ ప్రతినిధిగా, వ్యక్తిగతంగా.. మూడు హోదాల్లో ప్రతివాదిగా చేర్చారనీ, ఒక్క కేసులో మూడు నోటీసులు వచ్చాయని ఆయన తెలిపారు. ఈ కేసులో కేంద్రం తరఫున వాదించేదుకు అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు వచ్చారనీ, మరి సీఐసీ కమిషనర్ అయిన తాను కూడా కేంద్ర ప్రభుత్వంలో భాగమే కానీ తన తరఫున మాత్రం ఏఎస్జీ వాదించలేదని శ్రీధర్ ఆచార్యులు వెల్లడించారు. సీఐసీ, సమాచార కమిషనర్లపై ప్రస్తుతం 1,700 కేసులు కోర్టుల్లో ఉండగా వాటిలో అత్యధిక శాతం కేంద్రం లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థలు వేసినవేనని ఆయన వెల్లడించారు. -
సీఐసీలో పోస్టుల భర్తీకి ప్రకటన
న్యూఢిల్లీ: కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ)లోని ఖాళీల భర్తీకి కేంద్రం ప్రకటన విడుదల చేసింది. సమాచార కమిషనర్ పోస్టుకు ఆసక్తి గల 65 ఏళ్లలోపు అభ్యర్థులు ప్రొఫార్మా ప్రకారం వివరాలను పంపాలని కోరింది. అభ్యర్థులు ప్రజా జీవితంలో ఉండి విస్తృత పరిజ్ఞానం, అనుభవంతోపాటు చట్టాలు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, సామాజిక సేవ, జర్నలిజం, మేనేజ్మెంట్, పరిపాలన తదితర రంగాల్లో నిపుణులై ఉండాలని తెలిపింది. వేతనం, అలవెన్సు, ఇతర సదుపాయాలు, నిబంధనలను నియామక సమయంలో వెల్లడిస్తామని ఆ ప్రకటనలో పేర్కొంది. సీఐసీలో 10 మంది కమిషనర్లకు గాను ప్రధాన సమాచార కమిషనర్ రాథా కృష్ణ మాథుర్ సహా ప్రస్తుతం ఆరుగురు మాత్రమే పనిచేస్తున్నారు. సమాచార హక్కు చట్టంలో పలు మార్పులు చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. సమాచార కమిషనర్ల వేతనాలు, అలవెన్సులు, ఇతర నియమ నిబంధనలను ప్రభుత్వం సూచించిన విధంగానే ఉండాలి. వారి పదవీ కాలం ఐదేళ్లు కాకుండా ప్రభుత్వం సూచించిన కాలానికే పరిమితం కావాలి.. వంటివి కూడా ఉన్నాయి. ఇటువంటి మార్పులతో ఈ చట్టాన్ని బలహీన పరిచేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకుంటామంటున్నారు. -
సమాచార కమిషనర్ల భర్తీలో ఇంత నిర్లక్ష్యమా?
న్యూఢిల్లీ: కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) తోపాటు రాష్ట్రాల సమాచార కమిషన్ల (ఎస్ఐసీ)లో పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉండటంపై సుప్రీంకోర్టు స్పందించింది. సీఐసీ, ఎస్‌ఐసీల్లో ఖాళీ పోస్టులను ఎప్పటిలోగా భర్తీ చేస్తారో తెలపాలని కేంద్రానికి, తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, ఒడిశాలకు నోటీసులిచ్చింది. 4వారాల్లోగా అఫిడవిట్ సమర్పించకుంటే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందంది. సమాచార హక్కు కార్యకర్త అంజలి భరద్వాజ్ తదితరులు వేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది. ‘ప్రస్తుతం సీఐసీలో 4 పోస్టులను భర్తీ చేయాల్సి ఉండగా ఈ ఏడాది డిసెంబర్ నాటికి ప్రధాన సమాచార కమిషనర్ సహా మరో నాలుగు పోస్టులు ఖాళీ కానున్నాయి. ‘సీఐసీలో 23వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎస్ఐసీలో ఒక్క సభ్యుడినీ నియమించలేదు. ప్రధాన సమాచార కమిషనర్ లేకుండానే గుజరాత్, మహారాష్ట్ర కమిషన్లు నడుస్తున్నాయి’ అని పిటిషనర్ తరఫు లాయరు ప్రశాంత్ భూషణ్ అన్నారు. సీఐసీ, ఎస్ఐసీలకు కమిషనర్లను నియమించకుండా కేంద్ర, రాష్ట్రాలు స.హ. చట్టాన్ని నీరుగారుస్తున్నాయన్నారు. -
సమాచార కమిషనర్ల నియామకం చెల్లదు
హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీం ధర్మాసనం సాక్షి, న్యూఢిల్లీ: నిబంధనలకు విరుద్ధంగా నియమితులైనందున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నలుగురు సమాచార కమిషనర్ల నియామకం చెల్లదని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సమాచార కమిషనర్లుగా డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు, లాం తాంతియాకుమారి, ఎస్.ఇంతియాజ్ అహ్మద్, ఎం.విజయనిర్మల నియామకం చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఈ నలుగురు సుప్రీం కోర్టును ఆశ్రయించగా 2013 అక్టోబర్‌లో స్టే ఇచ్చిన సుప్రీం కోర్టు.. తాజాగా గురువారం జరిగిన తుది విచారణలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జె.ఎస్.ఖేహర్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 06.02.2013న ఈ నలుగురు సమాచార కమిషనర్ల నియామకానికి సంబంధించి జీవోనంబరు 75ను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఈ నియామకాన్ని సవాలు చేస్తూ హోం శాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య, మాజీ ఐఎఫ్ఎస్ అధికారి పద్మనాభరెడ్డి, రావు చెలికాని 25 మార్చి 2013న హైకోర్టులో ఒక ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. అఫిడవిట్లు మాత్రమే.. ఆధారాలు లేవు ‘‘31 జనవరి 2012న ఈ నియామకాలకు సంబంధించి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, ఉప ముఖ్యమంత్రితో కూడిన కమిటీ సమా వేశమై సమాచార కమిషనర్లుగా నియమించేం దుకు 8 పేర్లతో గవర్నర్‌కు ప్రతిపాదన పంపింది. ఈ 8 పేర్లలో నలుగురి పేర్లను గవర్నర్ ఆమోదించారు. సి.మధుకర్‌రాజు, ఎస్.ప్రభాకర్‌రెడ్డి, పి.విజయ్‌బాబు, ఎం.రతన్ŒS ల పేర్లను ఆమోదించిన గవర్నర్... డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు, తాంతియాకుమారి, ఎస్.ఇంతియాజ్ అహ్మద్, ఎం.విజయనిర్మల పేర్లను తిరస్కరించారు. కమిటీ రెండోసారి సమావేశమై ఈ నిర్ణయాన్ని పునః సమీక్షించకుండా అవే పేర్లను తిరిగి పంపించింది. ఈ నేపథ్యంలో 2013 ఫిబ్రవరి 6న వీరి నియామకంపై ప్రభుత్వం జీవో వెలువరించింది.. అయితే ఈ నలుగురు తమ తమ రాజకీయ పార్టీలకు రాజీనామా చేసినట్టు ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం అఫిడవిట్లో తమకు ఏ పార్టీతో సంబంధం లేదని పేర్కొన్నారు. అలాగే బార్ కౌన్సిల్ నుంచి ఐదేళ్ల పాటు సభ్యత్వ సస్పెన్షన్ లేఖ తెచ్చుకోలేదు. ఈ కారణాల రీత్యా వీరి నియామకాలను రద్దు చేయాలి..’’ అని వారు పిటిషన్లో కోరారు. -
మరో నలుగురు కమిషనర్లకు హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామకంపై తలెత్తిన వివాదంతో ఇప్పటికే నలుగురిపై వేటు వేసిన హైకోర్టు, మరో నలుగురు కమిషనర్లు మధుకర్‌రాజ్, ప్రభాకర్‌రెడ్డి, రతన్, విజయబాబులకు కూడా శుక్రవారం నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో 2 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అశుతోష్ మొహంతా, జస్టిస్ ఏ రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. సమాచార కమిషనర్లుగా పైన పేర్కొన్న వారి నియామకం రాజ్యాంగానికి, సమాచార హక్కు చట్ట నిబంధనలకు విరుద్ధమని, వారి నియామకాన్ని కొట్టివేయాలని కోరుతూ సామాజిక కార్యకర్తలు సి.జె.కరీరా, భార్గవి తదితరులు వేర్వేరుగా హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. కమిషనర్ల నియామకంలో పారదర్శకత లోపించిందని, రాజకీయ కారణాలతోనే వీరి నియామకాలు జరిగాయని పిటిషనర్లు పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.