‘ఆర్ట్ ఎట్ తెలంగాణ’ ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: వందేళ్ల తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర ప్రతిబింబించే చిత్రాలతో కూడిన ‘ఆర్ట్ ఎట్ తెలంగాణ’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మంగళవారం ఆవిష్కరిం చారు. దీనికి మెట్రోపొలిస్ సదస్సు వేదికైం ది. 1994 -2014 వరకు ఆధునిక చిత్రకళ పరిణామక్రమాన్ని తెలిపేవిధంగా వందమంది చిత్రకారులు వేసిన చిత్రాలు ఇందు లో ఉన్నాయి. పుస్తకం తొలి ప్రతిని మెట్రోపొలిస్ అధ్యక్షుడు జీన్‌పాల్ హ్యూకన్‌కు అందజేశారు. ప్రముఖ సినీ దర్శకుడు, చిత్రకారుడు బి.నరసింగరావు, చిత్రకారుడు లక్ష్మణ్ ఏలే, సీనియర్ న్యాయవాది నిరంజ న్‌రెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి, ప్రభుత్వ సలహాదారు బీవీ పాపారావులతో కూడిన ట్రస్ట్ ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఈ పుస్తకాన్ని వెలువరించింది. ఈ పుస్తకంలోని చిత్రాలను వేసినవారు ఇటీవల నిర్వహిం చిన చిత్రకళాశిబిరంలో వేసిన చిత్రాలను సైతం వేదిక వద్ద ప్రదర్శనకు ఉంచారు.
కలాంను ఆకట్టుకున్న చిత్రాలు
మెట్రోపొలిస్ సదస్సులో కీలకోపన్యాసం చేసేందుకు వడి వడిగా వెళ్తున్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం చిత్ర ప్రదర్శనను చూసి ఆగిపోయారు. అందులోని చిత్రాలకు ముగ్ధుడయ్యారు. నల్లగొండ జిల్లాకు చెం దిన వర్ధమాన కళాకారుడు గుండా ఆంజనేయులు వేసిన ఒక చిత్రం ఆయనను కట్టిపడేసింది. తన ఉపన్యాసంలోనూ ఆయన ఈ చిత్రాన్ని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ట్రస్ట్ సీఈవో వైదేహిరెడ్డి, లక్ష్మణ్ ఏలే, ఆనంద్ హుటాహుటిన ఆంజనేయులును వేదిక వద్దకు రప్పించి కలాంకు పరిచయం చేశారు. ట్రస్ట్ తరఫున కలాంకు చిత్రపటాన్ని బహూకరించారు. ఆంజనేయులుకు మాదిరిగా తెలంగాణలోని చిత్రకారులందరికీ గుర్తింపు వస్తుందని ట్రస్ట్ విశ్వాసం వ్యక్తం చేసింది.