శాంతితోనే సామరస్యం
ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు, ఆధ్యాత్మికవేత్త రవిశంకర్
సాక్షి, హైదరాబాద్: అభిప్రాయభేదాలు ఉండ టం తప్పు కాదని, శాంతితోనే ఈ భేదాలన్నీ సమసిపోయి సామరస్యం వెల్లివిరుస్తుందని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు, ఆధ్యాత్మిక వేత్త శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు. అజ్ఞాతంలో పనిచేస్తోన్న ఎలాంటి తీవ్రవాద సంస్థలైనా తిరిగి జనజీవనస్రవంతిలో కలిసేందుకు తమ వంతు సహాయం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అస్సాంలోని గువాహటిలో గురు వారం ‘భిన్నత్వంలోని బలం – ఈశాన్య రాష్ట్రాల ఆదిమ ప్రజల సదస్సు’ అనే అంశంపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
అనంతరం అస్సాం తీవ్రవాద సంస్థ ఉల్ఫా జనరల్ సెక్రటరీ అనూప్ చెతియాతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు.వివిధ తీవ్రవాద గ్రూపులు ఒకే వేదికపై ఈశాన్య రాష్ట్రాల సమస్యలపై చర్చించడం సంతోషంగా ఉందన్నారు. ఈశాన్య రాష్ట్రాలకు ఈ సదస్సు ఒక గొప్ప ముందడుగుగా అభివర్ణించారు. ఆయుధాలను వీడి జనజీవనస్రవంతిలో కలిసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎంతోమంది యువకులు తమ ఆకాంక్షను వెలిబుచ్చుతున్నా రన్నారు. ఇటీవల ప్రభుత్వానికి లొంగి పోయిన 68 మంది మిలిటెంట్ల విషయంలో ప్రభుత్వ స్పందన కోసం వారు ఎదురు చూస్తు న్నారన్నారు.
గత కొన్నేళ్లుగా జరిగిన హింసలో బాధితులైన వారిని చూస్తే హృదయం ద్రవి స్తుందని, ఇప్పటికైనా శాంతి వాతావరణం నెలకొనాలి అని కోరారు. ఈ రోజు తుపాకుల సంస్కృతి నుంచి పూలదండల సంస్కృతి వైపు పయనించామని, బాంబులకు బదులుగా పూలబొకేలు విరుస్తున్నాయని సభను ఉద్దే శించి అన్నారు. ఆఖరి ఆయుధం శాంతించే వరకు ఈశాన్య రాష్ట్రాల్లోని పలు గ్రూపులతో ఆర్ట్ ఆఫ్ లివింగ్ పని చేస్తూనే ఉంటుం దన్నారు. సదస్సులో తీవ్రవాద నాయకులు, వివిధ గ్రూపుల ప్రతినిధులు, అజ్ఞాత సంస్థల మాజీ నాయకులు పాల్గొన్నారు.