
రైతు యూనిట్ గా పంటల బీమా
♦ వడగండ్ల వానలతో నష్టపోయిన పంటలకు వర్తింపు: పోచారం
♦ మూడు వ్యవసాయ సంస్థల వెబ్‌సైట్లు ప్రారంభించిన మంత్రి
సాక్షి, హైదరాబాద్: వడగండ్ల వానలతో నష్టపోయిన పంటలకు రైతు యూనిట్‌గా బీమా చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించిందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా తీర్చిదిద్దడంలో భాగంగా తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థ, తెలంగాణ విత్తన సంస్థ, ఆయిల్‌ఫెడ్ వేర్వేరుగా రూపొందించిన వెబ్‌సైట్లను బుధవారం మంత్రి ఆవిష్కరించారు. వెంటనే రూ.49.52 లక్షల సొమ్మును ఆన్‌లైన్‌లో 200 మంది రైతులకు విడుదల చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సబ్సిడీపై ఇస్తున్న విత్తనానికి ఉన్న సీలింగ్‌ను ఎత్తేయడం వల్ల అదనంగా మరో రూ.130 కోట్ల మేరకు ఖర్చవుతుందని, దీనికి సీఎం అంగీకరించారని చెప్పారు.
నియోజకవర్గానికి ఒక గ్రామం చొప్పున ఒక్కో విత్తన కంపెనీ విత్తన ఉత్పత్తి రైతులకు సాయం చేసేందుకు, దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చాయన్నారు. వరి విత్తన రైతుకు కూడా బ్రీడర్ సీడ్‌పై సబ్సిడీ ఇస్తామన్నారు. విత్తన రైతులకు ఇక నుంచి ఆన్‌లైన్ ద్వారానే నగదు చెల్లింపులుంటాయన్నారు. గ్రీన్‌హౌస్, సబ్సిడీపై ట్రాక్టర్లు, సూక్ష్మసేద్యం తదితర వాటిల్లో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీపోను రైతు చెల్లించాల్సిన సొమ్ముకు సహకార బ్యాంకుల ద్వారా రుణాలు ఇస్తామని పోచారం వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న 906 సహకార సంఘాల ద్వారా రైతులకు విత్తనాలు, ఎరువులు సరఫరా చేస్తామన్నారు. ఎరువులు, విత్తనాలను మండల వ్యవసాయాధికారి, సహకార సంఘానికి చెందిన ప్రతినిధి కలసి రైతులకు సబ్సిడీపై అందజేస్తారన్నారు.
ప్రస్తుతం ఎరువులు 2.76 లక్షల టన్నుల బఫర్ స్టాకు ఉందన్నారు. ఈ సహకార సం ఘాల ద్వారానే రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర అందేలా చూస్తామన్నారు. ఆ ప్రకారం వ్యవసాయ, సహకార శాఖలను అనుసంధానం చేస్తామన్నారు. పత్తికి ప్రత్యామ్నాయంగా సోయాబీన్, మొక్కజొన్న, కంది తదితర పంటలు వేయాలని రైతులకు మంత్రి సూచించారు. వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారధి, ఉన్నతాధికారులు ప్రియదర్శిని, ఎ.మురళి, కేశవులు, కోడూరు రవీందర్‌రావు, మురళీధర్, విత్తన కంపెనీల అధిపతులు భాస్కర్‌రావు, ఏఎస్‌ఎన్ రెడ్డి, సంపత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రైతుల నిలదీత...
వెబ్‌సైట్ల ప్రారంభ కార్యక్రమంలో కొందరు రైతులు మంత్రి పోచారాన్ని నిలదీశారు. వరంగల్ జిల్లాకు చెందిన ఒక రైతు తనకు నేషనల్ సీడ్స్ నుంచి 6 నెలలుగా డబ్బులు రావడంలేదని పేర్కొన్నారు. మరో రైతు మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో రైతులకు బోనస్ ఇస్తుంటే.. తెలంగాణలో ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో పుట్టడమే తాము చేసుకున్న దురదృష్టమా అని మంత్రిని నిలదీశారు. కంది విత్తనానికి సరైన ధర లేదని మరో రైతు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.