కోల్‌బెల్ట్ : సింగరేణిలో అవుట్ సోర్సింగ్‌కు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐ టియూసి) భూపాలపల్లి ఏరియా ఆధ్వర్యంలో చేపట్టారు. ఏరియాలోని గనులు, డిపార్ట్‌మెంట్‌ల వద్ద ఏఐటియూసి నాయకులు, కార్మికులు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బ్రాంచి కార్యదర్శి ఎం. రమేష్ మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం సింగరేణిలోని పలు గనులలో అవుట్ సోర్సింగ్ విధానంతో అండర్‌గ్రౌండ్ గనులలో ప్రైవేట్ సంస్థలతో బొగ్గు వెలికి తీసే ప్రక్రియను అమలు చేసేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసిందన్నారు. యాజమాన్యం చేపడుతున్న చర్యల వల్ల శాశ్వత కార్మికులకు నష్టం జరిగే ప్రమాదముందన్నారు. యాజమాన్య వైఖరిని నిరసిస్తూ ఈనెల 14,15 తేదీల్లో గనుల వద్ద మేనేజర్‌లకు నిరసన పత్రాలను అందజేయటం జరుగుతుందన్నారు.
రేపు అంబేద్కర్ జయంతి సదస్సు....
భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 125 జన్మదినం సందర్భంగా ఈనెల 14న స్థానిక ఏఐటియూసి కార్యాలయంలో జయంతిని నిర్వహిస్తామని బ్రాంచి కార్యదర్శి రమేష్ వెల్లడించారు. సదస్సుకు కార్మికవర్గం అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.