అశ్రునయనాలతో ఎల్కోటికి వీడ్కోలు | Asrunayanalato elkotiki goodbye | Sakshi
Sakshi News home page

అశ్రునయనాలతో ఎల్కోటికి వీడ్కోలు

Published Thu, Jan 22 2015 4:05 AM | Last Updated on Sat, Sep 2 2017 8:02 PM

అశ్రునయనాలతో ఎల్కోటికి వీడ్కోలు

అశ్రునయనాలతో ఎల్కోటికి వీడ్కోలు

ఊట్కూర్  : అశ్రునయనాలతో మాజీ మంత్రి ఎల్కొటి ఎల్లారెడ్డి అంత్యక్రియలు స్వగ్రామంలో నిర్వహించారు. ఈనెల 6న మాజీ మంత్రి ఎల్కొటి ఎల్లారెడ్డి ఊట్కూర్‌లోని తన స్వగృహంలో బాత్‌రూమ్‌లో కిందపడ్డాడు. దీంతో అయన తలకు బలమైన గాయాలై కోమాలోకి వెళ్లగా కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించగా మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. దీంతో బుధవారం తెల్లవారుజామున ఇక్కడికి తీసుకొచ్చారు. అనంతరం ఆయన పార్థివదేహాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజల సందర్శనార్థం సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంచారు.

భారీ సంఖ్యలో చేరుకున్న వారు ఆయన పార్థివదే హానికి  పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువెళ్లి తమ పొలంలో ఖననం చేశారు. అంతకుముందు ఎల్లారెడ్డి పార్థివదే హాన్ని పాలమూరు ఎంపీ జితేందర్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు కె.తారకరామారావు, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, మాజీ మంత్రి గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ, ఎమ్మెల్యేలు చిట్టెం రాంమోహన్‌రెడ్డి, అంజయ్య యాదవ్, ఎస్.రాజేందర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు డీకే భరతసింహారెడ్డి, దయాకర్‌రెడ్డి, ఎర్ర శేఖర్, రాములు, జైపాల్‌యాదవ్, స్వర్ణసుధాకర్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రతంగపాండ్‌రెడ్డి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు విఠల్‌రావుఆర్యా, ‘పేట’, గద్వాల ఇన్‌చార్జీలు శివకుమార్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి; బీజేపీ రాష్ట్ర నాయకులు నాగురావునామాజీ, నింగిరెడ్డి, పద్మజారెడ్డి, కొండయ్య; టీడీపీ నాయకులు రమేశ్‌గౌడ్ తదితరులు పూలమాలలు వేసి నివాళిలర్పించారు.

ఈ కార్యక్రమంలో వేలాదిమంది అభిమానులు ఆయా పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. కాగా ఎల్లారెడ్డి అంత్యక్రియలను ప్రభుత్వం అధికార లాంచనాలతో నిర్వహించింది. ఈ సందర్భంగా నారాయణపేట డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, మక్తల్ సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు మూడు రౌండ్లు గాలిలోకి తుపాకులను పేల్చారు. బాధిత కుటుంబసభ్యులను అన్ని విధాలా అదుకుంటామని రాష్ట్ర పంచాయితీ, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు.
 
నిజాయితీకి ప్రతిరూపం ఎల్లారెడ్డి
మహబూబ్‌నగర్ అర్బన్ : రాష్ట్ర మంత్రి స్థాయికి ఎదిగినా పేదోడిగానే మిగిలిన ఎల్కొటి ఎల్లారెడ్డి నిజాయితీ, నిరాడంబతకు ప్రతిరూపమని కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి కీర్తించారు. బుధవారం ఆయన ఢిల్లీ నుంచి విలేకరులతో ఫోన్‌లో మాట్లాడారు. ఎల్లారెడ్డి మరణం ప్రజాస్వామ్య రాజకీయాలకు తీరని లోటని, ఆయన తనకు మంచి మిత్రుడని అన్నారు. భగవంతుడు బాధిత కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతూ సంతాపం ప్రకటించారు.
 
 ఎల్లారెడ్డి మంచి నాయకుడు
 కల్వకుర్తి : మాజీ మంత్రి ఎల్కొటి ఎల్లారెడ్డి మంచి నాయకుడని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎడ్మ కిష్టారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాసేవలో ఎంతో అంకితభావంతో పనిచేశారని కొనియాడారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement