రాజకీయ హత్య
బెల్లంపల్లి మండలం కన్నాల సర్పంచ్ దారుణ హత్య
ప్రజా సేవ చేయాలనే ఆశతో ఏడాది క్రితమే సర్పంచ్‌గా ఎన్నికయ్యాడు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం.. రాష్ట్రీయ రహదారి పక్కన రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమి ఆక్రమణను అడ్డుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాడు. కానీ.. ఆ నీతి రాజకీయాలే ఆయన ప్రాణాలు బలిగొన్నాయి. ఒక్కరుకాదు.. ఇద్దరు కాదు.. నలుగురైదుగురు మూకుమ్మడిగా దాడి చేసి ఆయనను హతమార్చారు. బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీ సర్పంచ్ మంద రవి హత్య ఉదంతమిది. పార్టీలో చురుకైన కార్యకర్తగా కొనసాగడం.. భూకబ్జాలను అడ్డుకున్నందుకే దుండగులు ఆయనను అంతమొందించారనే ప్రచారం స్థానికంగా సాగుతోంది.
బెల్లంపల్లి/బెల్లంపల్లి రూరల్ : బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామపంచాయతీ సర్పంచ్ మంద రవి హత్య స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది. పట్టపగలు గొడ్డలి, ఇనుప రాడ్, బండరాళ్లతో అతి కిరాతకంగా సర్పంచ్‌ను చంపివేశారు. రవి హత్య వెనుక బలమైన కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏడాది క్రితం ఆయన సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌లో చురుకైన కార్యకర్తగా పేరు తెచ్చుకున్న రవికి ఆ గ్రామంలో కొంత మందితో తగాదాలు కూడా ఉన్నాయి.
పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తుండడంతో అది పలువురికి గిట్టలేదు. దీంతో ఆ తగాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ క్రమంలోనే దుండగులు గతంలో రెండుసార్లు రవిపై హత్యాయత్నం కూడా చేశారు. త్రు టిలో ప్రత్యర్థుల దాడుల నుంచి రెండుసార్లు తప్పించుకున్నారు. అప్పటి నుంచి అప్రమత్తంగా ఉంటున్న రవి శనివారం పట్టపగలు గ్రామపంచాయతీ కార్యాలయం లో హత్యకు గురికావడం కలకలం రేపింది. సర్పంచ్‌గా ఎన్నికైనప్పటి నుంచి రవి, ప్రత్యర్థుల మధ్య వైషమ్యాలు మరింత పెరిగాయి. కన్నాల శివారులో రాష్ట్రీయ రహదారి పక్కన రూ. కోట్లు విలువ చేసే సుమారు 15 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆయనతో విభేదాలున్న వారే ఆక్రమించుకునేందుకు ప్రయత్నించారు. ప్రభుత్వ భూ మిని ప్లాట్లుగా చేసి విక్రయించేందుకు పన్నాగం ప న్నారు. దీంతో సర్పంచ్‌గా రవి వారి దుశ్చర్యలను అడ్డుకున్నారు.ఇది మింగుడు పడని ప్రత్యర్థులు సర్పంచ్‌ను ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. అదును కోసం వేచి చూస్తున్న క్రమంలో పంచాయతీ కార్యాలయంలో పథకం ప్రకారం దాడికి దిగి దారుణంగా చంపేశారు. కేవలం పాత కక్షలు, భూ తగాదాల కారణంగానే రవి హత్య జరిగినట్లు తెలుస్తోంది.
ఊరి నుంచి వెళ్లొచ్చినా..
ఎప్పటికప్పుడు ప్రత్యర్థులు నీడలా వెంటాడుతుండటంతో రవి కన్నాల గ్రామ సర్పంచ్‌గా గెలుపొందినా బెల్లంపల్లికి మకాం మార్చారు. కన్నాలబస్తీలో ఉంటున్నారు. రోజూ కన్నాల గ్రామానికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకొని మళ్లీ బెల్లంపల్లికి రాస్తున్నారు. అయినా.. ప్రత్యర్థులు మాత్రం రవిని ఎప్పటికప్పుడు వెంబడిస్తూనే ఉన్నారు. సాధారణంగా సర్పంచ్ వెంట ఓ ఇద్దరు ముఖ్య అనుచరులు వెన్నంటి ఉంటారు. శనివారం మాత్రం సదరు వ్యక్తులు రవి వెంట కనిపించనట్లు తెలుస్తోంది.
ప్రత్యర్థులు సదరు వ్యక్తులను కోవర్టుగా మార్చుకున్నారా లేదా ఏదేని కారణంతో వెంట లేకుండా చేశారా అని అనుమానాలు వస్తున్నాయి. తనను ప్రత్యర్థులు హత్య చేస్తారనే భయం ఉందని సర్పంచ్ పోలీసుల దృష్టికి ఇదివరలో తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. తనకు తుపాకీ ఇప్పించాలని లెసైన్స్ కోసం దరఖాస్తు కూడా చేసినట్లు సమాచారం. అనుమానితులపై ఫిర్యాదు కూడా చేసినట్లు కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. గ్రామం విడిచి బెల్లంపల్లిలో ఉంటున్న రవిని ప్రత్యర్థులు చివరికి కన్నాల పంచాయతీలోనే హత్య చేసి పోలీసులకు సవాల్ విసిరారు. పట్టపగలు చుట్టు పక్కల ప్రజలు చూస్తుండగానే దుండగులు ఈ దారుణ హత్యకు ఒడిగట్టారు. సమాచారం అందుకున్న డీఎస్పీ ఈశ్వర్‌రావు, టూటౌన్ ఎస్‌హెచ్‌వో మహేశ్‌బాబు, వన్‌టౌన్ ఎస్సై వేణుగోపాల్‌రావు హుటాహుటిన ఘటనాస్థలిని సందర్శించారు. హత్య జరిగిన స్థలాన్ని, హత్యకు ఉపయోగించిన మారణాయుధాలను నిశితంగా పరిశీలించారు. శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
మిన్నంటిన రోదనలు..
మంద లింగమ్మ-మల్లయ్యల చిన్న కుమారుడు రవి. పెద్ద కుమారుడు బానేష్ సింగరేణి ఉద్యోగరీత్యా గోదోవరిఖనిలో నివాసముంటున్నాడు. రవి చెల్లెళ్లు సునీత, నాగమణిలకు వివాహమయ్యాయి. తల్లిదండ్రుల వద్దనే ఉంటున్న రవికి భార్య అనిత, కూతురు మాళవిక, కుమారుడు హృదయవికాస్ ఉన్నారు. రవి ఇదివరకు కన్నాలలోని బుగ్గరాజరాజేశ్వర ఆలయ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. కాగా.. అప్పటి వరకు తమతో సరదాగా గడిపిన రవి గంట వ్యవధిలోనే దారుణ హత్యకు గురికావడం కుటుంబ సభ్యులను దిగ్భ్రాంతికి గురి చేసింది.
హత్యకు గురైన సమాచారాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపిస్తూ పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో మృతి చెంది ఉన్న రవి మృతదేహాన్ని చూసి కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులు తీవ్రంగా రోదించారు. రవి హత్యను నిరసిస్తూ స్థానిక కాంగ్రెస్ నాయకులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఆ మేరకు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. కాగా హత్యకు పాల్పడిన వారిలోంచి ఒక నిందితుడిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నట్లు సమాచారం. సర్పంచ్ రవి హత్య కన్నాల పంచాయతీలో తీవ్ర విషాదం నింపింది.