గర్భిణిపై అత్యాచారయత్నం | Assaults attempt to rape on pregnant women | Sakshi
Sakshi News home page

గర్భిణిపై అత్యాచారయత్నం

Published Tue, Mar 18 2014 2:02 AM | Last Updated on Sat, Sep 2 2017 4:49 AM

Assaults attempt to rape on pregnant women

అడ్డుకున్న భర్తపై కత్తులతో దాడి
బాధితుడి పరిస్థితి విషమం

 
హైదరాబాద్, న్యూస్‌లైన్: వైద్యం నిమిత్తం ఆస్పత్రికి వచ్చి, భర్తతో కలసి బయటకు వెళ్లిన ఓ గర్భిణిపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించిన కామాంధులు.. అడ్డుకున్న ఆమె భర్తపై కత్తులతో విచక్షణారహితంగా దాడిచేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట్‌కు చెందిన రామకృష్ణ(30), హరితలక్ష్మి(25) దంపతులు. లక్ష్మి ఆరు నెలల గర్భిణి కావడంతో రామకృష్ణ ఆమెను ఈనెల 12న నయాపూల్ మెటర్నిటీ ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో ప్రతి పనికీ లంచం ఇవ్వాల్సి రావడంతో వెంట తెచ్చుకున్న నగదు అయిపోయింది. చేతిలో చిల్లిగవ్వ లేక  ఇబ్బంది పడుతున్న వీరు.. ఆస్పత్రి పక్కనే ఉన్న సులభ్ కాంప్లెక్స్‌లో రూ.5 చెల్లించి కాలకృత్యాలు తీర్చుకునేవారు.
 
 వెళ్లిన ప్రతిసారీ డబ్బులు చెల్లించాల్సి రావడంతో ఆదివారం రాత్రి 10:30 సమయంలో ఆస్పత్రి పక్కనే ఉన్న మూసీ నది ఒడ్డున కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లారు. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న ఏడుగురు దుండగులు అక్కడికి వచ్చి లక్ష్మిపై లైంగిక దాడికి యత్నించారు. అడ్డుకోబోయిన ఆమె భర్తపై కత్తులతో దాడి చేశారు. బాధితుల కేకలు విని అటుగా వెళ్లేవారు రావడంతో దుండగులు పరారయ్యారు. సమాచారం అందుకున్న షాహినాయత్‌గంజ్ పోలీసులు రామకృష్ణను ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన షాక్‌లో ఉన్నారు. పొట్ట, మెడ, వీపు వెనుక, పక్కటెముకలు, భుజాల్లో మొత్తం 12 చోట్ల కత్తిపోట్లున్నాయని వైద్యులు తెలిపారు. పరిస్థితి విషమంగా ఉందని, 24 గంటలు వైద్యుల పర్యవేక్షణలో ఉంటే గానీ ఏమీ చెప్పలేమని పేర్కొన్నారు. కాగా, దుండగులను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు షాహినాయత్‌గంజ్ ఇన్‌స్పెక్టర్ పి.సత్తయ్యగౌడ్ తెలిపారు. పోలీసులు పది మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement