నేడు అసెంబ్లీ ప్రత్యేక భేటీ
రాష్ట్ర భూసేకరణ చట్ట సవరణల కోసం నిర్వహణ
- ఉదయం 11 గంటలకు అసెంబ్లీ.. సాయంత్రం 3 గంటలకు మండలి భేటీ
- బీఏసీలో నిర్ణయం.. సభ రెండు రోజులు జరపాలని కోరిన జానారెడ్డి
- మిర్చి ధరలు, అన్నదాతల సమస్యలపై చర్చించాలని పట్టు
- రైతులు చాలా సంతోషంగా ఉన్నారన్న ముఖ్యమంత్రి కేసీఆర్
- ఖమ్మం మార్కెట్ ఘటన ఓ కల్పిత ఆందోళన అని వ్యాఖ్య
- బీజేపీ, టీడీపీలకు అందని బీఏసీ సమావేశం పిలుపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర భూసేకరణ చట్టానికి కేంద్రం సూచించిన మేరకు సవరణలు చేయడం కోసం శాసనసభ, శాసన మండలి ఆదివారం సమావేశం కానున్నాయి. శాసనసభ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి అధ్యక్షతన శనివారం సాయంత్రం జరిగిన బీఏసీ (బిజినెస్ అడ్వయిజరీ కమిటీ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, సీఎల్పీ నేత జానారెడ్డి తదితరులు హాజరైన ఈ భేటీలో ఆదివారం జరగనున్న ఉభయసభల ఎజెండాను ఖరారు చేశారు. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశం మొదలుకానుంది. ఇక శాసన మండలిలో చైర్మన్ స్వామిగౌడ్ అధ్యక్షతన బీఏసీ భేటీ జరిగింది. మండలి సమావేశం సాయంత్రం 3 గంటలకు జరపాలని అందులో నిర్ణయించారు. ఇక గత శాసనసభ సమావేశాల్లో సస్పెండైన టీడీపీ, బీజేపీ సభ్యులను బీఏసీకి ఆహ్వానించకపోవడంతో వారు హాజరుకాలేదు.
కేసీఆర్, జానా మధ్య ఆసక్తికర చర్చ!
బీఏసీ భేటీలో సీఎం కేసీఆర్, సీఎల్పీ నేత జానారెడ్డిల మధ్య ఆసక్తికర చర్చ జరిగినట్లు సమాచారం. రాష్ట్ర భూసేకరణ చట్టాన్ని పకడ్బందీగా రూపొందించలేదని... 2013 చట్టాన్ని సక్రమంగా వినియోగించుకుని ఉంటే కేంద్ర ప్రభుత్వం తిరిగి వెనక్కి పంపేది కాదని జానారెడ్డి వ్యాఖ్యానించినట్లు తెలిసింది. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్.. ఆ చట్టం కంటే ఉన్నతమైన చట్టాన్ని తెస్తున్నామని పేర్కొన్నట్లు సమాచారం. ఇక ఆదివారాల్లో సమావేశాలు ఎందుకు పెడుతున్నారని కాంగ్రెస్ సభ్యుడు చిన్నారెడ్డి ప్రశ్నించగా... మిగతా ఆరు రోజుల్లో పాలనాపరమైన అంశాలపై దృష్టి పెడుతున్నామని, అందుకే ఆదివారం సమావేశం పెడుతున్నామని సీఎం పేర్కొన్నట్లు తెలిసింది. కాగా ఏయే సవరణలు పెడుతున్నారనే దానిపై తమకు సమాచారం ఇవ్వలేదేమని జానారెడ్డి ప్రస్తావించగా.. శాసనసభ కార్యదర్శి ఆ వివరాల కాపీలను పంపిస్తారని తెలిపినట్లు సమాచారం.
రైతులు సంతోషంగా ఉన్నారన్న సీఎం రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై, ముఖ్యంగా మిర్చి ధరలపై చర్చించడానికైనా రెండు రోజులపాటు సభ జరపాలని భేటీలో జానారెడ్డి కోరారు. అయితే రాష్ట్రంలో రైతులు చాలా సంతోషంగా ఉన్నారని సీఎం కేసీఆర్ పేర్కొన్నట్లు తెలిసింది. ఇక మిర్చి ధరలు, ఖమ్మం మార్కెట్‌పై దాడి అంశాలు ప్రస్తావన వచ్చిందని సమాచారం. దీనిపై కేసీఆర్ స్పందిస్తూ.. ‘‘అసలు రైతుల్లో ఎలాంటి ఆందోళనా లేదు. రాజకీయ పార్టీలే ఎక్కువగా ఆందోళన పడుతున్నాయి. మిర్చి రైతులు ఇప్పటికే 70 శాతం పంటను అమ్మేసుకున్నారు. ఖమ్మంలో జరిగినది ఫేక్ (కల్పిత) ఆందోళన.
ఎవరెవరు దాడి చేశారో, దాని వెనక ఎవరున్నారో అన్నీ సీసీ కెమెరాల ఫుటేజీల్లో బయటపడతది. రైతులను అనవసరంగా రెచ్చగొడుతున్నారు..’’అని కేసీఆర్ పేర్కొన్నట్లు సమాచారం. కనీసం మిర్చి రైతుకు బోనస్ అయినా ప్రకటించాలని జానా కోరినట్లు తెలిసింది. బోనస్ చెల్లింపు కేంద్రం చేతిలో ఉందని, అయినా ఇప్పటికే రూ.500 కోట్లు కావాలని కేంద్రాన్ని కోరామని, కేంద్రం ఇస్తే ఆలోచిస్తామని కేసీఆర్ వివరించినట్లు సమాచారం. బీఏసీ భేటీలో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, శాసనసభా వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు, ఎంఐఎం పక్షాన ఎమ్మెల్యే పాషా ఖాద్రీ, శాసనసభ కార్యదర్శి రాజ సదారాం తదితరులు పాల్గొన్నారు.
మూడు సవరణలివీ..
రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన భూసేకరణ చట్టాన్ని పరిశీలించిన కేంద్రం.. కొన్ని అభ్యంతరాలు తెలుపుతూ సవరణలు సూచించింది. ఆదివారం జరిగే అసెంబ్లీ సమావేశంలో ఈ మేరకు సవరణలు చేయనున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆ మూడు సవరణలు ఇవే.
చట్టం అమల్లోకి వచ్చే తేదీ (మొదటి సవరణ)
రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టంలో 2014 జనవరి ఒకటి నుంచి అమల్లోకి వస్తుందని ఒకచోట, గెజిట్ నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి అమల్లోకి వస్తుందని మరోచోట పేర్కొన్నారు. దీనిపై కేంద్ర న్యాయ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒకే చట్టంలో రెండు తేదీలు ఎలా ఉంటాయని ప్రశ్నించింది. దీంతో కేంద్ర సూచనకు మేరకు కేంద్ర భూసేకరణ చట్టం అమల్లోకి వచ్చిన 2013 జనవరి నుంచే రాష్ట్ర చట్టం కూడా అమల్లోకి వస్తుందంటూ సవరణ ప్రతిపాదించారు.
మార్కెట్ విలువ (రెండో సవరణ)
భూసేకరణ సమయంలో స్థానిక మార్కెట్ విలువకు అనుగుణంగా పరిహారం చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వ చట్టంలో ఉండగా.. దీనిపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. ముందుగానే నిర్ధారించి ఉన్న మార్కెట్ విలువ కాకుండా.. భూసేకరణ సమయంలో మార్కెట్ విలువను సవరించి, పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఈ మేరకు భూసేకరణకు ముందు ఆయా ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువలను సవరించేలా నిబంధన పొందుపర్చనున్నారు.
మెరుగైన పరిహారం చెల్లింపు పదాల్లో మార్పులు (మూడో సవరణ)
కేంద్ర చట్టం కంటే మెరుగైన పరిహారం అందిస్తామని రాష్ట్ర చట్టంలో పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో రెండు రెట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు రెట్లు, షెడ్యూల్డ్ ప్రాంతాల్లో నాలుగు రెట్ల పరిహారం ఇవ్వాలని 2013 కేంద్ర భూసేకరణ చట్టంలో ఉంది. అంతకంటే మెరుగైన పరిహారం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తన చట్టంలో పేర్కొంది. కానీ దానికి సంబంధించిన పదాల్లో మార్పులు, చేర్పులు చేయాలని కేంద్ర న్యాయ శాఖ సూచించింది. ఈ మేరకు సవరణలను ముసాయిదా బిల్లులో పొందుపర్చారు. ఆదివారం జరగనున్న శాసనసభ, మండలి ప్రత్యేక సమావేశాల్లో ఆమోదం కోసం భూసేకరణ చట్ట సవరణ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతోంది.