'ఆత్మ' ఘోష! | ATMA Funds Not Yet Allocated For Rangaraddy District | Sakshi
Sakshi News home page

'ఆత్మ' ఘోష!

Published Fri, Aug 9 2019 11:16 AM | Last Updated on Fri, Aug 9 2019 11:16 AM

ATMA Funds Not Yet Allocated For Rangaraddy District - Sakshi

చేవెళ్ల మండలంలో రైతులకు అవగాహన కల్పిస్తున్న ‘ఆత్మ’ అధికారులు (ఫైల్‌)

సాక్షి, రంగారెడ్డి: ‘ఆత్మ’ ద్వారా సాగుతోపాటు అనుబంధ రంగాల రైతులకు ఎప్పటికప్పుడు శిక్షణ ఇవ్వాలి. ఆర్గానిక్‌ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, ఇంటిగ్రేటెడ్‌ ఫార్మింగ్, ఉత్పత్తులను పెంపొందించి చీడపురుగుల నివారణ, విత్తన నిల్వలో మెలకువలు నేర్పించాలి. అదేవిధంగా అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించి అధిక దిగుబడుల సాధనకు కృషి చేయాలి. కాగా, నిధుల లేమితో ఆశించిన స్థాయిలో లక్ష్యం నెరవేరడం లేదు.

వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) జిల్లాలో నిస్తేజంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఏటా నిధులు విడుదల చేయకపోవడంతో ఆశించిన స్థాయిలో లక్ష్యం నెరవేరడం లేదు. కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు.. ఉద్యోగుల జీతభత్యాలు, చిన్నచిన్న కార్యకలాపాలకే సరిపోతున్నాయి. జిల్లాలో అధికశాతం మంది రైతులు వ్యవసాయం దాని అనుబంధ రంగాలైన పాడి, పౌల్ట్రీ, మత్స్య, ఉద్యాన పంటలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. సాగుపైనే లక్షన్నర మంది, చేపల పెంపకం, పట్టడంపై నాలుగు వేలకుపైగా, కూరగాయలు, పండ్లతోటల పెంపకం ద్వారా 30 వేల మంది ఉపాధి పొందుతున్నారు.

వీరికి ఆయా రంగాల్లో నూతన పద్ధతులు, సాంకేతికత వినియోగం తదితర అంశాలపై ఏడాది పొడవునా ‘ఆత్మ’ ఆధ్వర్యంలో శిక్షణ అందజేయాల్సి ఉంటుంది. దీంతోపాటు ఆర్గానిక్‌ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, ఇంటిగ్రేటెడ్‌ ఫార్మింగ్, ఉత్పత్తులను పెంపొందించడం, చీడ పురుగుల నివారణ, విత్తన నిల్వలో మెలకువలు నేర్పించి క్షేత్రస్థాయి పర్యటనలకు రైతులను తీసుకెళ్లి అవగాహన కల్పించడం తదితర కార్యక్రమాలను నిర్వహించాలి. తద్వారా పంటల యాజమాన్య పద్ధతులపై అవగాహనతోపాటు ఆశించిన స్థాయిలో దిగుబడులు సాధించి రైతులు లాభాలు ఆర్జించవచ్చు. ఇంతటి కీలకమైన ఆత్మ విభాగంపై రాష్ట్ర ప్రభుత్వం శీతకన్ను వేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.  

మూడేళ్లుగా ఇదే దుస్థితి 
ఆత్మ విభాగానికి ఏటా ఇంచుమించు రూ.1.62 కోట్ల నిధులు అవసరం. ఈమేరకు సదరు విభాగం అధికారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదనలు పంపుతున్నారు. ఇందులో కోత పెట్టకుండా విడుదలైతే ఉద్యోగుల జీత భత్యాలు, ఇతర కార్యక్రమాల అమలుకు వెచ్చిందే వీలుంటుంది. ఈ నిధులను 60ః40 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేయాల్సి ఉంది. అయితే, కేంద్రం తన వాటాగా విడతలుగా నిధులు విడుదల చేస్తోంది. రాష్ట్ర సర్కారు మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. గత మూడేళ్లుగా ఒక్క పైసా కూడా విడుదల చేయకపోవడం గమనార్హం. దీని ప్రభావం ఆత్మ కార్యక్రమాలపై తీవ్రంగా పడుతోంది. వార్షిక కార్యాచరణ ప్రణాళికకు అనుగుణంగా రైతుల కోసం పెద్దగా కార్యక్రమాలు చేపట్టడం లేదు. కేంద్రం నుంచి వచ్చిన నిధుల్లో నలుగురు బ్లాక్‌ టెక్నికల్‌ మేనేజర్లు, ఏడుగురు అసిస్టెంట్‌ టెక్నాలజీ మేనేజర్లు, ఒకరు చొప్పున ఉన్న సీనియర్‌ అసిస్టెంట్, కంప్యూటర్‌ ఆపరేటర్, ఆఫీస్‌ సబార్డినేట్‌లకు జీతాలు మినహా మిగిలిన డబ్బును రైతుల శిక్షణ, అవగాహన క్యాంప్‌ల నిర్వహణ కోసం సర్దుబాటు చేస్తున్నారు. ఇప్పటికైనా తెలంగాణ సర్కారు స్పందించి ఆత్మకు సరైన నిధులు కేటాయించాలని జిల్లా రైతులు, నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు.   

ఈ ఏడాది సైతం.. 
2019–20 సంవత్సరానికి కూడా రూ.1.62 కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదనలను ఇటీవల పంపారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం తొలి విడతగా ‘ఆత్మ’కు రూ.23.85 లక్షలను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు స్పందన లేదు. అయితే, మరోపక్క నిధులు రాకపోవడంతో రైతులకు శిక్షణ, అవగాహన కార్యక్రమాలపై పెద్దగా ప్రభావం చూపడం లేదని అధికారులు చెబుతున్నారు. ఈ విషయంపై ‘ఆత్మ’ ఇన్‌చార్జి ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ దివ్యజ్యోతిని ‘సాక్షి’ వివరణ కోరగా.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు ప్రస్తుతానికి రాలేదన్నారు. కొంత ఆలస్యమైనా నిధులు అందుతాయని పేర్కొన్న ఆమె.. రైతుల శిక్షణ కార్యక్రమాలను ఎక్కడా ఆపడం లేదని, కొనసాగిస్తున్నామని వెల్లడించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement