ATMA funds
-
'ఆత్మ' ఘోష!
సాక్షి, రంగారెడ్డి: ‘ఆత్మ’ ద్వారా సాగుతోపాటు అనుబంధ రంగాల రైతులకు ఎప్పటికప్పుడు శిక్షణ ఇవ్వాలి. ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్, ఉత్పత్తులను పెంపొందించి చీడపురుగుల నివారణ, విత్తన నిల్వలో మెలకువలు నేర్పించాలి. అదేవిధంగా అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించి అధిక దిగుబడుల సాధనకు కృషి చేయాలి. కాగా, నిధుల లేమితో ఆశించిన స్థాయిలో లక్ష్యం నెరవేరడం లేదు. వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) జిల్లాలో నిస్తేజంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఏటా నిధులు విడుదల చేయకపోవడంతో ఆశించిన స్థాయిలో లక్ష్యం నెరవేరడం లేదు. కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు.. ఉద్యోగుల జీతభత్యాలు, చిన్నచిన్న కార్యకలాపాలకే సరిపోతున్నాయి. జిల్లాలో అధికశాతం మంది రైతులు వ్యవసాయం దాని అనుబంధ రంగాలైన పాడి, పౌల్ట్రీ, మత్స్య, ఉద్యాన పంటలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. సాగుపైనే లక్షన్నర మంది, చేపల పెంపకం, పట్టడంపై నాలుగు వేలకుపైగా, కూరగాయలు, పండ్లతోటల పెంపకం ద్వారా 30 వేల మంది ఉపాధి పొందుతున్నారు. వీరికి ఆయా రంగాల్లో నూతన పద్ధతులు, సాంకేతికత వినియోగం తదితర అంశాలపై ఏడాది పొడవునా ‘ఆత్మ’ ఆధ్వర్యంలో శిక్షణ అందజేయాల్సి ఉంటుంది. దీంతోపాటు ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్, ఉత్పత్తులను పెంపొందించడం, చీడ పురుగుల నివారణ, విత్తన నిల్వలో మెలకువలు నేర్పించి క్షేత్రస్థాయి పర్యటనలకు రైతులను తీసుకెళ్లి అవగాహన కల్పించడం తదితర కార్యక్రమాలను నిర్వహించాలి. తద్వారా పంటల యాజమాన్య పద్ధతులపై అవగాహనతోపాటు ఆశించిన స్థాయిలో దిగుబడులు సాధించి రైతులు లాభాలు ఆర్జించవచ్చు. ఇంతటి కీలకమైన ఆత్మ విభాగంపై రాష్ట్ర ప్రభుత్వం శీతకన్ను వేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మూడేళ్లుగా ఇదే దుస్థితి ఆత్మ విభాగానికి ఏటా ఇంచుమించు రూ.1.62 కోట్ల నిధులు అవసరం. ఈమేరకు సదరు విభాగం అధికారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదనలు పంపుతున్నారు. ఇందులో కోత పెట్టకుండా విడుదలైతే ఉద్యోగుల జీత భత్యాలు, ఇతర కార్యక్రమాల అమలుకు వెచ్చిందే వీలుంటుంది. ఈ నిధులను 60ః40 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేయాల్సి ఉంది. అయితే, కేంద్రం తన వాటాగా విడతలుగా నిధులు విడుదల చేస్తోంది. రాష్ట్ర సర్కారు మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. గత మూడేళ్లుగా ఒక్క పైసా కూడా విడుదల చేయకపోవడం గమనార్హం. దీని ప్రభావం ఆత్మ కార్యక్రమాలపై తీవ్రంగా పడుతోంది. వార్షిక కార్యాచరణ ప్రణాళికకు అనుగుణంగా రైతుల కోసం పెద్దగా కార్యక్రమాలు చేపట్టడం లేదు. కేంద్రం నుంచి వచ్చిన నిధుల్లో నలుగురు బ్లాక్ టెక్నికల్ మేనేజర్లు, ఏడుగురు అసిస్టెంట్ టెక్నాలజీ మేనేజర్లు, ఒకరు చొప్పున ఉన్న సీనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్లకు జీతాలు మినహా మిగిలిన డబ్బును రైతుల శిక్షణ, అవగాహన క్యాంప్‌ల నిర్వహణ కోసం సర్దుబాటు చేస్తున్నారు. ఇప్పటికైనా తెలంగాణ సర్కారు స్పందించి ఆత్మకు సరైన నిధులు కేటాయించాలని జిల్లా రైతులు, నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఏడాది సైతం.. 2019–20 సంవత్సరానికి కూడా రూ.1.62 కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదనలను ఇటీవల పంపారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం తొలి విడతగా ‘ఆత్మ’కు రూ.23.85 లక్షలను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు స్పందన లేదు. అయితే, మరోపక్క నిధులు రాకపోవడంతో రైతులకు శిక్షణ, అవగాహన కార్యక్రమాలపై పెద్దగా ప్రభావం చూపడం లేదని అధికారులు చెబుతున్నారు. ఈ విషయంపై ‘ఆత్మ’ ఇన్చార్జి ప్రాజెక్ట్ డైరెక్టర్ దివ్యజ్యోతిని ‘సాక్షి’ వివరణ కోరగా.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు ప్రస్తుతానికి రాలేదన్నారు. కొంత ఆలస్యమైనా నిధులు అందుతాయని పేర్కొన్న ఆమె.. రైతుల శిక్షణ కార్యక్రమాలను ఎక్కడా ఆపడం లేదని, కొనసాగిస్తున్నామని వెల్లడించారు. -
ఆత్మా పథకం కింద ఏపీకి రూ. 92 కోట్లు
సాక్షి, ఢిల్లీ: ఆత్మా (అగ్రికల్చరల్ టెక్నాలాజికల్ మేనేజ్మెంట్ ఏజెన్సీ) పథకం కింద 2014-15 నుంచి ఇప్పటి వరకు దాదాపు 92 కోట్ల రూపాయలను కేంద్రం గ్రాంట్-ఇన్-ఎయిడ్ కింద విడుదల చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ శుక్రవారం రాజ్యసభకు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. ఆత్మా పథకం అమలు కోసం ప్రతి రెండు గ్రామాలకు ఒక రైతుమిత్రను నియమించేందుకు కేంద్రం అనుమతించినప్పటికీ ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఈ పథకం కింద రైతు మిత్రులను గుర్తించలేదని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రతి రైతు వ్యవసాయ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేందుకు తలపెట్టిన విస్తరణ సంస్కరణలను పల్లె పల్లెకు చేర్చడం ఆత్మ పథకం ప్రధాన ఉద్దేశాలలో ఒకటి. రైతుల అవసరాలకు అనుగుణంగా ఆత్మా పథకం కింద పనిచేసే రైతు మిత్రలు టెక్నాలజీ విస్తరణ కార్యాచరణను ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తారు. రైతుల సామర్థ్యాన్ని పెంచడం, అధిక దిగుబడులు సాధించేందుకు అవసరమైన కొత్త సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో మెళకువలు నేర్చుకోవడంలో ఇది ఎంతగానో ఉపకరిస్తుంది. తద్వారా రైతులు తమ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరను పొందగలరు’ అని పేర్కొన్నారు. ధాన్య సేకరణలో ప్రైవేట్‌కు అనుమతి రాజ్యసభలో శుక్రవారం విజయసాయి రెడ్డి అడిగిన మరో ప్రశ్నకు ఆహార, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి దాన్వే రావుసాహెబ్ దాదారావు సమాధానమిచ్చారు. కనీస మద్దతు ధర చెల్లించి రైతుల నుంచి ధాన్య సేకరణకు ప్రైవేట్ ఏజెన్సీలు, స్టాకిస్టులను అనుమతిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ ‘ప్రధాన మంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్’ (పీఎం-ఆషా)ను అక్టోబర్ 2018లో ప్రారంభించినట్లు పేర్కొన్నారు. కనీస మద్దతు ధరకు ధాన్య సేకరణ చేసే ప్రైవేట్ ఏజెన్సీల పనితనాన్ని సానుకూలంగా వినియోగించుకోవడం ఈ పథకం ఉద్దేశమన్నారు. నూనె గింజల సేకరణ కోసం వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సైతం ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. 2017-18 సీజన్లో ఈ పథకాన్ని జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో అమలు చేసి ప్రైవేట్ ఏజెన్సీలు, స్టాకిస్టుల ద్వారా కనీస మద్దతు ధరకు సేకరించే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు మంత్రి వెల్లడించారు. ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా జరిపే ధాన్య సేకరణ కోసం ప్రభుత్వం ఎలాంటి నిధులను కేటాయించలేదని ఆయన స్పష్టం చేశారు. -
నిధులు సక్రమంగా ఖర్చు చేయండి
కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు నెల్లూరు(పొగతోట) : ఆత్మ నిధులను సక్రమంగా ఖర్చు చేసేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ తన చాంబర్లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. 2016–17 సంవత్సరానికి సంబంధించి రబీ, ఖరీఫ్ కార్యక్రమాలకు అవసరమైన బడ్జెట్ ప్రణాళికలను రూపొందించాలన్నారు. గతేడాది ఖర్చు చేసి నిధుల వివరాలు అందజేయాలని కోరారు. సాగులోని నూతన విధానాలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఆత్మ పీడీ దేవసేన, వ్యవసాయ శాఖ జేడీ హేమమహేశ్వరరావు, పశుసంవర్థక శాఖ జేడీ శ్రీధర్‌బాబు, వ్యవసాయ శాఖ డీడీ విజయభారతి, హార్టికల్చర్ ఏడీలు అనురాధ, ఉమాదేవి పాల్గొన్నారు. ఓటు నమోదును పూర్తి చేయండి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఓటరు నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 5లోగా ఓటరు దరఖాస్తులను పూర్తి స్థాయిలో పరిశీలించి ఆన్లైన్లో పొందుపరచాలన్నారు. పార్ట్‌టైమ్ ఉపాధ్యాయులు ఓటుకు అర్హులు కాదన్నారు. ఓటర్ల జాబితాలను ఈ నెల 23న ప్రచురించాలన్నారు. వచ్చే నెల 8 వరకు అభ్యంతరాలు స్వీకరించాలని సూచించారు. కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు మాట్లాడుతూ ఇప్పటి వరకు 30571 పట్టభద్రుల, 1633 ఉపా«ధ్యాయుల ఓటరు దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. జేసీ ఏఎండీ ఇంతియాజ్, డీఆర్వో మార్కండేయులు పాల్గొన్నారు.