నిధులు సక్రమంగా ఖర్చు చేయండి
-
కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు
నెల్లూరు(పొగతోట) : ఆత్మ నిధులను సక్రమంగా ఖర్చు చేసేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ తన చాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. 2016–17 సంవత్సరానికి సంబంధించి రబీ, ఖరీఫ్ కార్యక్రమాలకు అవసరమైన బడ్జెట్ ప్రణాళికలను రూపొందించాలన్నారు. గతేడాది ఖర్చు చేసి నిధుల వివరాలు అందజేయాలని కోరారు. సాగులోని నూతన విధానాలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఆత్మ పీడీ దేవసేన, వ్యవసాయ శాఖ జేడీ హేమమహేశ్వరరావు, పశుసంవర్థక శాఖ జేడీ శ్రీధర్‌బాబు, వ్యవసాయ శాఖ డీడీ విజయభారతి, హార్టికల్చర్ ఏడీలు అనురాధ, ఉమాదేవి పాల్గొన్నారు.
ఓటు నమోదును పూర్తి చేయండి
ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఓటరు నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 5లోగా ఓటరు దరఖాస్తులను పూర్తి స్థాయిలో పరిశీలించి ఆన్‌లైన్‌లో పొందుపరచాలన్నారు. పార్ట్‌టైమ్ ఉపాధ్యాయులు ఓటుకు అర్హులు కాదన్నారు. ఓటర్ల జాబితాలను ఈ నెల 23న ప్రచురించాలన్నారు. వచ్చే నెల 8 వరకు అభ్యంతరాలు స్వీకరించాలని సూచించారు. కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు మాట్లాడుతూ ఇప్పటి వరకు 30571 పట్టభద్రుల, 1633 ఉపా«ధ్యాయుల ఓటరు దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. జేసీ ఏఎండీ ఇంతియాజ్, డీఆర్వో మార్కండేయులు పాల్గొన్నారు.