కాంగ్రెస్ కార్యాచరణ సదస్సులో పార్టీ పెద్దల తీరును తూర్పారబట్టిన శ్రేణులు
రంగారెడ్డి జిల్లా: ‘కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ సదస్సు’లో ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు నిర్మొహమాటంగా అభిప్రాయాలను వెల్లడించారు. పది కీలకాంశాలపై చర్చకు వేర్వేరు బృందాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ బృందాలు ప్రత్యేకంగా నిర్వహించిన బేటీల్లో దాదాపు 1500 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు తమ సలహాలు, సూచనలు వెల్లడించారు. ఈ వివరాలన్నింటినీ క్రోడీకరించి సోమవారం జరిగిన రెండోరోజు సదస్సులో వాటిని ప్రస్తావించారు.
కాంగ్రెస్‌కు చావు లేదు: జైపాల్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీకి చావులేదని కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి అభివర్ణించారు. ‘ఫినిక్స్ పక్షి పూర్తిగా భస్మమయ్యాక కూడా బూడిదలోంచి పైకి లేస్తుంది. కాంగ్రెస్ కూడా ఫినిక్స్ లాంటిదే’ అని వ్యాఖ్యానించారు రాష్ట్రంలో ఏ ఊరు వెళ్లినా కాంగ్రెస్ వల్లే తెలంగాణ వచ్చిందని చెబుతున్నారని పేర్కొన్నారు.
కఠినంగా వ్యవహరించాలి: డి.శ్రీనివాస్
పార్టీలో క్రమశిక్షణ కీలకాంశం. కాని దీనికి తగిన ప్రాధాన్యత లేకుండా పోయింది. పార్టీలో పనిచేస్తూ ఇతర పార్టీలకు సహకరిస్తున్నారు. దీంతో కిందిస్థాయి నేతల్లో చులకన భావం కలుగుతోంది. ఇకనైనా కఠినంగా వ్యవహరించాలి.
దళితుల్లో నమ్మకాన్ని కలిగించాలి: గీతారెడ్డి
దళితులకు పార్టీలో పాధాన్యత తగ్గుతోంది. గ్రామస్థాయి నుంచి పీసీసీ వరకు ఎస్సీ, ఎస్టీలకు పదవుల పంపిణీ జరగాలి. ఆర్థికంగా వెనకబడిన నాయకులకు అండగా నిలవాలి. గ్రామాలవారీగా పరిస్థితిని సమీక్షించేందుకు సమావేశాలు నిర్వహించాలి.
బీసీల బలాన్ని గమనించాలి : వీహెచ్
సీఎం కేసీఆర్ తలపెట్టిన సర్వేలో బీసీల స్థానమేంటో తెలిసిపోయింది. 60 శాతం ఉన్న బీసీలకు పదవుల్లో తీవ్ర అన్యాయం జరుగుతోంది. మండల, డీసీసీ పదవుల్లో కీలకభాగం ఈ వర్గానికివ్వాలి. బీసీ సబ్‌ప్లాన్ కోసం ఉద్యమాన్ని లేవనెత్తాలి.
మైనార్టీలకు అదనపు పదవులివ్వాలి: షబ్బీర్ అలీ
మైనార్టీ నాయకులను కేవలం ఆ వర్గానికి సంబంధించిన పదవులకే పరిమితం చేస్తున్నారు. దీంతో ప్రధాన విభాగాల్లో వీరి ప్రాధాన్యం బాగా తగ్గింది. అలా కాకుండా అన్ని విభాగాల్లో మైనార్టీలకు పదవులను ఇవ్వాలి.
మనకూ పేపర్, టీవీ కావాలి: సురేష్‌రెడ్డి
కాంగ్రెస్ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలపై ప్రచారం చేయడంలో పూర్తిగా విఫలమయ్యాం. మన ఓటమికి ప్రధాన కారణమిదే. మన కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలంటే మనకూ ఒక దినపత్రిక, టీవీ చానల్ అవసరం.
లోపాలపై దాడి.. విమర్శల జడి
Published Tue, Aug 26 2014 1:01 AM | Last Updated on Sat, Sep 2 2017 12:26 PM
Advertisement