ఏకత్వంలో భిన్నత్వం!
కాంగ్రెస్ సదస్సులో నేతల భిన్న స్వరాలు
ఐక్యంగా ఉన్నామంటూనే పరస్పర విమర్శలు
పార్టీని అన్ని స్థాయిల్లో ప్రక్షాళన చేయాలన్న గుత్తా సుఖేందర్‌రెడ్డి
కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ కోవర్టులున్నారన్న పొంగులేటి సుధాకర్‌రెడ్డి
పార్టీలో క్రమశిక్షణ లేకుండా పోయిందన్న డి. శ్రీనివాస్
హైదరాబాద్: నైరాశ్యంలో ఉన్న పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలనే లక్ష్యంతో టీపీసీసీ నిర్వహించిన ‘కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ సదస్సు’లో రాష్ర్ట నేతలు కత్తులు దూసుకోవడం కార్యకర్తలను కలచివేసింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో ఐక్యంగా ఉన్నామనే సందేశాన్ని పంపడానికి ప్రయత్నిస్తూనే ముఖ్య నేతలంతా ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకోవడం పార్టీ వర్గాలను విస్మయానికి గురిచేసింది. క్షేత్ర స్థాయిలో కాం గ్రెస్ బలోపేతానికి అనుసరించాల్సిన విధానాలను సూచిస్తూ.. మరోవైపు నాయకత్వంలోని లుకలుకలను బయటపెట్టుకోవడం కార్యకర్తల్లో నిరాశ కలిగించింది. వాస్తవాలు చెబుతున్నామంటూ పలువురు నాయకులు నాయకత్వం, ఇతర అంశాలపై విమర్శనాస్త్రాలు సంధించారు.
‘పార్టీలో క్రమశిక్షణ అంటే అర ్థం లేకుండా పోయింది. పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారంటూ సస్పెండ్ చేస్తారు. మళ్లీ తెల్లారేసరికి దాన్ని ఎత్తేస్తారు. ఇదేం పద్ధతి?’ అని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తప్పుబట్టారు. రైతుల రుణమాఫీపై మనమంతా ఎలాంటి కార్యాచరణ చేపట్టలేదని ఇప్పుడిది హాట్ టాపిక్. ఈ అంశంపై ఇప్పుడు స్పందించవద్దని మన నాయకులు అంటున్నారు. పరిస్థితులకు తగినట్టు స్పందించాలేగానీ ముహూర్తాలు పెట్టుకుంటే లాభంలేదు.
జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతుల రుణమాఫీపై మనమంతా ఎలాంటి కార్యాచరణ చేపట్టలేదు. ఇప్పుడిది హాట్ టాపిక్. ఈ అంశంపై ఇప్పుడు స్పందించవద్దని మన నేతలు అంటున్నారు. పరిస్థితులకు తగినట్టు స్పందిం చాలేగానీ ముహూర్తాలు పెట్టుకుంటే లాభంలేదు.
పార్టీ జెండా మోసేందుకు బీసీలు కావాలి గానీ అధికారంలోకి వస్తే బీసీలు పనికిరారా? అని టీపీసీసీ ఓబీసీ సెల్ చైర్మన్ చిత్తరంజన్ దాస్ మండిపడ్డారు. బీసీలను దగ్గరకు తీయకుంటే 2019 లోనూ అధికారంలోకి రామన్నారు.
మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి అభ్యర్థి కాదన్న విషయాన్ని పార్టీ శ్రేణులకు స్పష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం అభ్యర్థుల్లో పోటీ ఎక్కువైనందునే ఎన్నికల్లో ఓడిపోయామని ఆయన విశ్లేషించారు.
చిన్నారెడ్డి మాట్లాడుతూ .. తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టమైన సకల జనుల సమ్మెలో మన ప్రాధాన్యత తక్కువగా కనిపించింది. ఈ అంశాన్ని టీఆర్‌ఎస్ అనుకూలంగా మార్చుకుని ఎన్నికల్లో విజయం సాధించింది. మనం కూడా కాలేజీ స్థాయిలో వంద శాతం సభ్యత్వ నమోదు చేపట్టాలి. యువత మనవైపు ఉంటే తిరుగుండదు. అదేవిధంగా కమిటీల్లో యువతకు 50 శాతం పదవులు ఇవ్వాలి.
డి.శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ఫేస్‌బుక్, ట్విట్ట ర్ లాంటి సామాజిక మీడియాను వినియోగించాల్సిన ఆవశ్యకత ఉంది. పీసీసీ, డీసీసీ స్థాయి లో ప్రత్యేక ఖాతాలు తెరిచి సమాచారాన్ని గ్రామ స్థాయిలో క్షణాల్లో పంపించే ఏర్పాటు చేయాలి ఎంత మంది పార్టీని వీడారో, ఏయే పదవుల్లో ఉన్నవారు కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారనే లెక్కలు కూడా పీసీసీ దగ్గర లేవని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. బ్లాక్ స్థాయి నుంచి పీసీసీ వరకు పార్టీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఎమ్మెల్సీ పొంగులేటి మాట్లాడుతూ.. ఇతర పార్టీలతో మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకున్నోళ్ల వల్లే కాంగ్రెస్‌కు ఈ దుస్థితి వచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ అడుగులకు మడుగులొత్తే వాళ్లు ఇంకా ఉన్నారని, రాజీవ్‌ను తిట్టిన నేతలు కూడా పారీ ్టలో కొనసాగడం కాంగ్రెస్ దౌర్భాగ్యమన్నారు.పునాదులను నిర్మించడంలో పార్టీ విఫలమైందని ఐఎన్‌టీయూ విభాగం నేత, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ నాయకుడు రాఘవయ్య విమర్శించారు.
నేతలంతా ఆత్మస్తుతికే పరిమితమవుతున్నారని రాజ్యసభ సభ్యుడు రాపోలు అన్నారు. నిజమైన కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోవాలని సూచించారు. ఎన్నికల్లో పోటీకి ఎంత ఖర్చు పెడతావ్.. ఎంత డబ్బు ఇస్తావ్? పెద్ద నేతలే అడిగితే ఎలాగని ఎంపీ నంది ఎల్లయ్య వాపోయారు. డబ్బు ఉన్నోళ్లకే టిక్కెట్లు ఇస్తున్నారని, ఆ తర్వాత వారు పార్టీని నాశనం చేసి వెళ్లిపోతున్నారని మహబూబ్‌నగర్ డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ ప్రశ్నించారు.
నల్గొండ జడ్పీ చైర్మన్ బాలూ నాయక్ సహా పలువురు నాయకులు మాట్లాడుతూ.. కార్యకర్తలమంతా ఐక్యంగానే ఉన్నాం. ఐక్యంగా ఉండాల్సిందిమీరే. లేకపోతే మళ్లీ అధికారంలోకి రాం’’ అని వేదికపై ఉన్న నేతలకు చురకలంటించారు.