
ఇబ్రహీంపట్నం: మైనర్ బాలికను ఎందుకు వేధిస్తున్నావంటూ ప్రశ్నించిన కుటుంబసభ్యులపై దాడి చేసిన సంఘటన సోమవారం ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకుంది. ప్రధాన రహదారిపై బాలిక తండ్రి, బంధువులపై దాడికి దిగడంతో ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానిక సీఐ స్వామి కథనం ప్రకారం... నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న బాలికను ప్రతినిత్యం స్థానిక బస్టాండ్‌లో ఇమ్రాన్ (23) ముష్రాఫ్(22)లు వేధింపులకు గురిచేస్తుండేవారు. దీంతో ఆ బాలిక తన తండ్రి నజిరుద్దీన్‌కు ఈ విషయం చెప్పడంతో బస్టాండ్‌లో ఆ యువకులను హెచ్చరించి వెళ్లిపోయారు. అనంతరం ఇమ్రాన్, ముష్రాఫ్‌లు మరికొంత మంది యువకులతో కలిసి వచ్చి స్థానిక అంబేద్కర్ చౌరస్తా సమీపంలో ఉన్న నజిరుద్దీన్‌కు చెందిన ఏపీ బోర్‌వెల్స్, అతని సోదరుడికి చెందిన ఎస్‌ఎస్ ఎర్త్ మూవర్స్, స్పేర్ పార్ట్స్ దుకాణాలపై, అక్కడున్న వారిపై ఇనుపరాడ్‌లతో దాడి చేశారు.
దుకాణంలోని ఆయిల్ డబ్బాలు పగిలి రోడ్లపై ఏరులైపారాయి. ఈ సందర్భంగా అక్కడున్న నజిరుద్దీన్‌తోపాటు అతని బంధువులైన ఎండీ ఇర్షాద్(25), సోహైల్, (21)వాజిద్(22) ఎండీ రషీద్‌లు గాయపడ్డారు. కాసేపు ఆ ప్రాంతంలో భయానక వాతావారణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. నిందితుల్లో ముగ్గురు పట్టుబడగా.., మిగతా వారు పరారయ్యారు. గాయపడిన వారు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా ఈ ఘటనలో ఆయిల్ డబ్బాలు పగిలి రోడ్లపై రోడ్డుపై పారుతుండటంతో ద్విచక్ర వాహనాలు జారి పలువురికి గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు జేసీబీతో మట్టి తెప్పించి రోడ్డుపై ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. బాలిక తండ్రి నజిరుద్దీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment