బెడిసికొట్టిన కిడ్నాప్ వ్యూహం
ఇద్దరు బాలుర అపహరణకు యత్నం.. ఒక నిందితుడి పట్టివేత
జడ్చర్ల: ఇద్దరు బాలురను కిడ్నాప్ చేసేందుకు యత్నించిన ముగ్గురు ముఠా సభ్యుల్లో ఒకరు పట్టుబడ్డారు. ఈ సంఘటన మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో జరిగింది. జడ్చర్ల పట్టణం ఇందిరానగర్ కాలనీలో నివాసముంటున్న వడ్డె వెంకటేశ్, కవిత దంపతులకు మురళి (14), అభి (11) కుమారులు ఉన్నారు. ఎనిమిదేళ్ల క్రితం వెంకటేశ్ హత్యకు గురికాగా.. పిల్లలను సాకలేక ఆరేళ్ల క్రితం పరిచయం ఉన్న ఓ వ్యక్తికి కుమారుడు మురళిని తల్లి కవిత అప్పగించింది. దీంతో సదరు వ్యక్తి మురళిని కర్ణాటకకి తీసుకెళ్లి దొంగతనాలు చేయించేవాడు.
ఆ తర్వాత చిన్న కుమారుడు అభిని కూడా గుర్తు తెలియని వ్యక్తులు ఐదేళ్ల క్రితం కిడ్నాప్ చేసి అన్న మురళి దగ్గరకు చేర్చారు. అక్కడ వీరితో పాటు మరో బాలుడు కలసి రోజూ దొంగతనాలు చేస్తూ ముఠాసభ్యులకు అప్పగించేవారు. ఈ క్రమంలో మూడేళ్ల క్రితం బాలుర తల్లి కవిత అనారోగ్యంతో మృతి చెందింది. 20 రోజుల క్రితం ఎలాగోలా అన్నదమ్ములు ముఠా నుంచి తప్పించుకుని రైలులో జడ్చర్లకు వచ్చారు.
అయితే ముఠాకు చెందిన వెంకటేశ్, చంటిలు పిల్లలను వెతుక్కుంటూ జడ్చర్లకు వచ్చారు. తమకు పరిచయం ఉన్న శరణప్పను మధ్యవర్తిగా పెట్టుకుని పిల్లలను అప్పగించాలని కోరారు. అలా చేస్తే రూ.40 వేలు ఇస్తామని చెప్పారు. ఈ విషయం పిల్లల చిన్నాన్న మల్లేశ్‌కు తెలియగా ఆయన స్థానికుల సహకారంతో వారిని పట్టుకునే ప్రయ త్నం చేయగా వెంకటేశ్, చంటి పారిపోగా శరణప్ప దొరికాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
హింసించి దొంగతనాలు చేయించేవారు
కర్ణాటక బీజాపూర్‌లో తమను తీవ్రంగా హింసిస్తూ దొంగతనాలు చేయించే వారని బాలురు మురళి, అభి పోలీసులకు వివరించారు. పట్టుబడిన శరణప్ప రాయిచూర్ జిల్లా మాన్వీ తాలుకా హీరే కొట్నెకల్‌కి చెందినవాడుగా పోలీసులు గుర్తించారు. ఇక పారిపోయిన వెంకటేశ్, చంటి రంగారెడ్డి జిల్లా శంకరపల్లికి చెందినవారుగా గుర్తించారు.