ఖమ్మం: 2016-17 సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయలో 6వ తరగతిలో ప్రవేశానికి నిర్వహించే పరీక్షపై మాస్ కాపీయింగ్ ఛాయలు అలముకున్నట్టు సమాచారం. ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు సెంట్రల్ సెలబస్‌తో నిర్వహించే ఈ పాఠశాలలో సీటు సాధించిన విద్యార్థి భవిష్యత్తు.. బంగారు బాట పట్టినట్టే. అందుకే ప్రతిష్టాత్మకమైన ఈ విద్యాలయలో ‘ఎలాగైనా’ సీటు వచ్చేలా చూడాలని కొందరు తల్లిదండ్రులు, కొన్ని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు ఆరాటపడుతున్నారు. వారికి ‘మాస్ కాపీయింగ్’ మార్గంగా కనిపించింది. దీనిని సుగమం చేసేందుకుగాను కొందరు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు దళారులతో కలిసి పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు అధికారులు, పరీక్ష కేంద్రాల్లోని ఇన్విజిలేటర్లుకు డబ్బును ఎరగ వేస్తున్నారని తెలిసింది.
గతంలోనూ మాస్ కాపీయింగ్
జిల్లాలోని పాలేరు, భద్రాచలం నవోదయ పాఠశాలల్లో ప్రవేశ పరీక్షల్లో గతంలో మాస్ కాపీయింగ్ జరిగిందనే ప్రచారం ఉంది. పాలేరులోని కేంద్రంలో గతంలో ఇలా అక్రమాలు జరిగాయని విమర్శలు వచ్చాయి. ఈ ప్రవేశ పరీక్షకు ఇన్విజిలేటర్లుగా ఎస్జీటీ స్థాయి ఉపాధ్యాయులను నియమించాలన్న నిబంధన ఉంది, దీనికి విరుద్దంగా స్కూల్ అసిస్టెంట్ స్థాయి ఉపాధ్యాయులను నియమించారని అప్పుడు ఆరోపణలు వచ్చాయి.
‘‘ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, సత్తుపల్లి, మధిర ప్రాంతాల్లోని కొన్ని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు, ట్యూటర్లు కలిసి ఇలా చేయించారు’’ అని ఆనాడు ప్రచారం జరిగింది. ఇందుకోసం ఒక్కో విద్యార్థి నుంచి ఐదువేల రూపాయల వరకు వసూలు చేసినట్టు కూడా ప్రచారం సాగింది. ‘‘కొన్ని కేంద్రాల్లో పరీక్ష రాసిన వారికే ఎక్కువ సీట్లు వచ్చాయి. దీని వెనుక, ఏదో మతలబు ఉంది’’ అని, గతంలో కొందరు తల్లిదండ్రులు ఆరోపించిన ఉదంతాలు ఉన్నాయి. తాజాగా.. ఖమ్మం, కల్లూరు, అశ్వారావుపేట, భద్రాచలం, బూర్గంపాడు, కొత్తగూడెం, మధిర, వెంకటాపురంలోని పరీక్ష కేంద్రాల ద్వారా మాస్ కాపీయింగ్‌కు తెర లేపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది.
నేడు ‘నవోదయ’ ప్రవేశ పరీక్ష
పాలేరు (కూసుమంచి): 20116-17 విద్యాసంవత్సరానికిగాను పాలే రులోని జవహర్ నవోదయ విద్యాలయలో తరగతిలో ప్రవేశానికి శనివారం (9వ తేదీన) ప్రవేశ పరీక్ష జరగనుంది. ఇందుకోసం 27 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 6275 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు పరీక్ష ఉంటుంది. పరీక్ష ప్రారంభమైన అరగంట తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించేది లేదని విద్యాలయ ప్రిన్సిపల్ వి. వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ప్రతి పరీక్ష కేంద్రంలో ఒక పరిశీలకుడిని నియమించామని, నవోదయ విద్యాలయ సమితి నుంచి కూడా పరిశీలకులు పర్యవేక్షిస్తారని తెలిపారు.
పకడ్బందీగా నిర్వహిస్తాం
నవోదయ ప్రవేశ పరీక్ష కేంద్రాల్లో మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకునిని, పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. విద్యాశాఖ అధికారుల సహకారంతో ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేశాం. ఆరోపణలు వచ్చిన సెంటర్లకు ప్రత్యేక స్క్వాడ్ బృందాలను పంపిస్తున్నాం. నవోదయ పాఠశాల ఉద్యోగులతోపాటు ఢిల్లీ నుంచి ఇద్దరు పర్యవేక్షకులు వచ్చారు. ఏదేని కేంద్రంలో అవకతవకలు జరిగితే.. సబంధిత నియంత్రణ అధికారిపై వేటు పడుతుంది.
- పాలేరు నవోదయ పాఠశాల ప్రిన్సిపాల్, పరీక్షల నిర్వాహకులు
నవోదయలో కాపీయింగ్‌కు యత్నాలు!
Published Sat, Jan 9 2016 2:52 AM | Last Updated on Tue, Mar 19 2019 6:59 PM
Advertisement