Jawahar Navodaya College
-
కొడుకు కోసం పేపర్ లీక్
జవహర్ నవోదయ విద్యాలయంలోఇంటర్ పేపర్ లీక్ వైస్ ప్రిన్సిపాల్ రుక్మిణీదేవి సస్పెన్షన్ ప్రిన్సిపాల్ నిర్వాకంతో గాడి తప్పిన పాలన ఎమ్మిగనూరు : జవహార్ నవోదయ విద్యాలయం వివాదాల కేంద్రబిందువుగా మారింది. విద్యాలయంలో ఏళ్ల తరబడి తిష్టవేసిన అధికారయంత్రాంగం అక్రమాలు, విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం .. జాతీయస్థాయిలో చర్చకు దారితీసింది. 1987లో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బనవాసి దగ్గర జవహార్ నవోదయ విద్యాలయం ఏర్పాటైంది. ప్రస్తుతం 468 మంది విద్యార్థులకు 25 మంది బోధన, 16మంది బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ క్రమంలో నవోదయ మూడేళ్లుగా వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ప్రిన్సిపాల్ పూర్ణచంద్రరావు వేధిస్తున్నాడంటూ ఏడాది క్రితం విద్యార్థులు, ఉపాధ్యాయులు రోడ్డెక్కా రు. వారికి వివిధ విద్యార్థి సంఘాలు భాసటగా నిలిచి వారం పాటు ఆందోళన చేశారు. అప్పటి జిల్లా కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి చొరవ తీసుకుని సమస్య జఠిలం కాకుండా చూశారు. అయితే ఈ ఆందోళనలు డిల్లీస్థాయిలో మారుమోగాయి. గత నెలలో 7వ తరగతి విద్యార్థి దినేష్ ఎత్తులో ఉన్న మంచంపై నుంచి పడి మృతి చెందగా, రాజస్తాన్‌కు చెందిన మరో విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో నవోదయ యంత్రాంగం ఉలిక్కిపడింది. అయితే నవోదయలో విద్యార్థులు కిందపడి గాయపడటం ఇది మొదటిసారికాదనీ పదిమందికిపైగానే ఉన్నారంటూ ప్రిన్సిపాల్ పూర్ణచంద్రరావు మీడియాతో పేర్కొనడం గమనార్హం. కొడుకు కోసం.. నవోదయ విద్యాలయంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాస్తున్న కొడుకు కోసం వైస్ ప్రిన్సిపాల్ రుక్మిణీదేవి ఏకంగా ప్రశ్నపత్రాన్నే లీక్ చేశారు. మార్చి 9న కెమిస్ట్రి ప్రశ్నపత్రం బండిల్‌ను పరిశీలించిన అసిస్టెంట్ కమిషనర్ ఎంఎస్ రెడ్డి అందులో ఒకటి మిస్సయినట్లు గుర్తించారు. తన కుమారుడి కోసం ప్రశ్నపత్రాన్ని రుక్మిణీదేవి తీసుకెళ్లినట్లు కార్యాలయ సిబ్బంది లిఖితపూర్వకంగా సమాధానం చెప్పడంతో ఉన్నతాధికారులు ఈ నెల 23న ఆమెను సస్పెండ్ చేసి పాట్నా రీజియన్‌కు అటాచ్ చేశారు. ఈ నెల 26 నుంచి ప్రిన్సిపాల్ పూర్ణచంద్రరావు సెలవులో వెళ్లడంతో పి.శ్రీనివాసులు ఇన్చార్జి బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఆఫీసు స్టాఫ్‌కుగానీ, ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్‌కు గానీ ఆఫీసు తాళాలు ఇవ్వకుండా సస్పెన్షన్‌కు గురైన భార్య రుక్మిణీ కోసం ఆయన బీహార్ వెళ్లినట్లు తెలిసింది. దీంతో మూడు రోజులుగా ఉద్యోగులు హాజరు పట్టికలో సంతకాలు కూడా చేయడంలేదంటే నవోదయలో అడ్మినిస్ట్రేషన్ ఏస్థాయిలో ఉందో..ఎవరి కనుసన్నల్లో వ్యవహారాలు జరుగుతున్నాయో ఇట్టే తెలుస్తోంది. బుధవారం మీడియా ప్రతినిధులు వస్తున్నారనీ తెలుసుకున్న ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్ శ్రీనివాసులు ఏకంగా ఆఫీసు తాళాలే పగలగొట్టి సంతకాలు చేయించేశారు. సమన్వయలోపంతోనే.. ప్రిన్సిపాల్ పూర్ణచంద్రరావు సెలవులో వెళ్తూ తాళాలను లైబ్రేరియన్ సతీష్ చేతికి ఇచ్చారని ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ తెలిపారు. సతీష్.. వాళ్ల బంధువులు చనిపోయింటే కోవెలకుంట్లకు వెళ్లడంతో కీస్ అందుబాటులో లేవన్నారు. దీంతో హాజరుపట్టికలో సంతకాలు చేయ లేకపోయామన్నారు. మీడియా ప్రతి నిధులు వస్తున్నారని తెలిసే ఆఫీసు తాళాలు పగలగొట్టి హాజరుపట్టికలో సంతకాలు చేస్తున్నారా అని ప్రశ్నించగా మౌనం వహించారు. -
నవోదయలో కాపీయింగ్‌కు యత్నాలు!
ఖమ్మం: 2016-17 సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయలో 6వ తరగతిలో ప్రవేశానికి నిర్వహించే పరీక్షపై మాస్ కాపీయింగ్ ఛాయలు అలముకున్నట్టు సమాచారం. ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు సెంట్రల్ సెలబస్‌తో నిర్వహించే ఈ పాఠశాలలో సీటు సాధించిన విద్యార్థి భవిష్యత్తు.. బంగారు బాట పట్టినట్టే. అందుకే ప్రతిష్టాత్మకమైన ఈ విద్యాలయలో ‘ఎలాగైనా’ సీటు వచ్చేలా చూడాలని కొందరు తల్లిదండ్రులు, కొన్ని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు ఆరాటపడుతున్నారు. వారికి ‘మాస్ కాపీయింగ్’ మార్గంగా కనిపించింది. దీనిని సుగమం చేసేందుకుగాను కొందరు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు దళారులతో కలిసి పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు అధికారులు, పరీక్ష కేంద్రాల్లోని ఇన్విజిలేటర్లుకు డబ్బును ఎరగ వేస్తున్నారని తెలిసింది. గతంలోనూ మాస్ కాపీయింగ్ జిల్లాలోని పాలేరు, భద్రాచలం నవోదయ పాఠశాలల్లో ప్రవేశ పరీక్షల్లో గతంలో మాస్ కాపీయింగ్ జరిగిందనే ప్రచారం ఉంది. పాలేరులోని కేంద్రంలో గతంలో ఇలా అక్రమాలు జరిగాయని విమర్శలు వచ్చాయి. ఈ ప్రవేశ పరీక్షకు ఇన్విజిలేటర్లుగా ఎస్జీటీ స్థాయి ఉపాధ్యాయులను నియమించాలన్న నిబంధన ఉంది, దీనికి విరుద్దంగా స్కూల్ అసిస్టెంట్ స్థాయి ఉపాధ్యాయులను నియమించారని అప్పుడు ఆరోపణలు వచ్చాయి. ‘‘ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, సత్తుపల్లి, మధిర ప్రాంతాల్లోని కొన్ని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు, ట్యూటర్లు కలిసి ఇలా చేయించారు’’ అని ఆనాడు ప్రచారం జరిగింది. ఇందుకోసం ఒక్కో విద్యార్థి నుంచి ఐదువేల రూపాయల వరకు వసూలు చేసినట్టు కూడా ప్రచారం సాగింది. ‘‘కొన్ని కేంద్రాల్లో పరీక్ష రాసిన వారికే ఎక్కువ సీట్లు వచ్చాయి. దీని వెనుక, ఏదో మతలబు ఉంది’’ అని, గతంలో కొందరు తల్లిదండ్రులు ఆరోపించిన ఉదంతాలు ఉన్నాయి. తాజాగా.. ఖమ్మం, కల్లూరు, అశ్వారావుపేట, భద్రాచలం, బూర్గంపాడు, కొత్తగూడెం, మధిర, వెంకటాపురంలోని పరీక్ష కేంద్రాల ద్వారా మాస్ కాపీయింగ్‌కు తెర లేపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది. నేడు ‘నవోదయ’ ప్రవేశ పరీక్ష పాలేరు (కూసుమంచి): 20116-17 విద్యాసంవత్సరానికిగాను పాలే రులోని జవహర్ నవోదయ విద్యాలయలో తరగతిలో ప్రవేశానికి శనివారం (9వ తేదీన) ప్రవేశ పరీక్ష జరగనుంది. ఇందుకోసం 27 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 6275 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు పరీక్ష ఉంటుంది. పరీక్ష ప్రారంభమైన అరగంట తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించేది లేదని విద్యాలయ ప్రిన్సిపల్ వి. వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ప్రతి పరీక్ష కేంద్రంలో ఒక పరిశీలకుడిని నియమించామని, నవోదయ విద్యాలయ సమితి నుంచి కూడా పరిశీలకులు పర్యవేక్షిస్తారని తెలిపారు. పకడ్బందీగా నిర్వహిస్తాం నవోదయ ప్రవేశ పరీక్ష కేంద్రాల్లో మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకునిని, పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. విద్యాశాఖ అధికారుల సహకారంతో ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేశాం. ఆరోపణలు వచ్చిన సెంటర్లకు ప్రత్యేక స్క్వాడ్ బృందాలను పంపిస్తున్నాం. నవోదయ పాఠశాల ఉద్యోగులతోపాటు ఢిల్లీ నుంచి ఇద్దరు పర్యవేక్షకులు వచ్చారు. ఏదేని కేంద్రంలో అవకతవకలు జరిగితే.. సబంధిత నియంత్రణ అధికారిపై వేటు పడుతుంది. - పాలేరు నవోదయ పాఠశాల ప్రిన్సిపాల్, పరీక్షల నిర్వాహకులు