
'భయపడే ఏపీ నుంచి పోలీసుల్ని రప్పించాడు'
ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు ఏసీబీ అరెస్టు చేస్తుందేమోనని భయం పట్టుకుందని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు ఏసీబీ అరెస్టు చేస్తుందేమోనని భయం పట్టుకుందని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అందుకు భయపడే ఏపీ నుంచి ప్రత్యేక పోలీసు బలగాలను తెప్పించుకుంటున్నారన్నారు. సచివాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..ఏపీ సీఎం చంద్రబాబు తిన్నింటి వాసాలు లెక్కపెట్టే రకమని, తెలంగాణలో ఉండటానికి నీళ్లు, కరెంట్‌తో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తే..ఇక్కడి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్రలు చేస్తున్నాడని, ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయలు వెదజల్లి ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి చూస్తున్నాడని విమర్శించారు.
చంద్రబాబు చేసిన దొంగతనం ప్రపంచమంతా చూసింది. ఇప్పటికైనా బుకాయించడం మాని చేసిన తప్పును ఒప్పుకోవాలన్నారు. చంద్రబాబు తన తప్పును ప్రజలపై నెట్టి తప్పించుకునే చిల్లర చేష్టలు చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో ఉన్న బిడ్డలంద రినీ తాము కడుపులో పెట్టి చూసుకుంటామని, చంద్రబాబు పిచ్చి ప్రేలాపనలు చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. దొంగతనం చేస్తూ పట్టుబడిన వారిని పోలీసులు ఏం చేస్తారో... ఈ కేసులో కూడా ఏసీబీ చట్టప్రకారం అదే విధంగా నడుచుకుంటుందని స్పష్టంచేశారు.