
మాడ్గుల: తల్లి పాలు అమృతతుల్యం. ఓ గుక్కెడు తల్లి పాలు చిన్నారి జానెడు పొట్టకు ప్రాణాధారం. కానీ ఆ గుక్కెడు పాలే ఓ పసిమొగ్గ పాలిట విషమయ్యాయి. తనపై పడిన క్రిమిసంహారక మందును గుర్తించని ఆ మాతృమూర్తి.. పాల కోసం అల్లాడుతున్న కుమార్తెకు పాలు పట్టి తన కనుపాపనే కోల్పోయింది. ఈ హృదయవిదారక ఘటన రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం ఇర్విన్ గ్రామంలో చోటు చేసుకుంది.
భర్తను కాపాడుకున్నా..
ఇర్విన్ గ్రామానికి చెందిన కడారి మల్లయ్య ఈ నెల 25న రాత్రి మద్యం మత్తులో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకోబోయాడు. ఇది గమనించిన మల్లయ్య భార్య లక్ష్మీదేవి భర్త ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకుంది. ఆ ప్రయత్నంలో లక్ష్మీదేవి ఛాతీపై క్రిమిసంహారక మందు పడింది. అయితే దీనిని లక్ష్మీదేవి గమనించలేదు. భర్తను ఎలాగైనా రక్షించుకోవాలనే ఆందోళనలో చికిత్స చేయించేందుకు ఆస్పత్రికి తీసుకెళ్లింది.
ఇంటి దీపం ఆరిపోయింది..
అదే సమయంలో తన మూడేళ్ల కూతురు ప్రణీత పాల కోసం గుక్కపట్టి ఏడుస్తుండగా.. లక్ష్మీదేవి తన ఛాతీపై క్రిమిసంహారక మందు పడిన విషయం గమనించకుండా తన కూతురుకు పాలు పట్టింది. ఆ పాలు తాగిన ప్రణీత అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమెను వెంటనే హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రణీత బుధవారం కన్నుమూసింది. తల్లి లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment