గురువును సన్మానిస్తున్న పూర్వవిద్యార్థులు..
దండేపల్లి(మంచిర్యాల): వారంతా పదో తరగతి పూర్తి కాగానే విడిపోయారు. కొందరు ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో, మరికొందరు వ్యాపారాల్లో స్థిరపడ్డారు. 22 ఏళ్ల తర్వాత మళ్లీ బడిలో ఒక్క చోట చేరారు. అందుకు దండేపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో వేదికైంది. ఆదివారం 1995–96 పదో తరగతి విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు.
ఒకరినొకరు చూడగానే ఆనాటి మధురస్మృతులు మదిలో మెదిలాయి.. దీంతో వారి ఆనందాలకు అవధుల్లేకుండా పోయాయి.. ఒరేయ్ నువ్వేనారా.. గుర్తు పట్టకుండా అయ్యావు.. అంటూ ఒకరికొకరు పలుకరించుకున్నారు. పాఠశాల ఆవరణ సందడిగా మారింది. పాఠశాల తరగతి గదులు తిరుగుతూ చిన్నప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ మురిసిపోయారు.
అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించి పాదాభివందనం చేశారు. జ్ఞాపికలు, మెమొంటోలు అందజేశారు.
బాల్యంలోకి వెళ్లిపోయాను..
ఉన్నత చదువులు పూర్తయ్యాక హైదరాబాద్ వెళ్లాను. హెచ్‌సీఎల్ లిమిటెడ్ కంపెనీలో ఏజీఎల్ గ్లాస్‌ప్యాక్‌లో డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం హైదరాబాద్‌లో సెటిలయ్యా.. పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి రాగానే 22 ఏళ్లు వెనక్కి బాల్యంలోకి వెళ్లినట్లు అనిపించింది. –రత్నభూషన్, హైదరాబాద్
ఆనందంగా ఉంది..
చిన్ననాటి మిత్రులందరం ఒకే చోట కలుసుకోవడం చాలా ఆనందంగా అనిపించింది. ఇంటర్మీడియెట్ పూర్తవగానే వ్యాపారంలో స్థిరపడ్డాను. వ్యాపార బిజీలో మిత్రులను కలుసుకోలేక పోయాను. పూర్వవిద్యార్థుల సమ్మేళనం ద్వారా మిత్రులు, గురువులను కలుసుకోవడం ఆనందంగా ఉంది. –శ్రీధర్, లక్సెట్టిపేట
మరిచిపోలేని అనుభూతి..
మిత్రులందరం.. సమ్మేళనలో కలుసుకోవడం మరిచిపోలేని అనుభూతిని మిగిల్చింది. పాఠశాలను చూడగానే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. మిత్రుల్లో చాలామందిని గుర్తుపట్టలేకపోయాను. ఒకేచోట కలుసుకోవడం మధురానుభూతిని మిగిల్చింది. –సావిత్రి,గోదావరిఖని
Comments
Please login to add a commentAdd a comment