- అక్రమార్కులకు అండగా..
- ఓ మండలాన్ని శాసిస్తున్న ఇసుక కాంట్రాక్టర్
- అతను చెప్పిందే వేదం..
- అధికారులు.. ప్రజాప్రతినిధుల జీ హుజూర్
సాక్షి, మంచిర్యాల : అతనో సాధారణ ఇసుక కాంట్రాక్టర్. కానీ.. అతను చేసేది మాత్రం తెరవెనక రాజకీయం. అనతికాలంలోనే మంచిర్యాలకు కూతవేటు దూరంలో ఉన్న జైపూర్ మండలాన్ని శాసించే స్థాయికి ఎదిగాడు. రాజకీయ పలుకుబడి.. అధికారుల అండదండలతో లెక్కలేనన్ని అక్రమాలకు తెరలేపాడు. నేతల వత్తాసు కూడా అతనికే. డివిజన్ స్థాయి అధికారులూ జీ హుజూర్ చెప్పాల్సిందే. సదరు కాంట్రాక్టర్.. కొందరు అధికారులు, నేతల అవసరాలు తీరుస్తాడనే చర్చ తూర్పు ప్రాంతంలో బహిరంగంగానే జరుగుతోంది.
అతనికి నచ్చకపోతే మండలంలో పనిచేసే అధికారులను రాత్రికి రాత్రే బదిలీ చేయించే సత్తా అతనిది. తన మాట ను కాదన్నందుకు ఇటీవల ఆ మండల తహశీల్దార్‌ను 24 గంటల వ్యవధిలో బది లీ చేయించి తన మార్క్ చాటుకున్నాడు. ప్రజాప్రతినిధులు.. అధికారుల్లో అతని కున్న పలుకుబడిని చూసి కిందిస్థాయి ఉద్యోగులు, ప్రజలు అతని అక్రమాలపై ప్రశ్నించేందుకు ముందుకు రావడం లేదు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లు అ తనిపై గతంలో అనేక ఫిర్యాదులు అందాయి.
ఆ సందర్భంలో సదరు కాంట్రాక్టర్ కేసును సుమోటోగా స్వీకరిస్తానని చెప్పిన ఓ డివిజన్ స్థాయి అధికారి మీడియా ముందు స్పష్టం చేశారు. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ.. ఇప్పుడు ఆ అక్రమార్క కాంట్రాక్టర్ సదరు అధికారికి నమ్మిన బంటు అయ్యాడు. అతని అనుచరులు తమకు ఏ సమస్య వచ్చినా.. అధికారుల దగ్గరికి వెళ్లరు. పలుకుబడి ఉన్న ఆ కాంట్రాక్టర్ దగ్గరికే వెళ్తారు. మండల కేంద్రంగా జిల్లా స్థాయిలో కావల్సిన పనులన్నింటినీ అతను తన పలుకుబడితో చేసేస్తాడని ఆ మండలమంతా కోడైకూస్తోంది.
అందుకే ఆ ఇసుక కాంట్రాక్టరే ఆ మండలానికి పెద్దదిక్కయ్యాడు. అలా అని అతను నిజాయతీ పరుడని అనుకుంటే పొరపాటే. మండలంలో జరిగే ఎన్నో అక్రమాలకూ సూత్రధారి. పట్టా భూమిలోంచి ఇసుక తీసేందుకు లీజు కాంట్రాక్ట్ పొందిన ఆయన నిబంధనలకు విరుద్ధంగా గోదారిలోని ఇసుకనూ తోడేశాడు. తాజాగా.. మరోసారి కాంట్రాక్టును దక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే దాదాపు అతనికి కాంట్రాక్టు ఖరారైనట్టు ప్రచారం కూడా జరుగుతోంది.
అక్రమంగా తరలుతున్న ఇసుకకు అడ్డుకట్ట వేయాల్సిన రెవెన్యూ అధికారులు చూసీచూడ నట్లు వ్యవహరిస్తున్నారని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ అక్రమార్కుడి ఆగడాలు ఇంతటితోనే ముగియలేదు. మండలంలో ప్రభుత్వ భూముల కబ్జాలోనూ అతని ప్రమేయముందనే ఫిర్యాదులున్నాయి. భూ కబ్జాదారులు ఆక్రమించుకున్న భూమికి పట్టా చేయించుకోవాలంటే ఆ కాం ట్రాక్టర్‌ను ఆశ్రయించాల్సిందే.
తన పలుకుబడితో ఇటీవల మండలంలోని పలు గ్రామాల్లో పలువురికి పట్టా చేయించి ఇవ్వడం ఆ ఇసుక కాంట్రాక్టర్‌కే దక్కింది. ఓ పక్క సీఎం కేసీఆర్ రాష్ర్టంలో అవినీతి అక్రమాలపై సీరియస్‌గా ఉన్న నేపథ్యంలో.. ఇలాంటి అక్రమాలకు తెరలేపిన కాంట్రాక్టర్ల విషయాన్ని సీరియస్‌గా పరిగణించాలని బాధిత ప్రజలు కోరుతున్నారు. ఉన్నతాధికారులు ఇతని అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు.