దుగ్గొండి : బెయిల్ జమానత్‌ల కోసం నకిలీ ఇంటి పన్ను రశీదులు సృష్టించి.. గ్రామపంచాయతీ ఆదాయానికి గండికొడుతున్న ఐదుగురిని శుక్రవారం అరెస్టు చేసినట్లు ఎస్సై ముజాహిద్ తెలిపారు. మండలంలోని తొగర్రాయి గ్రామానికి చెందిన హన్మకొండ బాబు, మందపల్లి గ్రామానికి చెందిన బత్తుల వెంకటేశ్వర్లు, చాపలబండ గ్రామానికి చెందిన ఆరె మల్లారెడ్డి, రాజ్యతండాకు చెందిన అజ్మీరా ధన్‌సింగ్, అడవిరంగాపురం గ్రామానికి చెందిన గుండా సారంగపాణితోపాటు వరంగల్‌కు చెందిన ఓ న్యాయవాది ముఠాగా ఏర్పడ్డారు.
వరంగల్ ఎక్సైజ్ కోర్టులో గుడుంబా విక్రేత, స్మగ్లింగ్ కేసుల్లో ఇరుక్కున్న వారికి జమానతుదారులను తీసుకెళ్లడం వృత్తిగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా నకిలీ రశీదులు, నకిలీ రబ్బర్ స్టాంప్‌లు సృష్టించి కారోబార్లు, పంచాయతీ కార్యదర్శుల సంతకాలు ఫోర్జరీ చేయసాగారు. ఆ రశీదులతో జమానతులు తయారు చేసి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వ్యక్తులకు రోజుకు రూ.250 చొప్పున కూలీ చెల్లించి నిత్యం వరంగల్‌కు తీసుకెళుతున్నారు.
ఇందుకుగాను నిందితుల వద్ద రూ. వెయ్యి నుంచి రెండు వేలు వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 22న సదరు నిందితులు ఇద్దరు వ్యక్తుల పేర్లతో నకిలీ ఇంటిపన్నులు రాసి, ఇంటి విలువ సర్టిఫికెట్ తీసుకోవడానికి మందపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి సునీత వద్దకు వెళ్లారు. ఆ రశీదు నకిలీదని గుర్తించిన ఆమె సర్పంచ్ లింగాల రమేష్, కారోబార్ బాబురావుకు సమాచారమిచ్చారు. దీంతో వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా పైన పేర్కొన్న ఐదుగురు నిందితులతోపాటు వరంగల్‌కు చెందిన ఓ అడ్వకేట్ ప్రమేయం ఉందని తేలింది. దీంతో ఐదుగురిని అరెస్టు చేసి, నర్సంపేట కోర్టులో హాజరుపరిచామని ఎస్సై ముజాహిద్ తెలిపారు.
అడ్వకేట్‌పై కొనసాగుతున్న విచారణ
ఇదే కేసులో వరంగల్ ఎక్సైజ్ కోర్టు న్యాయవాది ఎన్. కమలాకర్‌పై విచారణ జరుగుతుందని ఎస్సై తెలిపారు. జమానతుల కోసం ముఠాకు ఎలా సహకరించారు.. కేసులో న్యాయవాది పాత్ర ఏమిటి అనే విషయాలపై విచారణ జరుగుతోందని, పూర్తి ఆధారాలు లభించగానే అరెస్ట్ చేస్తామని ఎస్సై వివరించారు.
నకిలీ పత్రాలతో బెయిల్ ష్యూరిటీలు
Published Sat, Jul 26 2014 2:15 AM | Last Updated on Wed, Oct 3 2018 6:52 PM
Advertisement
Advertisement