సాక్షి, ఖమ్మం: బెయిల్ కోసం ఫోర్జరీ సంతకాలు, తప్పుడు ధ్రువపత్రాలతో నకిలీ జామీన్లు ఇస్తున్న ముఠా గుట్టురట్టయింది. ఓ న్యాయవాది ప్రధాన సూత్రధారిగా ఖమ్మం నగరంలో ఏకంగా నకిలీ జామీన్లు ఇచ్చే ముఠానే ఏర్పడింది. ఓ వివాహిత ఇచ్చిన ఫిర్యాదుతో ఈ తతంగం వెలుగులోకి వచ్చింది. నకిలీ జామీనుదారులకు ఉపాధిగా మారిన ఈ వ్యవహారం ఖమ్మం నగరంతో పాటు జిల్లాలోని కొత్తగూడెం, సత్తుపల్లి తదితర ప్రాంతాల్లో కూడా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
సాధారణంగా ఏ కేసులోనైనా ఓ వ్యక్తి బెయిల్ తీసుకోవాలంటే కొంతమంది వ్యక్తిగత పూచీకత్తు ఇవ్వాలి. ఇలా ఇచ్చేటప్పుడు సదరు వ్యక్తి తన ఆస్తి విలువ పత్రాన్ని జామీను పత్రానికి జత చేయాలి. ఈ ఆస్తిని గుర్తించే పత్రాలు పంచాయతీ కార్యదర్శులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా బెయిల్ తీసుకునే వ్యక్తికి పూచీకత్తు ఇచ్చేవారందరూ ఈ పత్రాలను సమర్పించాలి. అయితే ఇక్కడే నకిలీ జామీన్ల వ్యవహారానికి కొంతమంది న్యాయవాదులు తెరలేపారు. ఎవరైనా బెయిల్ తీసుకోవాలంటే ఇట్టే నకిలీ జామీన్లు సృష్టిస్తున్నారు.
పంచాయతీ కార్యదర్శుల పేరుతో ఉన్న స్టాంపులు తయారు చేయించి,జామీన్‌కు జత పరిచే పత్రాల్లో వారే.. జామీన్ ఇచ్చే వారి ఆస్తిని రాయడంతో పాటు, ఆ గ్రామ పంచాయతీ స్టాంపు ముద్ర వేయడంతో వారి పని సులువుగా జరిగిపోతుంది. బెయిల్ తీసుకోవాలనుకునే వ్యక్తికి.. జామీన్ ఇచ్చేవారు ఆ ప్రాంతానికి సంబంధించిన వారు కాకున్నా అక్కడి వారేనంటూ నకిలీ పత్రాలు సృష్టిస్తున్నారు. ఇలా న్యాయస్థానాలనే బురిడీ కొట్టించి తప్పుడు జామీన్లతో పలు కేసుల్లో నిందితులైన వారు బెయిల్ పొందినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
డొంక కదిలిందిలా..
ఖమ్మం నగరానికి చెందిన స్వాతి అనే వివాహిత తన భర్తతో పాటు అతని బంధువుల వేధింపులపై ఇటీవల మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో ఆకేసులో ఉన్న నిందితులను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా, ఇటీవల వారు జామీన్లపై విడుదలయ్యారు. ఈ జామీను పత్రాలపై అనుమానం వచ్చిన స్వాతి ఖమ్మం మొదటి అదనపు జడ్జికి ఫిర్యాదు చేసింది.
దీనిపై విచారణ జరపాల్సిందిగా ఆయన ఖమ్మం టూటౌన్ పోలీసులను ఆదేశించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ జరపగా డొంకంతా కదిలింది. ఇందులో ఖమ్మం నగరానికి చెందిన శ్రీనివాసాచారి అనే న్యాయవాది ఖమ్మం రూరల్ మండలం కాచిరాజుగూడెంనకు చెందిన ఓ ముఠా సహకారంతో నకిలీ ధ్రువపత్రాలు సమర్పించినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ ముఠా సభ్యులు గ్రామ పంచాయతీ పేరుతో ఉన్న నకిలీ స్టాంపులు, గ్రామ కార్యదర్శి సంతకం ఫోర్జరీ చేసి నకిలీ ధ్రువపత్రాలతో కొంతకాలంగా జామీన్లు ఇస్తున్నారని వెల్లడైంది.
దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి వారి వద్ద ఉన్న నకిలీ స్టాంపులు, నకిలీ ధ్రువపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో న్యాయవాది శ్రీనివాసాచారితో పాటు మహంకాళి రామకృష్ణ, కొమ్ము భిక్షం, పెదమాముల అశోక్, కొమ్ము ఉపేందర్, మహంకాళి ఉపేందర్, మహకాళి వెంకన్న, ఆరెంపుల రామనాథం ఉన్నారు. పట్టుబడిన ముఠాను విచారణ చేయగా న్యాయవాదులు నేరళ్ల శ్రీనివాస్, బచ్చలకూర వెంకటేశ్వర్లు, విద్యాసాగర్, బొడ్డు రాములు, దిలీప్ అనే వారు కూడా తమతో ఈ విధంగా జామీన్లు ఇప్పిస్తున్నట్లు పోలీసులకు తెలిపారు.
జామీన్లకు కేరాఫ్ తండాలు..
నకిలీ జామీన్లు ఇచ్చే వ్యవస్థ జిల్లాలో కొనసాగుతోందని స్వయంగా ఎస్పీనే వెల్లడించడం గమనార్హం. గతంలో ఓ సారి కొత్తగూడంలో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. నకిలీ జామీన్ వ్యవహారం లాభసాటిగా ఉండడంతో కొంతమంది న్యాయవాదులు దీన్నే ఎంచుకుంటున్నారు. దీంతో ఖమ్మం నగరం చుట్టు పక్కల గ్రామాలు, కొత్తగూడెం, సత్తుపల్లితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఇలా నకిలీ జామీన్లు ఇస్తున్నట్లు ఈ కేసు విచారణలో పోలీసుల దృష్టికి వచ్చింది.
ఖమ్మంఅర్బన్ మండలం అల్లీపురం, కొత్తగూడెం, రఘునాథపాలెం గ్రామాల్లో ఇలా చాలా మంది నకిలీ జామీన్లు ఇస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రాంతాలకు సమీపంలో ఉన్న తండాల్లో ఉన్న వారి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని రూ.500 నుంచి రూ.1000 వరకు ఇస్తుండడంతో కొంతమంది ఇదే ఉపాధి మార్గంగా ఎంచుకున్నారు. నెలకు ఒక్కో వ్యక్తి 15 నుంచి 20 బెయిల్స్‌కు నకిలీ జామీన్ ఇస్తూ రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు సంపాదిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడికావడమే ఇందుకు నిదర్శనం.
ఎవరినైనా ఊపేక్షించం.. ఎస్పీ రంగనాథ్
ఈ వ్యవహారంపై బుధవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ఎ.వి.రంగనాథ్ మాట్లాడుతూ ఖమ్మం నగరంలో నకిలీ జామీన్ వ్యవహారం అంతా న్యాయవాది శ్రీనివాసాచారి డెరైక్షన్‌లోనే జరిగిందని వెల్లడించారు. దీంతో బెయిల్ సిస్టమ్‌నే కుప్పకూల్చే ప్రమాదం ఉందన్నారు. ఏదైనా కేసు సీరియస్ అయితే నకిలీ జామీన్ ఇస్తే వారిపై విచారణ చేస్తే ఎలాంటి ఆస్తి ఉండదని, ఇలా చట్ట పరంగా ఇబ్బంది ఎదురవుతోందని తెలిపారు.
దీనిపై లోతుగా పరిశీలిస్తే ఈ వ్యవహారం ష్యూరిటీ హోల్డర్స్‌కు ఉపాధిగా మారినట్లు తెలుస్తోందన్నారు. ఇలాంటి కేసుల్లో ఎవరున్నా ఊపేక్షించేది లేదని, ప్రస్తుతం ఈ కేసు విషయమై సమగ్ర దర్యాప్తు చేసి ఇందులో ప్రమేయం ఉన్న వారిని త్వరలో అరెస్టు చేస్తామని చెప్పారు. ఖమ్మం విషయం బయటపడడంతో జిల్లా వ్యాప్తంగా ఇలా జరుగుతోందని జిల్లా జడ్జి దృష్టికి తీసుకెళ్లామని, అంతటా విచారణ చేసేందుకు జడ్జి సుముఖత వ్యక్తం చేశారని తెలిపారు. ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి కూడా తీసుకెళ్తామన్నారు. దొంగ జామీన్లను పసిగట్ట లేకపోయిన ఖమ్మం కోర్టు కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకొని ప్రక్షాళన చేస్తామని స్పష్టం చేశారు. ఈ కేసును ఛేదించిన టూటౌన్ సీఐ సారంగపాణి, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ విలేకరుల సమావేశంలో డీఎస్పీ బాలకిషన్‌రావు పాల్గొన్నారు.
నకిలీ జామీన్@500
Published Thu, Jul 17 2014 2:53 AM | Last Updated on Wed, Oct 3 2018 6:52 PM
Advertisement