కబ్జాదారులు సృష్టించిన నకిలీ డెత్ సర్టిఫికెట్
సాక్షి, గుంటూరు/మంగళగిరి: ఓ మహిళ స్థలంపై కొందరు అక్రమార్కులు కన్నేశారు. ఎలాగైనా ఆ స్థలాన్ని కబ్జా చేయాలని పథకం వేశారు. ఈ క్రమంలో ఆమె బతికుండంగానే చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్ సృష్టించారు. మరో మహిళను స్థల యజమాని కూతురుగా సృష్టిస్తూ ఫ్యామిలీ సర్టిఫికెట్ పొందారు. రూ.70 లక్షలకు పైగా విలువ స్థలాన్ని కబ్జా చేయడానికి అక్రమార్కుల వేసిన పన్నాగం స్థల యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బట్టబయలైంది. వివరాల్లోకి వెళితే 1980 మే 31న విజయవాడకు చెందిన కాగిత సత్యవతి మంగళగిరి మండలం నవులూరు పశువుల ఆసుపత్రి వద్ద సర్వే నెంబర్ 795/1, ప్లాట్ నెంబర్ 22లో 436 చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేసింది. ఈ స్థలంపై కన్నేసిన కొందరు సత్యవతి 1993 మే 4వ తేదీన మృతి చెందినట్లు మంగళగిరి మున్సిపల్ కార్యాలయం నుంచి జారీ చేసినట్లు నకిలీ డెత్ సర్టిఫికెట్ సృష్టించారు.
అదే విధంగా సత్యవతితో ఏ సంబంధం లేని శైలజ అనే మహిళను కుమార్తెగా చూపిస్తూ మంగళగిరి తహసీల్దార్ మంజూరు చేసినట్లు నకిలీ ఫ్యామిలీ సర్టిఫికెట్‌ను పొందారు. వీటిని అడ్డంపెట్టుకుని మంగళగిరి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో దస్తావేజు నంబర్ 623/2020తో తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామానికి చెందిన గాదె మురళీకృష్ణ పేరుతో స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇతను విలేకరి(సాక్షి కాదు)గా పని చేస్తున్నాడు. ఈ ధ్రువపత్రాలతో స్థలం అమ్మకానికి పెట్టగా విషయం స్థల యజమాని సత్యవతికి తెలిసి మంగళగిరి రూరల్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఈ నెల తొమ్మిదో తేదీన కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. ఏ1 గాదె మురళీకృష్ణ, ఏ2 శైలజలుగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఏ2 శైలజను అరెస్టు చేసిన అధికారులు విచారించి స్టేషన్ బెయిల్ ఇచ్చినట్లు తెలిసింది. సాక్షి సంతకాలు పెట్టిన నవులూరుకు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు విచారించినట్లు సమాచారం.
ఆ ముగ్గురే కీలకం
నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి స్థలం కబ్జా చేయడంలో టీడీపీకి చెందిన యర్రబాలెంకు చెందిన ఓ రౌడీ షీటర్, ఇదే గ్రామానికి చెందిన ఓ విలేకరి(సాక్షి కాదు), మంగళగిరికి చెందిన మరో వ్యక్తి కీలకమని సమాచారం. ఈ ముగ్గురే పెట్టుబడి పెట్టి నకిలీ పతకం ప్రకారం నకిలీ ధ్రువపత్రాలు సృష్టించినట్లు తెలుస్తోంది. గాదె మురళీ సహా యర్రబాలెంకు చెందిన టీడీపీకి చెందిన రౌడీ షీటర్, ఇదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి పరారీలో ఉన్నారు. రూ.20 వేలు ఇచ్చి నమ్మించి తన పేరిట ఫ్యామిలీ సర్టిఫికెట్ సృష్టించి స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించారని పోలీసుల ఎదుట శైలజ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
కేసు రాజీకి యత్నం
కబ్జా వ్యవహారంలో కీలకం పాత్ర పోషించిన ఈ ముగ్గురు ఫిర్యాదుదారులను భయబ్రాంతులకు గురిచేసో, డబ్బు ఇస్తామనో కేసు రాజీ చేసుకోడానికి ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. మంగళగిరి, పెదకాకాని, తాడేపల్లి ప్రాంతాల్లో రౌడీ షీటర్లు, కొందరు వైట్ కాలర్ నేరస్తులు ఈ తరహాలో భూకబ్జాలకు పాల్పడటం ఇది మొదటి సారి ఏమీ కాదు. గతీడాది మంగళగిరిలో జరిగిన ఓ మాజీ రౌడీషీటర్ హత్యకేసులో కీలక నిందితుడు రౌడీషీటర్ సుమారు రెండు నెలల క్రితం పెదకాకాని మండలంలోని ఓ గ్రామంలో స్థల వివాదం దౌర్జాన్యానికి దిగాడు. తన బావ పేరిట అక్రమ స్థల రిజిస్ట్రేషన్ చేయించి ఎదుటి వారి స్థలాన్ని కబ్జా చేసేందుకు సదరు రౌడీషీటర్ తన అనుచరుల పంపి స్థల యజమానులు వేసుకున్న సరిహద్దు కంచెలను తొలగించారు. ఈ వ్యవహారంలో రౌడీషీటర్ ప్రమేయంతోనే ఇదంతా జరుగుతుందని అప్పట్లో పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో న్యాయం కోసం బాధితులు ప్రజాప్రతినిధులను ఆశ్రయించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రౌడీషీటర్‌ను తప్పించి కేసు నమోదు చేశారని విమర్శలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment