
కానిస్టేబుల్ ఇంట్లో నుంచి బయట వేసిన సామాను , దిక్కుతోచక ఇంటి బయటే కూర్చున్న మహిళలు
తాడేపల్లిరూరల్: మండల పరిధిలోని కుంచనపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. పురుషులు లేని సమయంలో ఇంట్లో చొరబడి మహిళలపై దౌర్జన్యం చేసి సామాను బయట పడేసిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. విజయవాడలో పనిచేసే ఏఆర్ కానిస్టేబుల్ గోపిశెట్టి క్రాంతి, ఆయన సోదరి కుంచనపల్లిలోని డోర్ నం 1–37 ఇంటిని 2017వ సంవత్సరంలో గవర్నర్ పేట ఇండియన్ బ్యాంక్ బ్రాంచ్ ఆక్షన్‌లో పాడుకున్నారు. అనంతరం ఆ ఇంటిని బ్యాంకు వారి దగ్గర నుంచి మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
అయితే బ్యాంకులో ఇంటిని తాకట్టు పెట్టిన కొండా శంకరరెడ్డి, కొండా మోహన్‌రెడ్డి బ్యాంకులో ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి బ్యాంకును మోసం చేసి, తనను కూడా మోసం చేసారంటూ మోహన్‌రెడ్డి, శంకరరెడ్డి బావమరిది అయిన నాగిరెడ్డి బ్యాంకు అధికారులపైనా, బావలపైనా కోర్టును ఆశ్రయించారు. కోర్టు నాగిరెడ్డికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది కానీ, ఇల్లు కొనుగోలు చేసిన కానిస్టేబుల్ గోపిశెట్టి క్రాంతిని ఖాళీ చేయించమని చెప్పలేదు. అయిన ప్పటికీ నాగిరెడ్డి, అతని బావలైన శంకరరెడ్డి, మోహన్ రెడ్డి దౌర్జన్యానికి పాల్పడి ఇంట్లోకి వెళ్లి సామన్లన్నీ బయట పడవేసి, మహిళలనే కనికరం లేకుండా బయటకు నెట్టివేశారు. ఘటనపై తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఏఆర్ కానిస్టేబుల్ క్రాంతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.