సాక్షి, హైదరాబాద్: డబ్బును బ్యాంకుల్లో జమ చేసి అవసరమైనప్పుడు వెనక్కి తీసుకుని వాడుకుంటున్నట్టే.. విద్యుత్‌కు సైతం బ్యాంకింగ్ సదుపాయం అందుబాటులోకి రానుంది. స్వీయ అవసరాల కోసం సౌర, పవన, మినీ జల విద్యుదుత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేసుకునే కాప్టివ్ విద్యుత్ ప్లాంట్ల యజమానులకు తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు విద్యుత్ బ్యాంకింగ్ సదుపాయం కల్పించనున్నాయి. సొంత అవసరాల కోసం ఈ రోజుల్లో చాలా మంది పారిశ్రామికవేత్తలు కాప్టివ్ సౌర, పవన, మినీ హైడల్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. గృహ అవసరాల కోసం సోలార్ రూఫ్ టాప్ ప్లాంట్ల ఏర్పాటు సైతం ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగింది. సోలార్ ఫొటో వోల్టాయిక్ ప్యానెళ్ల ధరలు తగ్గడంతో పెట్టుబడి వ్యయం భారీగా తగ్గింది. దీంతో లక్షల రూపాయల పెట్టుబడితో సోలార్ రూఫ్ టాప్ ప్లాంట్లను ఏర్పాటు చేసి స్వీయ అవసరాలకు వినియోగించుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే, ఈ విద్యుదుత్పత్తి ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను తమ సొంత అవసరాలకు వినియోగించుకోగా, మిగిలిన విద్యుత్‌ను వృథాగా వదిలేయక తప్పడం లేదు. తాజాగా డిస్కంలు తీసుకొస్తున్న విద్యుత్ బ్యాంకింగ్ సదుపాయం ఇలాంటి కాప్టివ్ విద్యుత్ ప్లాంట్ల యజమానులకు కొత్త వెసులుబాటును తీసుకురానుంది.
అవసరమైనప్పుడు తీసుకునేలా..
కాప్టివ్ పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్‌ను తమ సొంత అవసరాలకు వాడుకోగా, మిగిలిపోయే విద్యుత్‌ను డిస్కంలకు ఇచ్చి.. మళ్లీ తమకు అవసరమైనప్పుడు వెనక్కి తీసుకునే అవకాశం వీరికి కలగనుంది. ప్రధానంగా పగటి వేళల్లోనే సౌర విద్యుదుత్పత్తికి అవకాశముండనుంది. ఈ సమయంలో అవసరాలకు మించి ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను డిస్కంలకు చెందిన విద్యుత్ సరఫరా గ్రిడ్‌కు పంపించి, మళ్లీ సౌర విద్యుదుత్పత్తికి ఆస్కారం లేని రాత్రి వేళల్లో ఇంతే పరిమాణంలో డిస్కంల నుంచి వెనక్కి తీసుకోవడానికి అవకాశం వస్తుంది. విద్యుత్ బ్యాంకింగ్ సదుపాయం కల్పించినందుకు డిస్కంలు సదరు ప్లాంట్ల యజమానుల నుంచి బ్యాంకింగ్ చార్జీలతో పాటు మరికొన్ని రకాల సుంకాలు, పన్నులు వసూలు చేయనున్నాయి.
ఒప్పందం కుదుర్చుకుంటేనే..
పవర్ బ్యాంకింగ్ సదుపాయం పొందేందుకు డిస్కంలతో విద్యుత్ ప్లాంట్ యజమానులు విద్యుత్ బ్యాంకింగ్‌కు సంబంధించిన ఒప్పందాన్ని కుదుర్చుకోవాల్సి ఉంటుంది. ఈ ఒప్పందానికి సంబంధించిన నమూనా ముసాయిదాను డిస్కంలు రూపొందించి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(టీఎస్‌ఈఆర్సీ) ఆమోదం కోసం ప్రతిపాదించాయి. ఈ ముసాయిదా నమూనా ఒప్పందంపై వచ్చే నెల 5 వరకు ఈఆర్సీ ప్రజల నుంచి అభిప్రాయాలు, సలహాలు సేకరిస్తుంది. ఈ ముసాయిదా నమూనా ఒప్పందాన్ని ఈఆర్సీ ఆమోదిస్తే విద్యుత్ బ్యాంకింగ్ సదుపాయం అమల్లోకి వస్తుంది.