బార్ల లెసైన్సు ఫీజులు పెంపు
నూతన బార్ పాలసీ సిద్ధం.. నేడో రేపో ప్రకటన
సాక్షి, హైదరాబాద్: బార్ల వైశాల్యాన్ని బట్టి లెసైన్సు ఫీజు వసూలు చేసేందుకు ఆబ్కారీ శాఖ సన్నద్ధమవుతోంది. వైశాల్యం పెరిగినకొద్దీ అదనపు ఫీజులు పెంచనుంది. ఈ మేరకు అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానున్న నూతన బార్ పాలసీలో నిబంధనలు చేర్చుతోంది. బార్లకు ప్రస్తుతమున్న లెసైన్సు ఫీజును మరో రూ. 5 లక్షల మేర పెంచాలని, ఎక్కువ విస్తీర్ణం ఉన్న బార్ల నుంచి అదనంగా ఫీజులు వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ నూతన పాలసీకి ఆబ్కారీ శాఖ మంత్రి టి.పద్మారావుగౌడ్ ఆమోదం తెలిపారు. సీఎం కె.చంద్రశేఖర్‌రావు గ్రీన్‌సిగ్నల్ రాగానే ఒకటి రెండు రోజుల్లో కొత్త బార్ పాలసీ వెలువడనుంది.
సిట్టింగ్ కెపాసిటీ ఆధారంగా..
జీహెచ్‌ఎంసీతో పాటు మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో బార్ల లెసైన్సు ఫీజులను రూ.5 లక్షల మేర పెంచాలని నిర్ణయించారు. కొత్త విధానం ప్రకారం.. సాధారణ బార్ లెసైన్సు 500 చదరపు మీటర్ల వైశాల్యం వరకే వర్తిస్తుంది. 500 చ.మీ. నుంచి 1,000 చ.మీ. వరకు ఉంటే అదనంగా 10 శాతం లెసైన్సు ఫీజు వసూలు చేస్తారు. 1000 నుంచి 2000 చ.మీ. వరకు ఉంటే 20 శాతం ఫీజు అదనంగా వసూలు చేస్తారని తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని బార్ల యజమానులకు ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్లు సమాచారమిచ్చారు. బార్ల వైశాల్యాన్ని లెక్కించి ఫీజులు వసూలు చేసే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది.
బార్ల యజమానుల నిరసన
మద్యం దుకాణాలకు అనుబంధంగా ఉన్న పర్మిట్ రూమ్‌లు వేలాది గజాల్లో ఏర్పాటై మినీ బార్లుగా కొనసాగుతున్నాయని.. మరోవైపు బార్ల మీద సిట్టింగ్ కెపాసిటీ లెక్కన ఫీజులు పెంచడం సరికాదని తెలంగాణ రెస్టారెంట్స్ అండ్ బార్ల అసోసియేషన్ అధ్యక్షుడు మనోహర్‌గౌడ్ పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనను అమలు చేస్తే.. ఇప్పటికే నష్టాల్లో ఉన్న బార్లు మూతపడతాయన్నారు. దీనిపై మంగళవారం మంత్రి పద్మారావుగౌడ్‌ను కలిసి ఫీజుల పెంపు, సిట్టింగ్ కెపాసిటీ ఆధారంగా ఫీజు వసూళ్ల నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని కోరనున్నట్లు తెలిపారు.