New bar Policy
-
పారదర్శకంగా బార్ల లైసెన్సుల ప్రక్రియ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బార్ల లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకున్నవారిలో బుధవారం నాటికి 834 మంది నాన్ రిఫండబుల్ ఫీజు చెల్లించారు. కొత్త బార్ పాలసీ ప్రకారం బార్ల లైసెన్సుల జారీ ప్రక్రియను ఎక్సైజ్ శాఖ పూర్తిగా ఆన్లైన్ విధానంలో పారదర్శకంగా నిర్వహిస్తోంది. మొత్తం 130 మున్సిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో మూడేళ్లపాటు 840 బార్ల లైసెన్సుల కేటాయింపునకు ఎక్సైజ్ శాఖ ఇటీవల నోటిఫికేషన్ జారీచేసింది. వాటిలో 123 మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో బార్ల లైసెన్సుల కోసం 1,672 మంది ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. వారిలో 1,441 మంది ప్రాసెసింగ్ ఫీజు చెల్లించారు. వారిలో 1,308 మంది చలానాలు తీసుకోగా బుధవారం నాటికి 834 మంది నాన్‌రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు చెల్లించారు. నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు చెల్లించేందుకు గురువారం సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉంది. చలానాలు తీసుకున్నప్పటికీ సాంకేతికపరమైన సందేహాలతో పలువురు వేచిచూసే ధోరణి అవలంబించారు. ఆ సందేహాలు కూడా తొలగిపోవడంతో నాన్ రిఫండబుల్ దరఖాస్తు ఫీజు చెల్లింపులు వేగం పుంజుకున్నాయి. గురువారం మరింతమంది దరఖాస్తు ఫీజు చెల్లిస్తారని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. అనంతరం బిడ్లు తెరిచి ఈ నెల 30, 31 తేదీల్లో ఈ–వేలం నిర్వహించి బార్ల లైసెన్సులను ఖరారు చేస్తారు. -
487 బార్లకు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: నూతన బార్ల విధానం 2020–21కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో డిసెంబర్ 6వతేదీ వరకు దరఖాస్తులు స్వీకరించి మరుసటి రోజు రాత్రి 7 గంటలకు లాటరీ తీసి బార్ల కేటాయింపు జాబితా ప్రకటిస్తారు. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలను యూనిట్లుగా నిర్థారించి బార్లను కేటాయించనున్నట్లు ఎక్సైజ్ కమిషనర్ వివేక్ యాదవ్ గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. దరఖాస్తు ఇలా - ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ నవంబరు 29 నుంచి మొదలైంది. - డిసెంబర్ 6వతేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. - ఆఫ్లైన్లోనూ డిసెంబరు 6న సాయంత్రం 5 గంటల దాకా దరఖాస్తుకు అవకాశం. - జిల్లా ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ల కార్యాలయాల్లోనూ దరఖాస్తులు ఇవ్వొచ్చు. - డిసెంబర్ 7వతేదీ మధ్యాహ్నం 2 గంటలకు కలెక్టర్ల సమక్షంలో లాటరీ తీసి అదే రోజు రాత్రి బార్ల కేటాయింపు జాబితా ప్రకటిస్తారు. రెండేళ్ల పాటు కొత్త విధానం - నూతన విధానం కింద బార్ లైసెన్స్ దరఖాస్తు ఫీజు రూ.10 లక్షలుగా నిర్ణయించారు. - జనవరి 1వతేదీ నుంచి 2021 డిసెంబర్ 31 వరకు రెండేళ్లపాటు కొత్త బార్ల పాలసీ అమల్లో ఉంటుంది. - బార్ లైసెన్సు ఇచ్చినా ఇవ్వకున్నా దరఖాస్తు ఫీజు రూ.10 లక్షల్ని తిరిగి చెల్లించరు. 40% బార్ల తొలగింపు జనవరి 1వతేదీ నుంచి నూతన బార్ల విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దశలవారీ మద్య నిషేధంలో భాగంగా రాష్ట్రంలో బార్ల సంఖ్యను 40 శాతం తగ్గించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న 797 బార్లలో 40 శాతం తొలగించి 487 బార్లకు మాత్రమే లైసెన్సులు జారీ చేయనున్నారు. -
బార్ల లెసైన్సు ఫీజులు పెంపు
నూతన బార్ పాలసీ సిద్ధం.. నేడో రేపో ప్రకటన సాక్షి, హైదరాబాద్: బార్ల వైశాల్యాన్ని బట్టి లెసైన్సు ఫీజు వసూలు చేసేందుకు ఆబ్కారీ శాఖ సన్నద్ధమవుతోంది. వైశాల్యం పెరిగినకొద్దీ అదనపు ఫీజులు పెంచనుంది. ఈ మేరకు అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానున్న నూతన బార్ పాలసీలో నిబంధనలు చేర్చుతోంది. బార్లకు ప్రస్తుతమున్న లెసైన్సు ఫీజును మరో రూ. 5 లక్షల మేర పెంచాలని, ఎక్కువ విస్తీర్ణం ఉన్న బార్ల నుంచి అదనంగా ఫీజులు వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ నూతన పాలసీకి ఆబ్కారీ శాఖ మంత్రి టి.పద్మారావుగౌడ్ ఆమోదం తెలిపారు. సీఎం కె.చంద్రశేఖర్‌రావు గ్రీన్‌సిగ్నల్ రాగానే ఒకటి రెండు రోజుల్లో కొత్త బార్ పాలసీ వెలువడనుంది. సిట్టింగ్ కెపాసిటీ ఆధారంగా.. జీహెచ్ఎంసీతో పాటు మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో బార్ల లెసైన్సు ఫీజులను రూ.5 లక్షల మేర పెంచాలని నిర్ణయించారు. కొత్త విధానం ప్రకారం.. సాధారణ బార్ లెసైన్సు 500 చదరపు మీటర్ల వైశాల్యం వరకే వర్తిస్తుంది. 500 చ.మీ. నుంచి 1,000 చ.మీ. వరకు ఉంటే అదనంగా 10 శాతం లెసైన్సు ఫీజు వసూలు చేస్తారు. 1000 నుంచి 2000 చ.మీ. వరకు ఉంటే 20 శాతం ఫీజు అదనంగా వసూలు చేస్తారని తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని బార్ల యజమానులకు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లు సమాచారమిచ్చారు. బార్ల వైశాల్యాన్ని లెక్కించి ఫీజులు వసూలు చేసే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. బార్ల యజమానుల నిరసన మద్యం దుకాణాలకు అనుబంధంగా ఉన్న పర్మిట్ రూమ్‌లు వేలాది గజాల్లో ఏర్పాటై మినీ బార్లుగా కొనసాగుతున్నాయని.. మరోవైపు బార్ల మీద సిట్టింగ్ కెపాసిటీ లెక్కన ఫీజులు పెంచడం సరికాదని తెలంగాణ రెస్టారెంట్స్ అండ్ బార్ల అసోసియేషన్ అధ్యక్షుడు మనోహర్‌గౌడ్ పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనను అమలు చేస్తే.. ఇప్పటికే నష్టాల్లో ఉన్న బార్లు మూతపడతాయన్నారు. దీనిపై మంగళవారం మంత్రి పద్మారావుగౌడ్‌ను కలిసి ఫీజుల పెంపు, సిట్టింగ్ కెపాసిటీ ఆధారంగా ఫీజు వసూళ్ల నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని కోరనున్నట్లు తెలిపారు.