ధూమ్ ధామ్‌గా.. | batukamma celebrations | Sakshi
Sakshi News home page

ధూమ్ ధామ్‌గా..

Published Fri, Oct 3 2014 12:54 AM | Last Updated on Tue, Sep 4 2018 5:15 PM

ధూమ్ ధామ్‌గా.. - Sakshi

ధూమ్ ధామ్‌గా..

హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా కార్యక్రమాలు
విద్యుత్ కాంతులతో ధగధగలాడిన ట్యాంక్‌బండ్ పరిసరాలు
ఆకట్టుకున్న సంప్రదాయ కళారూపాలు
వినూత్నంగా లేజర్ షో.. అబ్బురపరిచిన బాణసంచా
10 జిల్లాల శకటాల ప్రదర్శన.. ఎల్‌ఈడీ తెరలపై ప్రసారం
భారీ సంఖ్యలో హాజరైన ప్రజలు..
సమాచార శాఖ ‘తెలంగాణ’ పత్రిక ఆవిష్కరించిన సీఎం
 
 పచ్చని ఆకుల దొంతర మీద పసుపు ముద్దల్లాంటి తంగేడు పూల సొగసు.. వెన్నెల ఆరబోసినట్లు మెరిసే తెల్లని గునుగు పూల అందం.. ఆపై కట్లపూలు, బీరపూలు, చేమంతులు.. తీరొక్క పూల వరుసల సొబగు.. మీద సుతిమెత్తగా విచ్చుకున్న గుమ్మడి పువ్వు, దానిపై గౌరమ్మ... రంగు రంగుల పూల కలబోత ‘బతుకమ్మ’కు.. తెలంగాణ ఆడపడుచులు ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..’.. ‘ఒక్కేసి పువ్వేసి చందమామ..’ అంటూ పాటల మధ్య ఘనంగా వీడ్కోలు పలికారు. పెత్రమాస నాడు ఎంగిలిపూల బతుకమ్మగా మొదలైన సంబరాలు... ఎనిమిది రోజుల పాటు సాగి గురువారం సద్దుల బతుకమ్మతో ముగిశాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన అనంతరం తొలిసారిగా జరిగిన బతుకమ్మ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఓవైపు సంప్రదాయ కళారూపాలు, ఆటపాటలు.. మరోవైపు లేజర్ వెలుగ ు జిలుగులు.. ఆకాశంలో చిత్ర విచిత్ర అగ్ని పూల బాణాసంచా విన్యాసాలు.. మొత్తంగా రాజధాని హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై జరిగిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.
 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక జరిగిన తొలి బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహించింది. ఈ పండుగను అధికారిక వేడుకగా ప్రకటించి ముందుగానే ప్రజల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసిన ప్రభుత్వం.. గురువారం జరిగిన సద్దుల బతుకమ్మను అంగరంగ వైభవంగా నిర్వహించి యావత్ తెలంగాణ ప్రజలను పులకించిపోయేలా చేసింది. ఇంతకాలం ఊళ్లలో జరిగే వేడుకలకే పరిమితమైన ఈ సంప్రదాయ పుష్పోత్సవ వైభవాన్ని రాజధానిలోని హుస్సేన్‌సాగర్ ఒడ్డున ఘనంగా నిర్వహించింది. తెలంగాణ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత జరగబోతున్న తొలి అంతర్జాతీయ వేడుక ‘మెట్రో పొలిస్ వరల్డ్ కాంగ్రెస్ (ప్రపంచ మేయర్ల సదస్సు)’ను ఘనంగా నిర్వహించే సత్తా తనకు ఉందనేందుకు సంకేతంగా నిలిచేలా ఈ వేడుకను నిర్వహించి చూపటం విశేషం.
 
 పులకించిన భాగ్యనగరం..
 
 ఇప్పటివరకు వినాయక నిమజ్జనోత్సవానికి వేదికైన చారిత్రక హుస్సేన్‌సాగర్.. గురువారం సద్దుల బతుకమ్మ వేడుకను చూసి మురిసిపోయింది. గవర్నర్ న రసింహన్, ఆయన సతీమణి విమలా నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు, ఆయన సతీమణి శోభ, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రతిపక్షాల నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. హైదరాబాద్‌లో ఉండేవారిలో చాలా మంది దసరా వేడుకలకు ఊళ్లకు వెళ్లే ఆనవాయితీ ఉండగా... ఈసారి మాత్రం ‘బతుకమ్మ’ వేడుకలను వీక్షించేందుకు వేల మంది ఊళ్ల నుంచి రాజధానికి తరలి వచ్చారు. దీంతో ట్యాంక్‌బండ్ ఇసుకేస్తే రాలనంతగా జనసంద్రమైంది. భారీ సంఖ్యలో జనం వస్తారని అంచనా వేసిన అధికారులు ట్యాంక్‌బండ్‌పై చాలా చోట్ల భారీ ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేసి వేడుకలను ప్రత్యక్ష ప్రసారం చేశారు.
 
 ఉదయం నుంచే కళకళ..
 
 తెలంగాణలోని పది జిల్లాల నుంచి తరలివచ్చిన మహిళలు తొలుత ఎల్‌బీ స్టేడియానికి చేరుకుని సద్దుల బతుకమ్మలను పేర్చుకున్నారు. దాదాపు 35 టన్నుల పూలతో ఇక్కడ పదివేల బతుకమ్మలను పేర్చారు. సాయంత్రం సంప్రదాయబద్ధంగా తొలుత గౌరీ పూజ నిర్వహించి, పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. అనంతరం మహిళలు బతుకమ్మలను తలపై పెట్టుకుని ఊరేగింపుగా హుస్సేన్‌సాగర్ వైపు తరలారు. అంతకు ముందు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు కె.వి.ర మణాచారి, సాంస్కృతిక శాఖ సంచాలకులు రాళ్లబండి కవితా ప్రసాద్ తదితరులు పూజలు నిర్వహించారు. అప్పటికే ట్యాంక్‌బండ్‌పై భారీ వేదికను ఏర్పాటు చేసిన.. అధికారులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. ఓవైపు బతుకమ్మ ఆటపాటలు... మరోవైపు వేదిక మీదుగా తెలంగాణ కళారూపాల విన్యాసాలు... సాయంత్రం ఐదుగంటల వరకే ఇటు ట్యాంక్‌బండ్ నుంచి నెక్లెస్‌రోడ్డు వరకు కిక్కిరిసిపోయేలా చేరుకున్న ప్రజలతో నిండిపోయింది. ఐదున్నర సమయంలో గవర్నర్ దంపతులు, ముఖ్యమంత్రి దంపతులు వేదిక వద్దకు చేరుకున్నారు. గవర్నర్ సతీమణి విమలా నరసింహన్ వేదిక దిగివచ్చి మహిళలతో కలసి బతుకమ్మ ఆడారు. వీలైనంతసేపు బతుకమ్మ ఆడిన మహిళలు.. ఆ తర్వాత ట్యాంక్‌బండ్‌కు సికింద్రాబాద్ వైపు చివరన యూత్ హాస్టల్ సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఘాట్ వద్ద సాగర్‌లో నిమజ్జనం చేశారు.
 
 ఒక్కచోట చేరిన కళారూపాలు..
 
 తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన యక్షగానం, కోలాటం, కొమ్ము కోయల నృత్యం, గంగిరెద్దుల విన్యాసాలు, ఒగ్గుకథ, బుర్ర కథ, చిడతలాట, పగటి వేషాలు, చిందు భాగవతం... ఒకటేమిటి అన్ని కళారూపాలు ట్యాంక్‌బండ్‌పై కనువిందు చేశాయి.
 
 ఉపన్యాసాలు లేకుండా..
 
 సాధారణంగా లక్షల మంది ఒకచోట చేరినప్పుడు రాజకీయ నేతల ఉపన్యాసాలు సర్వ సాధారణం. కానీ ఈ వేడుకలో ఎక్కడా ఉపన్యాసాల విసిగింపు లేకుండా సాగిపోవడం మరో ప్రత్యేకత. వేదికపై పలు పార్టీల సీనియర్ నేతలు కొలువుదీరినా... ఎవరూ మాట్లాడలేదు. వేడుక సాగుతున్న తీరును వ్యాఖ్యాతలు వివరించడం మినహా మైకు మరొకరి చేతుల్లోకి వెళ్లలేదు.
 
 భారీ పోలీసు బందోబస్తు..
 
 భారీ సంఖ్యలో ప్రజలు చేరుకుంటారనే అంచనా మేరకు పోలీసులు భారీ భద్రతా చర్యలు చేపట్టారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన పోలీసులు డేగకళ్లతో కాపలా కాశారు. దీంతో చిన్న అవాంతరం కూడా లేకుండా ఈ వేడుక ప్రశాంతంగా ముగిసి ప్రజలకు మధురస్మృతులను మిగిల్చింది.
 
 సమాచార శాఖ ‘తెలంగాణ’ పత్రిక ఆవిష్కరణ..
 
 ప్రభుత్వ పథకాలను, కార్యక్రమాలను వివరించే తెలంగాణ మాసపత్రికను వేడుకల సందర్భంగా సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. సమాచార పౌర సంబంధాల శాఖ వెలువరించే ఈ పత్రిక ఉమ్మడి రాష్ట్రంలో ‘ఆంధ్రప్రదేశ్’ పేరుతో కొనసాగింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ‘తెలంగాణ’ పేరుతో ప్రజల్లోకి వస్తోంది. సద్దుల బతుకమ్మ వేడుక నేపథ్యంలో ఆ వేదికపైనే తొలి సంచికను సీఎం ఆవిష్కరించి తొలి ప్రతిని గవర్నర్‌కు అందజేశారు. పత్రిక సంపాదక వర్గాన్ని కూడా ఈ సందర్భంగా పరిచయం చేశారు. తెలంగాణ పుష్పోత్సవం పేరుతో రచించిన మరో పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు.
 
 వేడుకల్లో పాల్గొన్న ముస్లింలు: తెలంగాణలో జరిగే వేడుకల్లో ప్రజలు మతాలకతీతంగా పాల్గొనే సంప్రదాయం గురువారం కనిపించింది. వందల సంఖ్యలో ముస్లింలు ట్యాంక్‌బండ్‌పైకి చేరుకుని వేడుకలను వీక్షించారు. ముఖ్యంగా ముస్లిం మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వారిలో కొందరు బతుకమ్మలను తీసుకురావటం విశేషం. ఇక విదేశీ పర్యాటకులు కూడా ట్యాంక్‌బండ్‌పై సందడి చేశారు.
 
 అబ్బురపరిచిన లేజర్ షో
 
 బతుకమ్మ ఆటపాటలు, తెలంగాణ కళారూపాల ప్రదర్శనలు, శకటాలు కొనసాగుతుండగానే... రాత్రి ఏడున్నర సమయంలో ఒక్కసారిగా ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. గతంలో ఆఫ్రో ఆసియన్ గేమ్స్ సందర్భంగా తొలిసారి అంతర్జాతీయ స్థాయిలో లేజర్ ప్రదర్శనను హైదరాబాద్‌కు చూపించి అబ్బురపరిచిన విజ్‌క్రాఫ్ట్ సంస్థ ఆధ్వర్యంలో లేజర్ షో విన్యాసాలు ప్రారంభమయ్యాయి. దాదాపు 20 నిమిషాల పాటు నెక్లెస్ రోడ్డు వైపు నుంచి ట్యాంక్‌బండ్ దిశగా ఆకాశంలో లేజర్ కిరణాల అద్భుత విన్యాసాలు వీక్షకులను మంత్ర ముగ్ధులను చేశాయి. క్షణాల్లోనే చిత్రవిచిత్ర ఆకృతులు ప్రత్యక్షమై మరో రూపంలోకి మారుతూ సాగిన షో అబ్బురపరిచింది. ఆ కిరణాలకు తగినట్లుగా ఏర్పాటు చేసిన ధ్వనులు మరింతగా ఆకట్టుకున్నాయి. ఇదే సమయంలో సంజీవయ్య పార్కులోంచి పేల్చిన తారాజువ్వలు నింగిలో వెలుగులు పూయించాయి. అప్పటికే నిమజ్జనమైన వేలాది బతుకమ్మలు ప్రశాంతంగా తేలియాడుతుండగా.. ఆకాశం నుంచి వెలుగు పూల వాన కురిసినట్లుగా ఆ దృశ్యం కనిపించింది.
 
 అలరించిన శకటాలు
 
 ఇప్పటివరకు స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల్లో మాత్రమే శకటాలను ప్రదర్శిస్తారు. కానీ తొలిసారిగా సంప్రదాయ వేడుక అయిన ‘బతుకమ్మ’ సందర్భంగా కూడా శకటాలను ఏర్పాటు చేయడం పండుగ ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. జిల్లాల వారీగా రూపొందించిన బతుకమ్మ శకటాలతో ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన ప్రదర్శన బాగా ఆకట్టుకుంది. అప్పటివరకు తెలుగు లలితకళా తోరణంలో కొలువుదీరిన ఈ శకటాలు ఒకదాని తర్వాత ఒకటిగా ట్యాంక్‌బండ్‌కు చేరుకున్నాయి. జీహెచ్‌ఎంసీ రూపొందించిన పూల కారు బతుకమ్మ చూపరులను కట్టి పడేసింది. సమాచార పౌరసంబంధాల శాఖ రూపొందించిన శకటంపై క్రీడాకారులు గుత్తా జ్వాల, సింధు, నైనా జైస్వాల్, పెండ్యాల సౌందర్య, ఎవరెస్టును అధిరోహించిన పూర్ణ నిలిచారు. ఆదిలాబాద్ జిల్లాకు గుస్సాడీల నృత్య ప్రదర్శన, బాసర దేవాలయ శకటం, హైదరాబాద్ జిల్లా శకటంపై బోనాలు, మహాంకాళీ కళారూపాలు, చార్మినార్, గోల్కొండ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కరీంనగర్ శకటంపై ప్రతిష్టాత్మకమైన కరీంనగర్ కమాన్, కొండగట్టు అంజన్న, మానేరు డ్యామ్ చూపరులను ఆకట్టుకున్నాయి. ఖమ్మం శకటం హంసను తలపించింది. ఆ జిల్లాకు చెందిన కొమ్మ కోయల నృత్యాలు అద్భుతంగా సాగాయి. మెదక్ మంజీరా శకటం, వర్గల్ సరస్వతీ దేవాలయంతో పాటు చిందు యక్షగాన నృత్యాలు, నల్లగొండ శకటంపైన యాదగిరిగుట్ట, నాగార్జునసాగర్, ఛాయా సోమేశ్వరాలయం నమూనాలు ఉన్నాయి. మహబూబ్‌నగర్ శకటంపై ఆలంపూర్ దేవాలయం, పిల్లలమర్రి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వరంగల్ శకటంపై కాకతీయ కళాతోరణం, భద్రకాళి దేవాలయం, వేయి స్తంభాలగుడి నమూనాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ అమరవీరుల సంక్షేమ సంఘం ప్రత్యేకంగా సమ్మక్క సారక్క శకట స్థూపాన్ని ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేసింది. వాటి ఔన్నత్యాన్ని వివరిస్తూ తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకుడు రాళ్లబండి కవితాప్రసాద్ తదితరుల వ్యాఖ్యానం ఆకట్టుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement