
అధికారికంగా ‘బతుకమ్మ’ షురూ
ఉత్సాహంగా పాల్గొన్న సచివాలయ ఉద్యోగినులు
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. బుధవారం సచివాలయంలో జరిగిన ఉత్సవాల్లో పలువురు మహిళా అధికారులు, ఉద్యోగులు, మహిళా సంఘాల ప్రతినిధులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వమే బతుకమ్మ ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తుండడంతో.. సచివాలయమంతా సందడిగా మారింది.
తెలంగాణ ప్రజల ఉద్యమ ప్రతీక: కవిత
భువనగిరి: బతుకమ్మ పండగ తెలంగాణ ప్రజల ఉద్యమ ప్రతీక అని తెలంగాణ జాగృతి అధృక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ జాగృతి సంయుక్త ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా భువనగిరిలో ఏర్పాటు చేసిన బంగారు బతుకమ్మ సంబరాలను ఆమె మంత్రి జగదీష్‌రెడ్డితో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ బతుకమ్మ పండగ తెలంగాణ ప్రజల బతుకు చిత్రమన్నారు. ప్రజల ఆకాంక్షకు ప్రతిబింబంగా ఎదిగిన బతుకమ్మ పండగ ఇంత పెద్దఎత్తున జరుపుకోవడం అనందంగా ఉందని చెప్పారు. మంత్రి జగదీష్‌రెడ్డి మాట్టాడుతూ తెలంగాణ ప్రజల సంస్కృతి, జీవన విధానంలో బతుకమ్మ భాగ్యమన్నారు.