జడ్చర్ల : బీసీల భవిష్యత్ బంగారుమయం కానుందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. సోమవారం వనపర్తి జిల్లా పెబ్బేరులో మత్స్య కళాశాల శంకుస్థాపనకు వెళ్తున్న సందర్బంగా ఆయన జడ్చర్ల ప్రభుత్వ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీసీలకు మంచి రోజులు ప్రారంభమయ్యాయని, బీసీల సంక్షేమం కోసం ప్రత్యేకంగా అసెంబ్లీని ఒక రోజు సమావేశపరుస్తామన్నారు. 103 బీసీ కులాల అభివృద్ధికి, సంక్షేమానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లిపోయాయని, వారి ఊకదండపుడు ఉపన్యాసాలకు, హూంకరింపులకు భయపడేదిలేదని అన్నారు.
బీసీలపై కాంగ్రెస్ నాయకులు ఇన్నాళ్లు లేని ప్రేమను ఇప్పుడు ఒలకబోస్తుండటం ఆశ్చర్యంగా ఉందని విమర్శించారు. అచ్చంపేటలో జరిగిన సమావేశంలో బీసీల గురించి కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం, అదికూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. బీసీలకు సంబందించి సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యేందుకు ఒక్క బీసీ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్‌లో లేరని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎంతమేర ప్రాధాన్యం ఇచ్చిందో తెలుస్తుందన్నారు. ముదిరాజ్‌లకు, గంగపుత్రులకు, కురుమయాదవులకు తాము చేసినంతగా ఎవ్వరూ చేయలేదన్నారు.
రాష్ట్రంలోని పది ప్రాంతాల్లో రొయ్యల పెంపకం
రాష్ట్రంలోని పది ప్రాంతాల్లో రొయ్యల పెంపకాన్ని పైలెట్‌గా చేపట్టామని, జిల్లాలోని కోయిల్‌సాగర్‌లో రొయ్యల పెంపకాన్ని చేపట్టినట్లు తెలిపారు. ముదిరాజులు, గంగపుత్రులకు 70కోట్ల చేపపిల్లల పంపిణీని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటివరకు 50కోట్లు పంపి ణీ చేశామన్నారు. ఇంటికో ఉద్యోగం తాము ఇస్తామంటూ.. కాంగ్రెస్ చెబుతున్న మాటలు పూర్తి అవాస్తవమన్నారు. 1.14లక్షల ఉద్యోగాలు కల్పించే దిశగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
టీఆర్‌ఎస్ పాలనలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందుతున్నదని చెప్పారు. పాలమూరు ఎత్తిపోతల పనులు చురుగ్గా సాగుతున్నాయని తెలిపారు. ప్రాజెక్ట్ పనులపై కోర్టులలో కేసులు వేసి కాంగ్రెస్ అడ్డుకుంటుందని ఆరోపించారు. కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. అసెంబ్లీలో సమస్యలపై మాట్లాడలేని కాంగ్రెస్ నాయకులు బయట మాట్లాడుతుండడం విచిత్రంగా ఉందన్నారు. మార్కెట్ వైస్ చైర్మన్ శ్రీశైలంయాదవ్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు యాదయ్య, నాయకులు శంకర్‌నాయక్, శ్రీకాంత్, ఇమ్ము పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment