
అనుమానం వస్తే కొనుగోలు చేయొద్దు
సాక్షి, సిటీబ్యూరో: దేశంలో ప్రఖ్యాతిగాంచిన మెట్రోపాలిటన్ నగరాల్లో ఒకటిగా పేరొందిన భాగ్యనగరం. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. దీంతో తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశ, విదేశాలకు చెందిన ప్రజలు హైదరాబాద్ నగరంపై దృష్టిసారిస్తున్నారు. వారిని గ్రేటర్ హైదరాబాద్‌లోని చారిత్రక, పర్యాటక ప్రాంతాలు అలరిస్తున్నాయి. దీంతో హైదరాబాద్ నగరాన్ని ఈ ఏప్రిల్, మే నెలల్లో ఎక్కువగా పర్యాటకులు ఉదయం, సాయంత్రం వేళల్లో సందర్శిస్తుంటారు. ఆయా పర్యాటక ప్రాంతాలకు కుటుంబాలు, బంధు మిత్రులతో కలిసి వస్తారు. వేసవి తాపాన్ని తీర్చుకొని తిరిగి వెళ్తారు. ఎండలో తిరిగి అలసి ఒక్క స్పూన్ ఐస్‌క్రీం నోట్లో వేసుకుంటే ఎంత హాయిగా ఉంటుందో.. అప్పటి వరకు శరీరం పడ్డ అలసటంతా తీరిపోతుంది అనుకుంటూ ఐస్‌క్రీంలు కొనుగోలు చేస్తున్నారు..? అయితే తస్మాత్ జాగ్రత్త..! నకిలీ ఐస్‌క్రీంలు మార్కెట్‌లోకి వచ్చేశాయి. అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేసి మితిమీరిన రంగులు కలబోసి మిమ్మల్ని ఆకర్షించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ రెండు నెలల సమ యంలో వినియోగదారుల ఆరోగ్యాన్ని గుల్ల చేసేందుకు నకిలీలు సిద్ధమయ్యారు. ఐస్‌క్రీం కొనే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అపరిశుభ్ర ఐస్‌క్రీంల బారిన పడకుండా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
వివరాలు పరిశీలించండి
ఐస్‌క్రీం కొనేముందు ఒక్క క్షణం కేటాయించి ఐస్‌క్రీం తయారీ వివరాలు చూడండి. ఎక్కడ దాన్ని తయారు చేశారు. కాలపరిమితి ఎప్పటి వరకు ఉంది. ప్యాకింగ్ ఎక్కడైనా దెబ్బతిందా అన్నది తప్పనిసరిగా పరిశీలించాలి. ఐస్‌క్రీం ఏ కంపెనీది తీసుకుంటున్నారో తప్పకుండా చూడాల్సిందే. ఒక్కోసారి ఒక్క అక్షరం తేడాతోనే ప్రముఖ కంపెనీల పేర్లతో నకిలీ ఐస్‌క్రీంలను తక్కువ ధరకే విక్రయిస్తుంటారు. అలా తక్కువ ధరకు ప్రముఖ కంపెనీ ఐస్‌క్రీం ఇస్తున్నారంటే ఒకసారి ఆలోచించాల్సిందే. ప్రధానంగా క్యాండీలు రంగురంగులు ఉండేందుకు వాటిలో మితిమీరిన రంగులను కలుపుతున్నారు. అలా మితిమీరిన రంగులు ఉన్నట్టు అనిపిస్తే వాటి జోలికి వెళ్లకపోవడమే ఉత్తమం.
పిల్లల విషయంలో జాగ్రత్త
వినియోగదారులు తమ పిల్లలు మారం చేస్తున్నారని ఏదో ఒకటిలే అని కొనిస్తే మాత్రం అనారోగ్యాన్ని కోరి తెచ్చుకున్నట్టే. కొన్ని ఐస్‌క్రీంలు స్థానికంగా తయారు చేసినవే ఉంటాయి. కానీ వాస్తవానికి ఆయా ఐస్‌క్రీంలు సదరు అడ్రస్‌లలో ఉండవు. ఇలాంటి విషయాలు వినియోగదారులు గుర్తించడం కష్టమే కానీ ఒక్క నిమిషం సమయం కేటాయించి ప్యాకింగ్ ఏ విధంగా ఉంది, చిరునామా, ఐస్‌క్రీంలో ఉపయోగించిన రంగులు వంటివి పరిశీలిస్తే అవి నకిలీవో కాదో తెలుసుకోవచ్చు. ఐస్‌క్రీంలలో శుద్ధి చేసిన నీటినే వినియోగించాలి కానీ కొంతమంది వారికి లభ్యమయ్యే నీటితోనే తయారు చేస్తుంటారు. కాబట్టి ఐస్‌క్రీం రుచి పరిశీలించి ఏదైనా తేడా ఉన్నట్టు గమనిస్తే దాన్ని తినకపోవడమే ఉత్తమం.– కచ్చితంగా తయారీ తేదీ, ఎప్పుడు దాని కాలపరిమితి ముగుస్తుంది. ఎక్కడ తయారు చేశారు. ఐస్‌క్రీంలో రంగులు ఎంత ఎక్కువగా ఉన్నాయి వంటివి చూసి అప్పుడే కొనుగోలు చేయాలి.
ఇంట్లో చేసుకుంటే మేలు..
ఎండాకాలంలో చల్లచల్లని, తియ్యని ఐస్‌క్రీం అంటే ఇష్టపడని వా రు ఉండరు. తలచుకోగానే నోరూరే ఫుడ్ ఐటమ్స్‌లో ఐఎస్ క్రీం ఒకటి. రకరకాల ప్లేవర్స్‌లో దొరికే ఐస్‌క్రీమ్స్ అంటే పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా ఆరగిస్తుంటారు. అయితే తరచూ పార్లర్‌కు వెళ్లి ఐస్ క్రీములను ఆస్వాదించాలంటే అందరికీ సాధ్యం కాదు. ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. అలాగని ఇంట్లోని ఫ్రిజ్‌లో తయారు చేసుకుందాం అంటే అంత టేస్టీగా, అన్నీ ప్లేవర్స్ అందుబాటులో ఉండవు. ఈ క్రమంలోనే ఇంట్లో ఐస్‌క్రీమ్ చేసుకోవాలనుకునే వారి కోసం ఐస్‌క్రీం మేకర్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటిలో వివిధ రకాల ఐస్‌క్రీమ్స్‌ను నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఐస్‌క్రీమ్ పౌడర్, పాలు, పంచదార వంటివి తగిన మోతాదులో ఈ మిషన్‌లో వేసి స్విచ్‌ఆన్ చేస్తే కాసేపటికి నోరూరించే ఐస్‌క్రీమ్ సిద్ధమవుతుంది. మనకు నచ్చే పండ్లతోపాటు ఆరోగ్యకరమైన క్యారెట్, బీట్‌రూట్ వంటి కూరగాయలతో కూడా ఐస్‌క్రీమ్స్ రెడీ చేసుకోవచ్చు. ఈ మేకర్స్‌తో ఐస్‌క్రీమ్స్‌ను 20 నిమిషాల నుంచి 40 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. అందుకు అనువైన బౌల్స్ ఈ పరికరంలో ఉంటాయి. వివిధ సైజుల్లో లభించే ఈ మిషన్స్ ఒకసారి లీటర్ నుంచి ఐదు లీటర్ల వరకు ఐస్‌క్రీమ్ తయారవుతుంది. నగరంలో అన్ని షాపింగ్ మాల్స్, ఎలక్ట్రానిక్స్ షాపుల్లో ఇవి లభిస్తాన్నాయి. ధర సైజు, క్వాలిటీని బట్టి రూ.2 వేలు నుంచి రూ.20 వేలు వరకు ఉంది.