చింతమడకలో బీడీ కార్మికుల ఆందోళన | Beedi Workers concern in chinthamadaka villege | Sakshi
Sakshi News home page

చింతమడకలో బీడీ కార్మికుల ఆందోళన

Published Thu, Mar 19 2015 3:52 AM | Last Updated on Sat, Jul 6 2019 1:14 PM

Beedi Workers concern in chinthamadaka villege

అధికారులు, ప్రజాప్రతినిధులను అడ్డుకున్న కార్మికులు
సిద్దిపేట రూరల్: అర్హులైన బీడీ కార్మికులకు జీవన భృతి అందడంలేదంటూ గ్రామానికి వెళ్లిన అధికారులు, ప్రజాప్రతినిధులు అడ్డుకున్న సంఘటన సిద్దిపేట మండలం చింతమడక గ్రామంలో చోటుచేసుకుంది. బుధవారం గ్రామంలో మిషన్ కాకతీయ పనులను ప్రారంభించడానికి వెళ్లిన ఓఎస్డీ బాల్‌రాజు, ఎంపీపీ ఎర్ర యాదయ్య, ఎంపీడీఓ సమ్మిరెడ్డిని బీడీ కార్మికులు అడ్డుకొని ఆందోళన చేపట్టారు.

ఈ సందర్భంగా పలువురు బీడీ కార్మికులు మాట్లాడుతూ ఏళ్ల తరబడి బీడీ కార్మికులుగా పని చేస్తున్న తమకు జీవన భృతి కల్పించకుండా ఆనర్హులకు అందిస్తున్నారన్నారు. గ్రామంలో సుమారు 500మంది బీడీ కార్మికులు ఉన్నప్పటికీ వంద మందికి మాత్రమే జీవన భృతి  మంజూరు చేశారన్నారు. అర్హులైన వారందరికి జీవన భృతి కల్పించాలన్నారు. అనంతరం ఓఎస్డీ బాల్‌రాజు మాట్లాడుతూ ఇంట్లో ఒకరికి ఏదైనా పింఛన్ వస్తే జీవన భృతికి అనర్హులన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి జీవన భృతి చెల్లిస్తామన్నారు.  అర్హులు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని బీడీ కార్మికులకు నచ్చ జెప్పి పంపించారు.
 
బీడీ కార్మికులందరికీ జీవనభృతి చెల్లించాలి

రామాయంపేట: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీడీ కార్మికులందరికీ జీవన భృతి చెల్లించాలని నూతన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివంది సత్యం డిమాండ్ చేశారు. బుధవారం ఆయన రామాయంపేట వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ బీడీ కార్మికులకు జీవన భృతి మంజూరు చేసే విషయంలో ఎన్నో ఆంక్షలు పెడుతున్నారని, దీంతో అర్హులకు అన్యాయం జరుగుతోందన్నారు. బీడీ కార్మికులకు న్యాయం జరుగకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని  హెచ్చరించారు.
 
నిబంధనల పేరుతో అర్హులను తొలగిస్తున్నారు

చిన్నకోడూరు: బీడీ కార్మికులందరికీ జీవన భృతి చెల్లించాలని బీఎంఎస్ జిల్లా కార్యదర్శి ముద్దం రాజిరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కేసీఆర్ తెలంగాణలోని ఎనిమిది లక్షల మంది బీడీ కార్మికులకు భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి రాగానే నిబంధనల పేరుతో అర్హులను తొలగించడం ఎంత వరకు సమంజసమన్నారు.

సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా జీవన భృతికి ఎంపిక చేయడం వల్ల అనేక మంది అర్హులకు జీవన భృతి అందడం లేదన్నారు. సంవత్సరాల తరబడి బీడీలు చుట్టే వృతిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నవారికి ఈ పథకం వర్తింపజేయాలన్నారు. ఆసరాతో ముడిపెట్టి జీవన భృతి చెల్లించకపోవడం సరికాదన్నారు. వృద్ధులకు ఆసరా, బీడీ కార్మికులకు జీవన భృతి రెండు ఇస్తే తప్ప కార్మికులకు పొట్టనిండే పరిస్థితి లేదన్నారు. అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి వారికి వెంటనే పింఛన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement