మహానేత మరణంతో నిలిచిన అభివృద్ధి
- ముస్లింలకు న్యాయం చేసింది ఆయనే..
- మజ్లిస్ నేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ
చార్మినార్,న్యూస్‌లైన్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం కృషి చేసారని మజ్లిస్ పార్టీ హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కొనియాడారు. సోమవారం మొఘల్‌పురాలోని ఓ ఫంక్షన్‌హాల్లో మజ్లిస్ పార్టీ రాష్ర్ట ఎన్నికల కార్యాలయాన్ని ఆయన ప్రారంభించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు.
కులమతాలకు అతీతంగా ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, స్వతహాగా సెక్యులర్ అయిన ఆయనను తనతో పాటు ముస్లిం ప్రజలు మరువలేరన్నారు. మహానేత మరణానంతరం ఎక్కడికక్కడ అభివృద్ధి స్తంభించిపోయిందన్నారు. ఆయన మరణానంతరం సీఎంలుగా వచ్చిన రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డి తమ సొంత పనులను చ క్కబెట్టడంతోనే సరిపోయిందని అసదుద్దీన్ విమర్శించారు. పాతబస్తీ అభివృద్ధి కోసం తాను డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని కోరిన వెంటనే రూ.2 వేల కోట్ల నిధులను మంజూరు చేశారని గుర్తు చేశారు.
టీడీపీకి డిపాజిట్ గల్లంతు
ఈ ఎన్నికల్లో ముస్లిం ఓటర్లంతా ఏకమై టీడీపీ అభ్యర్థులకు డిపాజిట్ రాకుండా చేస్తారని అసదుద్దీన్ జోస్యం చెప్పారు. మతతత్వ పార్టీ అయిన బీజేపీతో పొత్తుపెట్టుకొని ఈ ఎన్నికల్లో రాజకీయ లబ్ధిపొందాలని చూస్తున్న చంద్రబాబు నాయుడుకు తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ముస్లిం ప్రజల వ్యతిరేకి అయిన నరేంద్ర మోడీని ఎట్టిపరిస్థితుల్లోనూ దేశ ప్రధానిగా అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. వీరి పొత్తుకు వ్యతిరేకంగా తెలంగాణతో పాటు, సీమాంధ్రలోనూ ప్రచారం చేస్తామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీతో పాటు నియోజక వర్గాల అభ్యర్థులు,కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.