
బిర్ బిల్లింగ్‌లో పారా గ్లైడింగ్ విన్యాసాలు...
నేల మీద కుర్చీలో కూర్చోవటంలో ఇంకా కంఫర్ట్ కావాలంటే లగ్జరీని చేర్చుకోవచ్చు. కానీ ఆకాశంలో కుర్చీ వేసుకుని కూర్చుంటే ఎలా ఉంటుంది? ఆసలు ఆకాశంలో కుర్చీ వేసుకుని కూర్చోవడం ఎలా సాధ్యం అంటారా....అది పారాగ్లైడింగ్‌తో మాత్రమే సాధ్యం. విమానం ఎక్కినప్పుడు మనం ఆకాశంలో ప్రయాణిస్తున్న అనుభూతి మాత్రమే లభిస్తుంది. కానీ పక్షిలా ఎగిరిన ఫీలింగ్ మాత్రం ఉండదు. ఈ అనుభూతి సొంతమవ్వాలంటే పారాగ్లైడింగ్ మాత్రమే మార్గం. విభిన్న ఆలోచనలు..అభిరుచులు కలిగిన పర్యాటకులు ఇప్పుడు కేవలం పారాగ్లైడింగ్ అనుభూతి కోసం హిమాచల్ ప్రదేశ్‌లోని ‘బిర్–బిల్లింగ్’ ప్రాంతానికి క్యూ కడుతున్నారు. చలి వేళ సాహసాలకు దిగుతున్నారు.
– సాక్షి సిటీబ్యూరో
బిర్–బిల్లింగ్ ఆసియాలోనే బెస్ట్ పారాగ్‌లైడింగ్ సైట్‌గా గుర్తింపు పొందింది. వరల్డ్ కప్ పోటీలు కూడా ఇక్కడ జరిగాయి. పారాగ్‌లైడింగ్‌కు కావలసిన సహజమైన ల్యాండింగ్, విండ్ ఉన్న ప్రాంతం కావటంతో దేశంలోనే బెస్ట్ పారాగ్‌లైడింగ్ సైట్‌గా బిర్–బిల్లింగ్ స్థానం సంపాదించుకుంది. «ధర్మశాల, మెక్‌లాడ్‌గంజ్‌లతో పోలిస్తే బిర్–బిల్లింగ్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. హిమాచల్ ప్రదేశ్‌లోని బిర్ గ్రామానికి 14 కిలోమీటర్లో దూరంలో ఉన్న కొండ మీద ప్రాంతాన్ని బిల్లింగ్ అంటారు. ఇక్కడ నుంచే పారాచ్యూట్ ఫ్లయింగ్ స్టార్ట్ అవుతుంది. సముద్ర మట్టం నుండి 2400 మీటర్ల ఎత్తులో ఉన్న బిల్లింగ్ ప్రపంచంలోనే బెస్ట్ పారాగ్లైడింగ్ టేకాఫ్ పాయింట్. పారాగ్లైడింగ్, ట్రెక్కింగ్ చేయాలనుకునే వారు బిల్లింగ్‌కు కారు, ఇతర వాహనాల్లో గంటసేపు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. బిర్‌లోని చౌగన్ మైదానం పారాగ్లైడింగ్‌కు ల్యాండింగ్ ప్రాంతం. ఇక్కడి పారాగ్లైడింగ్ అనుభవాలను కొందరు పర్యాటకులు ఇలా పంచుకున్నారు...
ఎలా చేరుకోవాలి...
నగరం నుంచి రైలు లేదా విమానంలో ఢిల్లీకి చేరుకోవాలి. ఢిల్లీ నుంచి బిర్ బిల్లింగ్‌కు వెళ్లేందుకు ప్రైవేటు ఏసీ బస్సులు, ప్రభుత్వ బస్సులుంటాయి. ఇక్కడి నుంచి దాదాపు 13 గంటల ప్రయాణం ఉంటుంది. విమానంలో వెళ్తే ముందు ఢిల్లీ, అక్కడి నుంచి కాంగ్డా వరకు నేరుగా వెళ్లవచ్చు. అక్కడి నుంచి క్యాబ్ లేదా బస్ తీసుకోవాల్సి ఉంటుంది.
మరికొన్ని ప్రత్యేకతలు..
► సాహసికుల మనసుదోచే ప్రాంతం హిమాచల్‌ప్రదేశ్.
► బౌద్ధాలయాలు, మానెస్టరీస్ ఇక్కడ ఎన్నో ఉన్నాయి. వాటిలో బౌద్ధ సంస్కృతి అధ్యయన సంస్థ ‘డీర్ పార్క్ ఇన్‌స్టిట్యూట్’ ముఖ్యమైనది. ఇక్కడ మెడిటేషన్, యోగా, శాంతి తదితర కోర్సులపై శిక్షణ కోర్సులు లభిస్తాయి.
► ట్రెక్కింగ్, సైక్లింగ్, క్యాంపింగ్ చెయ్యడానికి అనుకూలమైన ప్రాంతం.
► దగ్గరల్లో బంగోరు జలపాతం, చారిత్రక బైద్యనాథ్ ఆలయం ఉన్నాయి.
► టాయ్ ట్రెయిన్ ఎక్కాలనే కోరిక ఉన్నావారు ఒక రోజు కేటాయిస్తే అద్భుతమైన
అనుభూతులను మూటగట్టుకోవచ్చు.
► బిర్‌లోని స్థానికులు ఈ ప్రాంతాల్లో మీ పర్యటనకు కావాల్సిన సమాచారం చక్కగా అందిస్తారు.
హిమ సమీరాల తాకిడి..
10–15 నిముషాల పాటు ఆకాశంలో తేలిపోతూ...హిమాలయ పర్వత ప్రాంతాలను చూసే అద్భుతమైన అవకాశం ఈ ఫ్లయింగ్ వల్ల కలుగుతుంది. చల్లటి, స్వచ్ఛమైన హిమ సమీరం అణువణువునూ స్పృశిస్తున్న అనుభూతి జీవితంలో ఒక్కసారైనా అనుభవించాల్సిందే. బిర్ గ్రామంలో అనేక ట్రావెల్ కంపెనీలు ఈ ప్రయాణాన్ని మనకు అందిస్తాయి. అవసరమైన వివరాలు, ఫీజు సేకరించిన తర్వాత వారు వాహనాల్లో బిల్లింగ్‌కు తీసుకువెళ్తారు. అక్కడ పైలట్‌లు మనల్ని ఫ్లయింగ్‌కి సిద్ధం చేస్తారు. మన చేతిలో ఒక స్టిక్ కెమెరాని అందించి సెల్ఫీ వీడియో రికార్డు చేసుకునే అవకాశం కూడా కల్పిస్తారు. ఈ ప్రయాణానికి ఒక్కరికి 1500–2000 వరకూ చార్జి చేస్తారు. అనుభవం ఉన్న వాళ్లు సొంతంగా కూడా ఫ్లై చేస్తుంటారు.
– నయీం, ట్రావెలర్, ఓల్డ్‌సిటీ
రీచార్జ్ అవుతాం
జీవితం నిస్సత్తువగా, నిర్జీవంగా, డిప్రెస్‌డ్‌గా ఉన్నప్పుడు ఇలాంటి యాత్రలు చెయ్యటం వల్ల రీచార్జ్ అవుతాం అని ఫ్రెండ్స్ చెప్పారు. ఇక్కడికి వచ్చాక అది నిజమే అనిపించింది. మానసిక అలజడులను శాంత పరిచే ప్రశాంత వాతావరణం హిమాలయాల సొంతం. ఇక పారాచ్యూట్ ఎక్కి భయపడుతున్న నన్ను, నా పైలట్ రాహుల్ కూల్ చేశారు. ఆ ప్రాంతం ప్రత్యేకత గురించి, తన జీవితం గురించి, బిర్, హిమాలయాల్లో పుట్టడం తన అదృష్టంగా చెబుతూ, నా దృష్టి మళ్లించి భయం పోగొట్టాడు. ఆ పర్వతాల మధ్యన ఉన్న బిర్ గ్రామంలోని తన ఇళ్లు, ఆ చుట్టు పక్కన పారే నది, పంటలు, రాజకీయాలు అన్నింటి గురించి ఆకాశంలోనే వివరించాడు. తన మాటల వల్ల నగర జీవితాల్లో మనం ఏం కోల్పోతున్నామో తెలుసుకున్నా. ఈ ఫ్లయింగ్.. సోల్‌కి కొత్త ఎనర్జీనిచ్చింది.
– శోభన, ట్రావెలర్, చిక్కడపల్లి
పూర్తిగా సేఫ్..
హిమాలయాల్లోని ధౌలాధర్ పర్వత శ్రేణి నుంచి కాంగ్డా లోయలో సాగే పారాగ్లైడింగ్ పూర్తిగా సురక్షితం. వర్షాకాలంలో నాలుగు నెలలు మాత్రం బిర్ బిల్లింగ్‌లో ఈ పారాచ్యూట్ పక్షుల సందడి ఉండదు. మిగతా ఏడాదంతా అంటే చలికాలం, వేసవిలో దేశ విదేశీ సాహసికులు, యాత్రికులు ఇక్కడికి వస్తూనే ఉంటారు.
– రాహుల్, పైలట్ (బిర్ బిల్లింగ్)
Comments
Please login to add a commentAdd a comment