భక్తగోదారి | Bhaktagodari | Sakshi
Sakshi News home page

భక్తగోదారి

Published Fri, Jul 17 2015 2:55 AM | Last Updated on Sun, Sep 3 2017 5:37 AM

భక్తగోదారి

భక్తగోదారి

♦ భక్తులకు జయేంద్రస్వామి ప్రవచనాలు
♦ మణుగూరులో ప్రవీణ్ తొగాడియా..
♦ పర్ణశాల, మోతెకు పెరుగుతున్న భక్తులు
 
 భద్రాద్రికి భక్తుల తాకిడి రోజురోజుకూ పెరుగుతోంది. మిగిలిన ఘాట్లకు కూడా భారీగా భక్తులు తరలివస్తున్నారు. భద్రాచలంలో స్నానమాచరించేందుకు సామాన్య భక్తులతో పాటు వీఐపీలు కూడా అమితాసక్తి చూపుతున్నారు. రాజమండ్రి ఘటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌తోపాటు పొరుగురాష్ట్రాల నుంచి భక్తులు ఎక్కువగా భద్రాద్రికి వస్తున్నారు. స్వల్ప లోటుపాట్లు మినహా భద్రాచలంలో పుష్కరస్నానాలు ప్రశాంతంగా కొనసాగుతుండటంపై హర్షం వ్యక్తమవుతోంది. గురువారం నాడు చినజీయర్‌స్వామి, జయేంద్రసరస్వతితో పాటు వీహెచ్‌పీ నేత ప్రవీణ్‌తొగాడియూ పుష్కరపూజలు చేశారు.
 - భద్రాచలం నుంచి సాక్షి బృందం
 
 భద్రాచలం నుంచి సాక్షి బృందం : పుష్కరవేళ రామనామస్మరణతో గౌతమీ తీరం మార్మోగింది. మహా పుష్కరాలలో స్నానమాచరించేందుకు మూడోరోజు గురువారం జిల్లాలోని 8 పుష్కరఘాట్‌లకు భక్తులు పోటెత్తారు. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో భద్రాచలానికి తరలివచ్చారు. స్నానమనంతరం రామాలయూన్ని దర్శించుకునేందుకు బారులు తీరారు. స్వామివారి దర్శనానికి 6 గంటలకు పైగా సమయం పట్టింది. పలువురు భక్తులు గోదావరి పుష్కర ఘాట్‌ల వద్ద పునర్వసు మండపంలో ఏర్పాటు చేసిన శ్రీ సీతారాములవారి ఉత్సవ మూర్తులకు పూజలు చేసి వెనుదిరిగారు.

భద్రాచలంలో రామాలయ దర్శనానికి ఎక్కువ సమయం పడుతుండటంతో పలువురు పర్ణశాలకు తరలివెళ్లారు. జీయర్  మఠంలో భక్తులకు ప్రచనాలు ఇచ్చిన అనంతరం త్రిదండి చినజీయర్ స్వామి రామాలయాన్ని దర్శించుకొని శ్రీసీతారాముల వారికి పూజలు చేశారు. బుధవారం రాత్రి భద్రాచలం వచ్చిన కంచికామకోటి పీఠాధిపతి జయేంద్రసరస్వతి స్వామివారు గురువారం ఉదయం రామాలయూనికి సమీపంలో ఉన్న సీతానిలయంలో భక్తులకు ఆశీర్వచనాలు అందించి, ప్రవచనాలు ఇచ్చారు. స్వామివారి నిత్యకల్యాణాన్ని ఉత్తర ద్వార దర్శనంలో శాస్త్రోక్తంగా జరిపించారు. కల్యాణవేడుకలో కూడా భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

వరుసగా సెలవుదినాలు కావటంతో భక్తుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్న అధికారులు స్వామివారి దర్శనాన్ని మిథిలాస్టేడియంలో కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రాచలానికి వీఐపీల తాకిడి కూడా పెరుగుతోంది. మణుగూరు మండలం కొండాయిగూడెంలో జరిగిన శివలింగ ప్రతిష్టోత్సవంనకు విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షులు ప్రవీణ్‌తొగాడియా హాజరయ్యారు. పర్ణశాల, మోతే, వెంకటాపురం మండలం రామచంద్రాపురం ఘాట్‌లలో కూడా భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారు.

 ఏపీ నుంచి తరలివస్తున్న భక్తులు
     రాజమండ్రి పుష్కర ఘాట్‌లో తొక్కిసలాట నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. భద్రాచలం ఘాట్లలో స్నానమాచరించే వారిలో సగం మంది ఏపీలోని వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన వారు ఉన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు ఆర్టీసీ బస్సులు సరిపడా లేక ఇబ్బంది పడుతున్నారు.  భద్రాచలం, మోతె  ఘాట్‌లకు వచ్చే భక్తులు ఎక్కువ దూరం కాలినడకనే ప్రయాణించాల్సి వస్తోంది.

ఖమ్మం, కుక్కునూరు రహదారి నుంచి వచ్చే వాహనాలను సారపాక సమీపంలోని పార్కింగ్ ప్రదేశంలో నిలిపి, అక్కడ నుంచి ఆర్టీసీ బస్సుల్లో వస్తున్నారు. ఆర్టీసీ బస్సుల ద్వారా వస్తున్న భక్తులను  పుష్కర ఘాట్‌లకు దూరంగా ఉన్న చర్ల రోడ్‌లోని మార్కెట్‌యార్డు ప్రాంగణం, అంబేద్కర్ సెంటర్ పరి సరాల్లోని రహదారులపై వదులుతున్నారు. రెండుకిలోమీటర్ల మేర నడిచి వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. పుష్కర ఘాట్‌లలో సరిపడా టెంట్లు లేకపోవటంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. బుధవారం రా త్రి కురిసిన వర్షానికి ఘా ట్‌లలో ఏర్పాటు చేసిన టెంట్లు కూలిపోగా, వాటిని గురువారం సాయంత్రం వరకూ సరిచేయలేదు.

 శాస్త్రోక్తంగా నిత్యకల్యాణం
  ఉత్తర ద్వారంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయం నుంచి స్వామివారిని ఊరేగింపుగా ఉత్తర ద్వారం వద్దకు తీసుకొచ్చి పూజలు నిర్వహించారు. శుక్రవారం ఉత్తరద్వారంలో స్వామివారి కల్యాణం అనంతరం పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తామని దేవస్థానం ఈవో కూరాకుల జ్యోతి, ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement