బైకుతో ఢీకొట్టి.. ఆపై కొట్టించి.. | Bike Accident In Moinabad | Sakshi
Sakshi News home page

బైకుతో ఢీకొట్టి.. ఆపై కొట్టించి..

Mar 23 2018 4:16 PM | Updated on Apr 3 2019 8:28 PM

Bike Accident In Moinabad - Sakshi

ఆందోళనకారులతో మాట్లాడుతున్న ఏసీపీ అశోక్‌

సాక్షి, మొయినాబాద్‌ (చేవెళ్ల): ఎదురెదురుగా వచ్చిన రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన యువకుడితోపాటు మరికొంత మంది వచ్చి గాయాలైన యువకుడితోపాటు ప్రమాద ఘటనను ఆగి చూస్తున్న వ్యక్తిపైనా దాడి చేశారు. దాడి చేసిన వారిని అరెస్టు చేయడంలో పోలీసులు అలసత్వం వహిస్తున్నారంటూ సురంగల్‌ గ్రామస్తులు మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ ముందు ఆందోళనకు దిగారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని కేతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బి.రాజు బుధవారం రాత్రి సురంగల్‌ నుంచి మొయినాబాద్‌ వైపు బైక్‌పై వెళ్తున్నాడు. అదే సమయంలో మొయినాబాద్‌కు చెందిన జావీద్‌ బైక్‌పై సురంగల్‌ వైపు వెళ్తుండగా రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికీ గాయాలయ్యాయి. అయితే జావీద్‌ తన మామ షరీఫ్‌కు ఫోన్‌ చేసి ప్రమాదం జరిగిన విషయం చెప్పాడు. షరీఫ్‌ తన స్నేహితులైన వాజిద్, రజాక్, ఫిరోజ్‌తోపాటు మరో ఇద్దరితో కలిసి ప్రమాదం జరిగిన చోటుకు వెళ్లాడు. ప్రమాదంలో గాయపడ్డ రాజుపై దాడి చేశారు. అదే సమయంలో సురంగల్‌ గ్రామానికి చెందిన ఎల్గని భూషణ్‌ పిల్లలను ఆసుపత్రిలో చూపించేందుకు ఆటోలో తీసుకుని మొయినాబాద్‌ వైపు వస్తున్నాడు. ప్రమాదం జరిగిన చోట మంది గుమిగూడి ఉండటంతో ఆటో ఆపి కిందకు దిగాడు. రాజుపై దాడిచేస్తున్న వారు భూషణ్‌పైనా దాడి చేసి కొట్టారు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి.

పోలీస్‌స్టేషన్‌ ఎదుట గ్రామస్తుల ఆందోళన
దాడికి పాల్పడిన వారిపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకపోవడంతో గురువారం ఉదయం బాధితుడు భూషణ్‌తోపాటు సురంగల్‌ గ్రామస్తులు పోలీస్‌స్టేషన్‌ వద్ద ఆందోళనకు దిగారు. దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని స్టేషన్‌ ఎదుట బైఠాయించారు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్‌ ఏసీపీ అశోక్‌ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. రోడ్డు ప్రమాదం, దాడికి సంబంధించి రెండు కేసులు నమోదు చేసినట్టు ఎస్సై నయీముద్దీన్‌ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement