moinabad police
-
ఫాంహౌస్ ఎపిసోడ్లో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు
సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’కేసులో బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ విచారణలో భాగంగా పోలీసుల దర్యాప్తుపై విధించిన స్టేను హైకోర్టు ఎత్తివేసింది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేసుకోవచ్చంటూ స్పష్టం చేసింది. ఇలాంటి కేసుల్లో ఎక్కువ రోజులు దర్యాప్తు నిలిపివేయడం మంచిది కాదని వ్యాఖ్యానించింది. కేసుపై రాష్ట్ర, జాతీయ స్థాయి మీడియాల్లో విపరీత ప్రచారం జరిగిన దృష్ట్యా లోతైన విచారణ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. అలాగే ముగ్గురు నిందితులు రామచంద్ర భారతి, నందుకుమార్, సింహయాజీ దాఖలు చేసిన పిటిషన్లో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. విచారణ పురోగతిపై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. మొయినాబాద్ ఫాంహౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలకు అప్పగించాలని బీజేపీ, నిందితులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. అయితే అసలు ఈ కేసులో పిటిషన్ వేసే అర్హత (లోకస్ స్టాండీ) బీజేపీకి ఉందా? లేదా? అనే అంశంపై ముందుగా వాదనలు వినిపించాలని జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం ఆదేశించింది. ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) రామచందర్‌రావు ఏఏజీ వాదనలు వినిపిస్తూ.. ‘అసలు ఈ కేసులో బీజేపీకి పిటిషన్ వేసే అర్హతే లేదు. ఈ కేసుకు సంబంధించినంత వరకు బీజేపీకి సంబంధం లేదు. ఎఫ్ఐఆర్లో బీజేపీ పేరుగాని, వారి నాయకుల పేర్లుగానీ లేవు. వారు నిందితులు కాదు. బాధితులు కాదు. వారికి వచ్చిన సమస్య ఏమిటో అర్ధం కావడం లేదు. దర్యాప్తు వివక్షాపూరితంగా కొనసాగుతోందని చెప్పడానికి వారెవరు? కేసులో ఎలాంటి రాజకీయ కుట్ర లేదు. దర్యాప్తు నిష్పపక్ష పాతంగా సాగుతుంది. గత నెల 26న రాత్రి కేసు నమోదు చేయగా, మరుసటి రోజు(24గంటలైనా గడవక ముందే) విచారణ పారదర్శకంగా జరగడంలేదని బీజేపీ ఈ పిటిషన్ దాఖలు చేసింది. కేసు విచారణను సీబీఐకు అప్పగించాల్సిన అవసరం లేదు. గత నెల 26న రాత్రి పంచానామా ప్రారంభించారు.. పూర్తయ్యే సరికి 27వ తేదీ ఉదయం 8.30 అయ్యింది. అనంతరం మధ్యవర్తులతో సంతకాలు చేయించారు. రఫ్ స్కెచ్ కూడా తయారు చేయగా, దానిపై కూడా సంతకాలు చేశారు. అయితే మధ్యవర్తులు పొరపాటున తేదీని 26గా రాశారు. ఈ ఒక్క కారణాన్ని చూపి సీబీఐ దర్యాప్తు కోరడం సరికాదు. దర్యాప్తు జాప్యమైతే సాకు‡్ష్యలను తారుమారు చేసే అవకాశం ఉంది. నిజాలు నిగ్గుతేల్చేందుకు పోలీసులు దర్యాప్తు చేయాలి. దీని కోసం స్టేను ఎత్తివేయాలి’అని నివేదించారు. బీజేపీపై నిందలు మోపారు.. ‘ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు పంచానామా అంతా 26నే సిద్ధం చేసినా... దానిపై అత్యంత కీలకమైన సాకు‡్ష్యల సంతకాలు మాత్రం 27న చేశారు. స్వాధీన ప్రక్రియంతా 26నే పూర్తయినా.. మండల రెవెన్యూ అధికారుల సంతకాలు కూడా 27నే చేశారు. ‘ఎమ్మెల్యేలకు ఎర’అంశమంతా తమకు ముందుగానే తెలుసని పోలీసులు చెబుతున్నారు. ఆ మేరకు స్ట్రింగ్ ఆపరేషన్ చేసి నిందితులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నామని వెల్లడిస్తున్నారు. ముందస్తు అంతా సిద్ధం చేసుకున్న పోలీ సులు సంతకాలు మాత్రం మరుసటిరోజు ఎందుకు తీసుకున్నారు? ఇది పలు అనుమానాలకు తావిస్తోంది. రాష్ట్రంలోని అధికార పార్టీ ప్రోద్బలంతో పోలీసులు కావాలనే బీజేపీపై నిందమోపుతూ అప్రతిష్ట పాలుచేశారు. ప్రజలను తప్పుదారి పట్టించడం కోసం ఇదంతా చేస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి మీడియాకు సాక్ష్యాలను ఇవ్వడమే కాకుండా బీజేపీ కేంద్ర న్యాయకత్వంపై తీవ్రమైన మాటల దాడి చేశారు. జాతీయ స్థాయిలో దీనిపై ప్రచారం జరిగింది, ఈ వ్యవహారంలో పిటిషనర్ పార్టీ బాధితురాలే. ముఖ్యమంత్రి ఆరోపణల నేపథ్యంలో చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. ముఖ్యమంత్రి నేరుగా బీజేపీ కేంద్ర నాయకత్వంపై మాటల దాడి చేస్తుంటే.. కోర్టులో ప్రభుత్వ న్యాయవాదులు అందుకు భిన్నంగా బీజేపీకి సంబంధం లేదని క్లీన్ చిట్ ఇస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మా వాదనను తోసిపుచ్చడం సరికాదు’అని బీజేపీ తరఫున సీనియర్ న్యాయవాది జె.ప్రభాకర్ వాదనలు వినిపించారు. మరోవైపు ఫామ్‌హౌస్‌లో పట్టుబడిన నిందితులకు 41ఏ నోటీసు ఇవ్వలేదని రిమాండ్‌కు తరలించేందుకు ఏసీబీ కోర్టు నిరాకరించింది. దీన్ని సైబరాబాద్ పోలీసులు హైకోర్టులో సవాల్ చేయగా, నిందితుల రిమాండ్‌కు అనుమతిస్తూ తీర్పు వెలువరించింది. మంగళవారం ఉత్తర్వుల సందర్భంగా ఈ వివరాలన్నింటిని పేర్కొన్న న్యాయమూర్తి జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి.. ఈ కేసులో మెయినాబాద్ పోలీసులు దర్యాప్తు చేయవచ్చని ఆదేశాలు జారీ చేశారు. అలాగే సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో ఈ కేసు విచారణ జరిపించాలని బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌పై లోతైన విచారణ కొనసాగించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కాగా, హైకోర్టు స్టే ఎత్తివేయడంతో ముగ్గురు నిందితులను పోలీసులు కస్టడీకి కోరే అవకాశం ఉంది. -
బైకుతో ఢీకొట్టి.. ఆపై కొట్టించి..
సాక్షి, మొయినాబాద్ (చేవెళ్ల): ఎదురెదురుగా వచ్చిన రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన యువకుడితోపాటు మరికొంత మంది వచ్చి గాయాలైన యువకుడితోపాటు ప్రమాద ఘటనను ఆగి చూస్తున్న వ్యక్తిపైనా దాడి చేశారు. దాడి చేసిన వారిని అరెస్టు చేయడంలో పోలీసులు అలసత్వం వహిస్తున్నారంటూ సురంగల్ గ్రామస్తులు మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని కేతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బి.రాజు బుధవారం రాత్రి సురంగల్ నుంచి మొయినాబాద్ వైపు బైక్‌పై వెళ్తున్నాడు. అదే సమయంలో మొయినాబాద్‌కు చెందిన జావీద్ బైక్‌పై సురంగల్ వైపు వెళ్తుండగా రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికీ గాయాలయ్యాయి. అయితే జావీద్ తన మామ షరీఫ్‌కు ఫోన్ చేసి ప్రమాదం జరిగిన విషయం చెప్పాడు. షరీఫ్ తన స్నేహితులైన వాజిద్, రజాక్, ఫిరోజ్‌తోపాటు మరో ఇద్దరితో కలిసి ప్రమాదం జరిగిన చోటుకు వెళ్లాడు. ప్రమాదంలో గాయపడ్డ రాజుపై దాడి చేశారు. అదే సమయంలో సురంగల్ గ్రామానికి చెందిన ఎల్గని భూషణ్ పిల్లలను ఆసుపత్రిలో చూపించేందుకు ఆటోలో తీసుకుని మొయినాబాద్ వైపు వస్తున్నాడు. ప్రమాదం జరిగిన చోట మంది గుమిగూడి ఉండటంతో ఆటో ఆపి కిందకు దిగాడు. రాజుపై దాడిచేస్తున్న వారు భూషణ్పైనా దాడి చేసి కొట్టారు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీస్‌స్టేషన్ ఎదుట గ్రామస్తుల ఆందోళన దాడికి పాల్పడిన వారిపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకపోవడంతో గురువారం ఉదయం బాధితుడు భూషణ్‌తోపాటు సురంగల్ గ్రామస్తులు పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని స్టేషన్ ఎదుట బైఠాయించారు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ ఏసీపీ అశోక్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. రోడ్డు ప్రమాదం, దాడికి సంబంధించి రెండు కేసులు నమోదు చేసినట్టు ఎస్సై నయీముద్దీన్ తెలిపారు. -
ఫాంహౌస్లపై పోలీసుల దాడి, పలువురి అరెస్ట్
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని పలు ఫాంహౌస్లపై పోలీసులు శనివారం మెరుపు దాడి చేశారు. ఈ సందర్భంగా మద్యం, హుక్కాతో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మండలంలోని అమ్దాపూర్లోని మల్లేష్‌యాదవ్ ఓ ఫాంహౌస్‌పై దాడి చేసిన పోలీసులు...అనుమతి లేకుండా ఫాంహౌస్‌లో విందు ఏర్పాటు చేసినవారిపై కేసు నమోదు చేసి 20మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల క్రితం కూడా ఈ ఫాంహౌస్‌పై పోలీసులు దాడి చేసి సుమారు 40మంది విద్యార్థులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అలాగే పలు ఫాంహౌస్‌ల్లో పేకాడుతున్నవారిని అదుపులోకి తీసుకున్నారు. గత కొద్దికాలంగా నగర శివార్లలో ఫాంహౌస్‌లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారటంతో పాటు, రేవ్ పార్టీలు జోరుగా సాగుతుండటంతో పోలీసులు రంగంలోకి దిగారు. -
అనుమతి లేకుండా ఫాంహౌస్‌లో విందు
మొయినాబాద్: అనుమతి లేకుండా ఫాంహౌస్‌లో విం దు ఏర్పాటు చేసినవారిపై మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. సీఐ రవిచంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలకు చెందిన ఎంబీఏ విద్యార్థులు దశరథ్, సుధీర్‌లు కళాశాలలోని విద్యార్థులతో కలిసి పార్టీ(విందు) ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు. కళాశాలలోని 40 మంది విద్యార్థుల నుంచి రూ.1200 చొప్పున డబ్బులు వసూలు చేశారు. మండల పరిధిలోని అమ్డాపూర్ రెవెన్యూలో ఉన్న మల్లేష్‌యాదవ్ ఫాంహౌస్‌లో విందు ఏర్పాటు చేసేందుకు రూ.30 వేలకు అద్దెకు తీసుకున్నారు. శుక్రవారం విందుకు ఏర్పాట్లు సిద్ధం చేసి మధ్యాహ్నం 3 గంటలకు విద్యార్థులంతా ఫాంహౌస్‌కు చేరుకున్నారు. విందు విషయం తెలుసుకున్న సీఐ రవిచంద్ర సిబ్బందితో కలిసి ఫాంహౌస్‌పై దాడి చేశారు. మొత్తం 40 మంది విద్యార్థుల్లో పది మంది అమ్మాయిలు ఉన్నారు. 8 కార్టన్ల బీరు బాటిళ్లు, 6 హుక్క బాటిళ్లు, డీజేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పార్టీ ఏర్పాటు చేసిన విద్యార్థులు దశరథ్, సుధీర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు ఫాంహౌస్ యజమాని మల్లేష్‌యాదవ్, సూపర్వైజర్ శ్రీనివాస్యాదవ్లపైనా కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. కొత్త సంవత్సరం స్వాగతం సందర్భంగా అనుమతులు లేకుండా విందులు ఏర్పాటు చేస్తే కేసులు నమోదు చేస్తామని ఈసందర్భంగా సీఐ హెచ్చరించారు. -
‘ముజ్రా’ కేసులో మరో ఇద్దరికి రిమాండు
మొయినాబాద్: ముజ్రా పార్టీ కేసులో మరో ఇద్దరి నిందితులను మొయినాబాద్ పోలీసులు అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. మండల పరిధిలోని చిలుకూరులో ఉన్న గ్రీన్‌హోమ్ వెంచర్‌లోని ఓ ఇంట్లో ఈ నెల 8న సోమవారం అర్ధరాత్రి ముజ్రా పార్టీ నిర్వహిస్తూ 30 మంది యువతీయువకులు పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ఇదే కేసులో ఇంటి యజమానితో పాటు ఇంటిని అద్దెకు తీసుకున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో సీఐ రవిచంద్ర వివరాలు వెల్లడించారు. చిలుకూరులోని గ్రీన్‌హోమ్ వెంచర్లో నగరంలోని మెహిదీపట్నంకు చెందిన విజయానందారె డ్డి 2006లో ప్లాట్ కొనుగోలు చేసి ఇళ్లు ని ర్మించుకున్నాడు. ఆరు నెలల క్రితం ఇంటిని అద్దెకు ఇస్తామంటూ ‘ఆన్లైన్’ ప్రకటన పెట్టాడు. నగరంలోని కొత్తపేటలో నివాసముండే ప్రదీప్‌జైన్ అమీర్‌పేటలో టెలికాలర్‌గా పనిచేస్తూ సుల్తాన్‌బజార్‌లో చాట్‌బండార్ నడుపుతున్నాడు. అతడికి రూ. 4 లక్షల వరకు అప్పులు అయ్యాయి. నిత్యం చాట్‌బండార్ వద్దకు వచ్చే దిలీప్జైన్తో అతనికి పరిచయం ఏర్పడింది. తనకు రూ.4 లక్షల అప్పు ఉందని ప్రదీప్‌జైన్, దిలీప్జైన్కు చెప్పాడు. ఓ ఇంటినిగాని, ఫాంహౌస్‌ను గాని అద్దెకు తీసుకుంటే అందులో పార్టీలు ఏర్పాటు చేస్తూ డబ్బు సంపాదించవచ్చని దిలీప్‌జైన్ అతడికి సల హా ఇచ్చాడు. ‘నీవు ఇంటినిగాని, ఫాంహౌస్‌ను గాని అద్దెకు తీసుకుంటే పార్టీలు ఏర్పాటు చేసే విషయం నేను చూసుకుంటాన’ని ప్రదీప్‌జైన్ చెప్పాడు. దీంతో 6 నెలల క్రితం ప్రదీప్‌జైన్ ఆన్లైన్లో ప్రకటన చూసి చిలుకూరులోని విజయానందారెడ్డి ఇంటిని నెలకు రూ.30 వేల చొప్పున అద్దెకు తీసుకున్నాడు. అప్పటి నుంచి ఇద్దరు కలిసి పార్టీలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈక్రమంలో సోమవారం అర్ధరాత్రి దిలీప్‌జైన్ ఏర్పాటు చేసిన ముజ్రా పార్టీపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. దిలీప్జైన్తో పాటు 30 మందియువతీ యువకులకు అరెస్టు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. ఇంటి యజమాని విజయానందారెడ్డి, ఇంటిని అద్దెకు తీసుకున్న ప్రదీప్జైన్లను శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
తనిఖీల్లో రూ. 20.5లక్షలు పట్టివేత
వేర్వేరు ప్రాంతాల్లో స్వాధీనం మొయినాబాద్, న్యూస్‌లైన్: జిల్లా పరిధిలో శనివారం వేర్వేరు ప్రాంతాల్లో పోలీసులు రూ. 20.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మొయినాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని రెడ్డిపల్లి వద్ద శనివారం సాయంత్రం వాహనాల తనిఖీలు నిర్వహించారు. నగరం నుంచి శంకర్పల్లి మండల పరిధిలోని ప్రగతి రిసార్ట్స్‌కు వెళ్తున్న ఓ కారులో రూ.15.20 లక్షల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కారులో ఉన్న వ్యక్తిని ప్రగతి రిసార్ట్స్‌లో పనిచేసే శివగా గుర్తించారు. అతడు నగదుకు సంబంధించిన సరైన ఆధారాలు చూపకపోవడంతో సీజ్ చేసినట్లు సీఐ రవిచంద్ర వెల్లడించారు. అదే విధంగా మండల పరిధిలోని హిమాయత్‌నగర్ చౌరస్తాలో మధ్యాహ్నం నిర్వహించిన తనిఖీల్లో చేవెళ్ల పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి భార్య సంగీతారెడ్డి కారులోంచి టీఆర్ఎస్ పార్టీ జెండాలు, బ్యానర్లు, తోరణాలు, కండువాలు, గొడుగులు, కరపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వాటిని సీజ్ చేసి ఎన్నికల అధికారి, చేవెళ్ల ఆర్డీవో చంద్రశేఖరరావుకు అప్పగించినట్లు సీఐ తెలిపారు. ఈ తనిఖీల్లో ఎస్సై శ్రీనివాసరావు, కానిస్టేబుళ్లు ఉన్నారు. బైకుపై తరలిస్తున్న రూ.3.8 లక్షలు.. ఘట్కేసర్: బైకుపై తరలిస్తున్న రూ.3.8 లక్షల నగదును ఘట్కేసర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.వివరాలు.. మండల పరిధిలోని నారపల్లిలో వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై చెక్‌పోస్టులో శనివారం స్థానిక పోలీసులు తనిఖీలు చేశారు. బైకుపై వెళ్తున్న హరిశ్రీనివాస్ నుంచి రూ.3.8 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నారపల్లి సమీపంలోని సిద్ధార్థ కాలేజీకి విద్యార్థులు చెల్లించిన ఫీజును నగరంలోని ఆక్సిస్ బ్యాంక్‌లో డిపాజిట్ చేసేందుకు తీసుకెళ్తున్నట్లు హరిశ్రీనివాస్ పోలీసులకు చెప్పాడు. ఆధారాలు చూపకపోవడంతో పోలీసులు నగదును సీజ్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కందుకూరు: కారులో తీసుకెళ్తున్న రూ.1.5 లక్షలను కందుకూరు పోలీసులు సీజ్ చేశారు. వివరాలు.. కందుకూరు పరిధిలోని శ్రీశైలం రహదారిలో అమ్ములు దాబా సమీపంలోని చెక్ పోస్టులో శనివారం సీఐ జానకీరెడ్డి ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేశారు. మధ్యాహ్న సమయంలో మహబూబ్‌నగర్ జిల్లా ఆమన్‌గల్ నుంచి వస్తున్న కారు (ఏపీ 22 ఎడీ 1122)లో రూ.1.5 లక్షల నగదు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కారులో ప్రయాణిస్తున్న ఆమన్‌గల్‌కు చెందిన పున్నం రామకృష్ణ తాను బట్టల వ్యాపారినని, దుస్తుల కొనుగోలు కోసం నగరానికి వెళ్తున్నట్లు చెప్పాడు. కాగా నగుదుకు సంబంధించిన ఆధారాలు చూపకపోవడంతో సీజ్ చేసి స్టాటిస్టిక్ అధికారుల ద్వారా ట్రెజరీకి తరలించినట్లు సీఐ తెలిపారు.