సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’కేసులో బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ విచారణలో భాగంగా పోలీసుల దర్యాప్తుపై విధించిన స్టేను హైకోర్టు ఎత్తివేసింది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేసుకోవచ్చంటూ స్పష్టం చేసింది. ఇలాంటి కేసుల్లో ఎక్కువ రోజులు దర్యాప్తు నిలిపివేయడం మంచిది కాదని వ్యాఖ్యానించింది. కేసుపై రాష్ట్ర, జాతీయ స్థాయి మీడియాల్లో విపరీత ప్రచారం జరిగిన దృష్ట్యా లోతైన విచారణ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.
అలాగే ముగ్గురు నిందితులు రామచంద్ర భారతి, నందుకుమార్, సింహయాజీ దాఖలు చేసిన పిటిషన్‌లో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. విచారణ పురోగతిపై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. మొయినాబాద్ ఫాంహౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలకు అప్పగించాలని బీజేపీ, నిందితులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.
అయితే అసలు ఈ కేసులో పిటిషన్ వేసే అర్హత (లోకస్ స్టాండీ) బీజేపీకి ఉందా? లేదా? అనే అంశంపై ముందుగా వాదనలు వినిపించాలని జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం ఆదేశించింది. ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) రామచందర్‌రావు ఏఏజీ వాదనలు వినిపిస్తూ.. ‘అసలు ఈ కేసులో బీజేపీకి పిటిషన్ వేసే అర్హతే లేదు. ఈ కేసుకు సంబంధించినంత వరకు బీజేపీకి సంబంధం లేదు. ఎఫ్‌ఐఆర్‌లో బీజేపీ పేరుగాని, వారి నాయకుల పేర్లుగానీ లేవు. వారు నిందితులు కాదు. బాధితులు కాదు. వారికి వచ్చిన సమస్య ఏమిటో అర్ధం కావడం లేదు. దర్యాప్తు వివక్షాపూరితంగా కొనసాగుతోందని చెప్పడానికి వారెవరు? కేసులో ఎలాంటి రాజకీయ కుట్ర లేదు. దర్యాప్తు నిష్పపక్ష పాతంగా సాగుతుంది.
గత నెల 26న రాత్రి కేసు నమోదు చేయగా, మరుసటి రోజు(24గంటలైనా గడవక ముందే) విచారణ పారదర్శకంగా జరగడంలేదని బీజేపీ ఈ పిటిషన్ దాఖలు చేసింది. కేసు విచారణను సీబీఐకు అప్పగించాల్సిన అవసరం లేదు. గత నెల 26న రాత్రి పంచానామా ప్రారంభించారు.. పూర్తయ్యే సరికి 27వ తేదీ ఉదయం 8.30 అయ్యింది. అనంతరం మధ్యవర్తులతో సంతకాలు చేయించారు. రఫ్ స్కెచ్ కూడా తయారు చేయగా, దానిపై కూడా సంతకాలు చేశారు. అయితే మధ్యవర్తులు పొరపాటున తేదీని 26గా రాశారు. ఈ ఒక్క కారణాన్ని చూపి సీబీఐ దర్యాప్తు కోరడం సరికాదు. దర్యాప్తు జాప్యమైతే సాకు‡్ష్యలను తారుమారు చేసే అవకాశం ఉంది. నిజాలు నిగ్గుతేల్చేందుకు పోలీసులు దర్యాప్తు చేయాలి. దీని కోసం స్టేను ఎత్తివేయాలి’అని నివేదించారు.
బీజేపీపై నిందలు మోపారు..
‘ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు పంచానామా అంతా 26నే సిద్ధం చేసినా... దానిపై అత్యంత కీలకమైన సాకు‡్ష్యల సంతకాలు మాత్రం 27న చేశారు. స్వాధీన ప్రక్రియంతా 26నే పూర్తయినా.. మండల రెవెన్యూ అధికారుల సంతకాలు కూడా 27నే చేశారు. ‘ఎమ్మెల్యేలకు ఎర’అంశమంతా తమకు ముందుగానే తెలుసని పోలీసులు చెబుతున్నారు. ఆ మేరకు స్ట్రింగ్ ఆపరేషన్ చేసి నిందితులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నామని వెల్లడిస్తున్నారు. ముందస్తు అంతా సిద్ధం చేసుకున్న పోలీ సులు సంతకాలు మాత్రం మరుసటిరోజు ఎందుకు తీసుకున్నారు? ఇది పలు అనుమానాలకు తావిస్తోంది. రాష్ట్రంలోని అధికార పార్టీ ప్రోద్బలంతో పోలీసులు కావాలనే బీజేపీపై నిందమోపుతూ అప్రతిష్ట పాలుచేశారు.
ప్రజలను తప్పుదారి పట్టించడం కోసం ఇదంతా చేస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి మీడియాకు సాక్ష్యాలను ఇవ్వడమే కాకుండా బీజేపీ కేంద్ర న్యాయకత్వంపై తీవ్రమైన మాటల దాడి చేశారు. జాతీయ స్థాయిలో దీనిపై ప్రచారం జరిగింది, ఈ వ్యవహారంలో పిటిషనర్ పార్టీ బాధితురాలే. ముఖ్యమంత్రి ఆరోపణల నేపథ్యంలో చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. ముఖ్యమంత్రి నేరుగా బీజేపీ కేంద్ర నాయకత్వంపై మాటల దాడి చేస్తుంటే.. కోర్టులో ప్రభుత్వ న్యాయవాదులు అందుకు భిన్నంగా బీజేపీకి సంబంధం లేదని క్లీన్ చిట్ ఇస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మా వాదనను తోసిపుచ్చడం సరికాదు’అని బీజేపీ తరఫున సీనియర్ న్యాయవాది జె.ప్రభాకర్ వాదనలు వినిపించారు.
మరోవైపు ఫామ్‌హౌస్‌లో పట్టుబడిన నిందితులకు 41ఏ నోటీసు ఇవ్వలేదని రిమాండ్‌కు తరలించేందుకు ఏసీబీ కోర్టు నిరాకరించింది. దీన్ని సైబరాబాద్ పోలీసులు హైకోర్టులో సవాల్ చేయగా, నిందితుల రిమాండ్‌కు అనుమతిస్తూ తీర్పు వెలువరించింది. మంగళవారం ఉత్తర్వుల సందర్భంగా ఈ వివరాలన్నింటిని పేర్కొన్న న్యాయమూర్తి జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి.. ఈ కేసులో మెయినాబాద్ పోలీసులు దర్యాప్తు చేయవచ్చని ఆదేశాలు జారీ చేశారు. అలాగే సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో ఈ కేసు విచారణ జరిపించాలని బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌పై లోతైన విచారణ కొనసాగించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కాగా, హైకోర్టు స్టే ఎత్తివేయడంతో ముగ్గురు నిందితులను పోలీసులు కస్టడీకి కోరే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment