మొయినాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదు
వేర్వేరు ప్రాంతాల్లో స్వాధీనం
మొయినాబాద్, న్యూస్‌లైన్: జిల్లా పరిధిలో శనివారం వేర్వేరు ప్రాంతాల్లో పోలీసులు రూ. 20.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మొయినాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని రెడ్డిపల్లి వద్ద శనివారం సాయంత్రం వాహనాల తనిఖీలు నిర్వహించారు.
నగరం నుంచి శంకర్‌పల్లి మండల పరిధిలోని ప్రగతి రిసార్ట్స్‌కు వెళ్తున్న ఓ కారులో రూ.15.20 లక్షల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కారులో ఉన్న వ్యక్తిని ప్రగతి రిసార్ట్స్‌లో పనిచేసే శివగా గుర్తించారు. అతడు నగదుకు సంబంధించిన సరైన ఆధారాలు చూపకపోవడంతో సీజ్ చేసినట్లు సీఐ రవిచంద్ర వెల్లడించారు.
అదే విధంగా మండల పరిధిలోని హిమాయత్‌నగర్ చౌరస్తాలో మధ్యాహ్నం నిర్వహించిన తనిఖీల్లో చేవెళ్ల పార్లమెంట్ టీఆర్‌ఎస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి భార్య సంగీతారెడ్డి కారులోంచి టీఆర్‌ఎస్ పార్టీ జెండాలు, బ్యానర్లు, తోరణాలు, కండువాలు, గొడుగులు, కరపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వాటిని సీజ్ చేసి ఎన్నికల అధికారి, చేవెళ్ల ఆర్డీవో చంద్రశేఖరరావుకు అప్పగించినట్లు సీఐ తెలిపారు. ఈ తనిఖీల్లో ఎస్సై శ్రీనివాసరావు, కానిస్టేబుళ్లు ఉన్నారు.
బైకుపై తరలిస్తున్న రూ.3.8 లక్షలు..
ఘట్‌కేసర్:
బైకుపై తరలిస్తున్న రూ.3.8 లక్షల నగదును ఘట్‌కేసర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.వివరాలు.. మండల పరిధిలోని నారపల్లిలో వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై చెక్‌పోస్టులో శనివారం స్థానిక పోలీసులు తనిఖీలు చేశారు.
బైకుపై వెళ్తున్న హరిశ్రీనివాస్ నుంచి రూ.3.8 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నారపల్లి సమీపంలోని సిద్ధార్థ కాలేజీకి విద్యార్థులు చెల్లించిన ఫీజును నగరంలోని ఆక్సిస్ బ్యాంక్‌లో డిపాజిట్ చేసేందుకు తీసుకెళ్తున్నట్లు హరిశ్రీనివాస్ పోలీసులకు చెప్పాడు. ఆధారాలు చూపకపోవడంతో పోలీసులు నగదును సీజ్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కందుకూరు:
కారులో తీసుకెళ్తున్న రూ.1.5 లక్షలను కందుకూరు పోలీసులు సీజ్ చేశారు. వివరాలు.. కందుకూరు పరిధిలోని శ్రీశైలం రహదారిలో అమ్ములు దాబా సమీపంలోని చెక్ పోస్టులో శనివారం సీఐ జానకీరెడ్డి ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేశారు.
మధ్యాహ్న సమయంలో మహబూబ్‌నగర్ జిల్లా ఆమన్‌గల్ నుంచి వస్తున్న కారు (ఏపీ 22 ఎడీ 1122)లో రూ.1.5 లక్షల నగదు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కారులో ప్రయాణిస్తున్న ఆమన్‌గల్‌కు చెందిన పున్నం రామకృష్ణ తాను బట్టల వ్యాపారినని, దుస్తుల కొనుగోలు కోసం నగరానికి వెళ్తున్నట్లు చెప్పాడు. కాగా నగుదుకు సంబంధించిన ఆధారాలు చూపకపోవడంతో సీజ్ చేసి స్టాటిస్టిక్ అధికారుల ద్వారా ట్రెజరీకి తరలించినట్లు సీఐ తెలిపారు.