అనుమతి లేకుండా ఫాంహౌస్‌లో విందు
మొయినాబాద్: అనుమతి లేకుండా ఫాంహౌస్‌లో విం దు ఏర్పాటు చేసినవారిపై మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. సీఐ రవిచంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలకు చెందిన ఎంబీఏ విద్యార్థులు దశరథ్, సుధీర్‌లు కళాశాలలోని విద్యార్థులతో కలిసి పార్టీ(విందు) ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు.
కళాశాలలోని 40 మంది విద్యార్థుల నుంచి రూ.1200 చొప్పున డబ్బులు వసూలు చేశారు. మండల పరిధిలోని అమ్డాపూర్ రెవెన్యూలో ఉన్న మల్లేష్‌యాదవ్ ఫాంహౌస్‌లో విందు ఏర్పాటు చేసేందుకు రూ.30 వేలకు అద్దెకు తీసుకున్నారు. శుక్రవారం విందుకు ఏర్పాట్లు సిద్ధం చేసి మధ్యాహ్నం 3 గంటలకు విద్యార్థులంతా ఫాంహౌస్‌కు చేరుకున్నారు. విందు విషయం తెలుసుకున్న సీఐ రవిచంద్ర సిబ్బందితో కలిసి ఫాంహౌస్‌పై దాడి చేశారు. మొత్తం 40 మంది విద్యార్థుల్లో పది మంది అమ్మాయిలు ఉన్నారు. 8 కార్టన్ల బీరు బాటిళ్లు, 6 హుక్క బాటిళ్లు, డీజేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పార్టీ ఏర్పాటు చేసిన విద్యార్థులు దశరథ్, సుధీర్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు ఫాంహౌస్ యజమాని మల్లేష్‌యాదవ్, సూపర్‌వైజర్ శ్రీనివాస్‌యాదవ్‌లపైనా కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. కొత్త సంవత్సరం స్వాగతం సందర్భంగా అనుమతులు లేకుండా విందులు ఏర్పాటు చేస్తే కేసులు నమోదు చేస్తామని ఈసందర్భంగా సీఐ హెచ్చరించారు.