
వివరాలు వెల్లడిస్తున్న ఏఎస్పీ శరత్‌చంద్ర
సాక్షి, మంగపేట: కొంత కాలంగా వివిధ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న తాడ్వాయి మండలం గంగారం గ్రామానికి చెందిన యాస వినోద్(23) అనే వ్యక్తిని శుక్రవారం అరెస్టు చేసినట్లు ఏటూరునాగారం ఏఎస్పీ శరత్‌చంద్ర స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఏఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. ఉమ్మడి వరంగల్ జిల్లా హన్మకొండలోని వడ్డేపల్లికి చెందిన గుండ్ర రామ్‌రాజ్ అనే భక్తుడు గురువారం మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయ ప్రాంగణంలో తాళం వేసి ఉన్న తన ద్విచక్ర వాహనాన్ని ఎవరో అపహరించుకు పోయారని పోలీస్ స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేశాడు.
శుక్రవారం ఉదయం మండల కేంద్రంలోని కోమటిపల్లి క్రాస్‌రోడ్డు వద్ద ఎస్సై వెంకటేశ్వర్‌రావు, పిఎస్సై సురేష్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా కాటాపురం వైపు నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న వినోద్ పోలీసులను చూసి ద్విచక్రవాహనాన్ని వదిలి పారిపోతుండగా పట్టుకుని విచారించారు. మల్లూరు గుట్టపై గురువారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో తాళం వేసి ఉన్న ద్విచక్ర వాహనాన్ని తాను దొంగిలించానని, కమలాపురంలో వాహనాన్ని విక్రయించేందుకు వస్తునట్లు ఒప్పుకున్నాడు. మండలంలో ఇటీవల ద్విచక్ర వాహనాలు తరచుగా మాయమవుతున్న సంఘటనల పై అనుమానం వచ్చి విచారించగా హన్మకొండ, వరంగల్, పరకాల వంటి ప్రాంతాల్లో మరో 10 వాహనాలు కూడా దొంగిలించినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.
అతను ఇచ్చిన సమాచారం మేరకు దొంగిలించబడిన 11 వాహనాలను స్వాధీనం చేసుకుని నిందితుడు వినోద్‌పై కేసు నమోదు చేసి మరింత లోతుగా విచారణ చేపడుతున్నట్లు ఏఎస్పీ వెల్లడించారు. పట్టుబడిన ద్విచక్ర వాహనాల విలువ సుమారు రూ 2.44 లక్షలు ఉంటుందన్నారు. ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై వెంకటేశ్వర్‌రావు, పిఎస్సై సతీష్, సిబ్బంది మేర శ్రీనులను ఎస్పీ అభినందించారు. సమావేశంలో ఏటూరునాగారం సీఐ బత్తుల సత్యనారాయణ, ఏఎస్సై అబ్బయ్య, కానిస్టేబుల్ మేర శ్రీనివాస్, తాటి అశోక్, యాకన్న, వాసు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment