సాక్షి, మంచిర్యాల : ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల హాజరు వివరాలు బయోమెట్రిక్ విధానంలో నమోదు చేసేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. పాఠశాలల స్థాయిలో వివరాలు సేకరించి వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు. ప్రాథమికంగా స్కూల్ కాంప్లెక్స్‌లు కేంద్రంగా ఈ కార్యాచరణకు శ్రీకారం చుట్టే యోచనలో ఉన్నట్లు విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. జిల్లాలో 2700 ప్రాథమిక పాఠశాలలు, 703 ప్రాథమికోన్నత పాఠశాలలు, 468 హైస్కూళ్లలో కలిపి దాదాపు 11,700 ఉపాధ్యాయుల పనిచేస్తున్నారు.
ఇంతమంది హాజరును రోజూ పర్యవేక్షించడం విద్యాశాఖ అధికారుల వల్ల కావడం లేదు. ఇదే పరిస్థితి మిగతా జిల్లాలోనూ ఉంది. దీంతో ఉపాధ్యాయుల పర్యవేక్షణకు బయోమెట్రిక్ విధానాన్ని ఉపయోగించుకోవాలని, ఆ ప్రక్రియ మొదటి దశలో ఆదిలాబాద్ జిల్లానూ భాగస్వామ్యం చేయాలని విద్యాశాఖ భావిస్తున్నట్లు సమాచారం. ఈ విధానంలో భాగంగా ఆయా పాఠశాలల్లో బయోమెట్రిక్ యంత్రాలు అమరుస్తారు. ఆ స్కూల్‌కు చెందిన మొత్తం ఉపాధ్యాయులు, ఆ రోజు హాజరైన వారు, సెలవు పెట్టిన వారి వివరాలను అందులో నమోదు చేస్తారు.
ఈ వివరాలు జిల్లా విద్యాధికారి కార్యాలయం ద్వారా డెరైక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌కు చేరేలా కార్యాచరణ ఉండనున్నట్లు సమాచారం. మరోవైపు స్కూల్ విజిట్ రిపోర్ట్‌లోనూ హాజరు పర్యవేక్షణకు ప్రత్యేక కాలం ఒకదానిని పొందుపర్చుతారు. ఇప్పటివరకు స్కూల్‌లోని మౌలిక సదుపాయాలు తదితర అంశాలనే స్కూల్ విజిట్‌లో పర్యవేక్షించే అంశానికి తోడుగా ఉపాధ్యాయుల హాజరు, సెలవులను నమోదు చేయనున్నారు. దీంతోపాటు తరచూ సెలవు పెట్టే ఉపాధ్యాయులు, విధులకు సక్రమంగా వచ్చే టీచర్ల వివరాలను క్రోడికరించే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.
భిన్నాభిప్రాయాలు..
బడికి వెళ్లకుండా హాజరు వేయించుకునే వారి గుట్టురట్టు చేసే దిశగా ఉన్న ఈ కార్యాచరణపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమపై నమ్మకం లేకనే ఈ విధానం ప్రవేశపెడుతున్నారా అనే సందేహాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. అయితే వ్యవస్థను బాగుపరిచే ఏ విధానానికి అయినా ఉపాధ్యాయులంతా మద్దతు ఇవ్వాల్సిందేననే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. వెరసి ఈ ప్రతిపాదన అమలులోకి వస్తే సర్కారు స్కూళ్లలో ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని ఉపాధ్యాయులతోపాటు తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.
బయోమెట్రిక్ పర్యవేక్షణ!
Published Wed, Sep 17 2014 2:11 AM | Last Updated on Sat, Sep 2 2017 1:28 PM
Advertisement
Advertisement