సాక్షి ప్రతినిధి, వరంగల్ :
వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ అధిష్టానానికి సొంత పార్టీలో వర్గపోరు ఇబ్బందిగా మారింది. జిల్లాలో అంతంతమాత్రంగానే ఉన్న కమలం పార్టీకి ముఖ్యనాయకుల మధ్య కలహాలు.. ఎన్నికల పోరును ఎదుర్కొనే పరిస్థితి లేకుండా చేస్తున్నాయి. కేంద్రంలో అధికార పార్టీగా వరంగల్ ఎంపీ స్థానాన్ని గెలుచుకోవాలని బీజేపీ వ్యూహాలు అమలు చేస్తోంది. గతంలో వరంగల్ లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించిన పార్టీగా మళ్లీ ఈ సీటు కైవసం చేసుకోవచ్చనే ఆలోచనతో పార్టీ అధిష్టానం ఉంది. సమర్థుడికి టికెట్ ఇచ్చి విజయం కోసం గట్టిగా కృషి చేయాలనే వ్యూహంతో ముందుకెళ్తోంది. బీజేపీ అధిష్టానం తీరు ఇలా ఉంటే... జిల్లాలోని ఆ పార్టీ నాయకుల తీరు మాత్రం విరుద్ధంగా ఉంది. జిల్లాలోని పార్టీ రెండుగా చీలిపోయి ఎవరికివారుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీ అగ్రనేతలు వచ్చిన సమయాల్లోనూ జిల్లా నాయకులు ఇలాగే వ్యవహరిస్తుండడం బీజేపీ శ్రేణులకు ఆందోళన కలిగిస్తోంది. ఏ పార్టీకి లేని విధంగా వరంగల్ నగర జిల్లా, వరంగల్ గ్రామీణ జిల్లాగా బీజేపీకి జిల్లాలో రెండు శాఖలు ఉన్నాయి. సాంకేతి కంగా రెండు శాఖలను రెండు జిల్లాలుగా పార్టీ నేతలు పేర్కొంటున్నారు. రెం డు శాఖలు ఎవరికివారుగానే వ్యవహరిస్తున్నారు. జిల్లాకు చెందిన రాష్ట్ర స్థాయి కీలక నేతలే గ్రూపులు పెంచి పోషిస్తున్నారని కార్యకర్తలు వాపోతున్నారు.
వరంగల్ లోక్‌సభ ఎన్నిక వ్యూహంపై బీజేపీ సన్నాహక సమావేశాన్ని జూలై 13న నిర్వహించాలని నిర్ణయించారు. లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన నాయకులు ఒకేచోట సమావేశం కావాల్సి ఉంది. అయితే వరంగల్ నగర, వరంగల్ గ్రామీణ శాఖలు పార్టీ సమావేశాలను వేర్వేరుగా నిర్వహించారు. లోక్‌సభ ఎన్నికను సవాలుగా భావిస్తున్న బీజేపీ అధిష్టానం ముందుగా నిర్ణయించిన సమావేశానికి పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి కృష్ణదాస్‌ను పంపించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. పార్టీ రెండు శాఖలను సమన్వయం చేయాల్సిన కిషన్‌రెడ్డి వేర్వేరుగా నిర్వహించిన రెండు సమావేశాల్లో పాల్గొన్నారు. లోక్‌సభ పరిధి సమావేశం ఒక్కటిగా జరగాల్సి ఉండగా... రెండు చోట్ల జరగడంపై కృష్ణదాస్ అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడి సమక్షంలోనే వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తే కార్యకర్తలు, నాయకులు ఒక్కటిగా ఎలా పనిచేస్తారని బీజేపీలో చర్చ జరుగుతోంది. గతంలో అధికార పదవులు అనుభవించిన సీనియర్ నాయకులు... కొత్త నాయకత్వాన్ని తీసుకురావడంలో పట్టుదలకు పోయి పార్టీకి నష్టం చేస్తున్నారని కాషాయ పార్టీలో చర్చ జరుగుతోంది. జాతీయ భావాలున్న వారిని, గతంలో బీజేపీ అనుకూల సంఘాల్లో పనిచేసిన వారిని పార్టీకి దగ్గరగా చేసే కార్యక్రమం విషయంలో సీనియర్లు ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. కేంద్రంలో అధికార పార్టీగా ఉప ఎన్నికలో సత్తా చూపాలని బీజేపీ అధిష్టానం ఆలోచిస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర మం త్రులు, బీజేపీ జాతీయ నాయకులు, రాష్ట్ర స్థాయిలో ఎమ్మెల్యేలు తరచూ జిల్లాకు వచ్చి సమావేశాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని కొందరు సీనియర్ నాయకులు ఉద్దేశపూర్వకంగానే ఈ కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. బీజేపీని ఎలా బలోపేతం చేయాలనే అంశాలను పక్కనబెట్టి... పార్టీలోని ప్రత్యర్థులను ఎలా అణచివేయాలనే ఉద్దేశంతోనే ఈ సీని యర్ల వ్యవహారశైలి ఉంటోందని వాపోతున్నారు. జిల్లా పార్టీ కార్యాలయానికి రావడానికి ఇష్టపడని వారికి రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతలు అప్పజెప్పడం బీజేపీలోనే చెల్లుబాటవుతోందని కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. ఇలాంటి నేతలు ఉన్న పార్టీకి ఉప ఎన్నికలో గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉంటాయని గుసగుసలాడుకుంటున్నారు.