warangal loksabha
-
భూపాలపల్లే ‘కీ’లకం
సాక్షి, భూపాలపల్లి: వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో గెలుపోటములు నిర్ణయించడంలో ఈ సారి భూపాలపల్లి ఓటర్లు ‘కీ’లకంగా మారనున్నారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో భూపాలపల్లిలోనే ఎక్కువ ఓటర్లు ఉన్నారు. దీంతో ఈ సారి ఎన్నికల్లో భూపాలపల్లి నియోజకవర్గం కీలకంగా కానుంది. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తంగా 16,53,474 మంది ఓటర్లు ఉండగా భూపాలపల్లి నియోజకవర్గంలో 2,63,130 మంది ఉన్నారు. 2014 ఎన్నికల సందర్భంగా పార్లమెంట్ పరిధిలో భూపాలపల్లి నియోజకవర్గం నుంచే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. 2,37,803 ఓట్లకు గానూ 1,87,711 ఓట్లు (80 శాతం) పోలయ్యాయి. కడియం శ్రీహరి రాజీనామాతో 2015లో జరిగిన ఉప ఎన్నికల్లో మాత్రం ఓటింగ్ 70 శాతానికి పడిపోయింది. ‘సింగరేణి’ ఓట్లే 30వేలు వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఒక్క భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనే సింగరేణి గనులు విస్తరించి ఉన్నాయి. దాదాపుగా ఏడు వేల మంది కార్మికులు ఇక్కడ పని చేస్తున్నారు. మొత్తం మీద 30 వేల కు పైగా సింగరేణి కార్మికుల కుటుంబాల ఓట్లు ఉన్నా యి. వీరు ఎటు మొగ్గుచూపితే అటు నియోజకవర్గంలో మెజార్టీ వచ్చే అవకాశం ఉంటుంది. -
ఎంపిక తేలేదెన్నడో..!
సాక్షిప్రతినిధి, వరంగల్: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనా అభ్యర్థుల ఎంపికపై స్పష్టత రాలేదు. గెలుపు గుర్రాల జాబితా వడపోతలో తలమునకలైన ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఖరారుపై ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. వరంగల్, మహబూబాబాద్ లోక్‌సభ స్థానాల్లో అధికార పార్టీకి చెందిన నేతలే ‘సిట్టింగ్’లుగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పొత్తులపై ప్రతిష్టంభన కారణంగా కూటమిలో సీట్ల సర్దుబాటు కొలిక్కిరాలేదు. మరోవైపు బీజేపీ, వామపక్ష పార్టీలు సైతం అభ్యర్థులను బరిలో దింపే యోచన చేస్తుండగా... టీడీపీ వైఖరి బయటపడటం లేదు. ఈ నెల 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా.. అదే రోజు నుంచి నామినేషన్ల పర్వం మొదలు కానుంది. ఇందుకు మరో నాలుగు రోజులే గడువే ఉండటంతో రాజకీయ పార్టీలు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తాయనేది చర్చనీయాంశంగా మారింది. జోరు మీదున్న కారు.. అభ్యర్థుల ఎంపికపై టీఆర్ఎస్ అంతర్గతంగా కసరత్తును పూర్తి చేసినట్లుగా చెప్తున్నారు. అయితే అన్ని కోణాల్లో సర్వే చేస్తున్న ఆ పార్టీ అధిష్టానం ఈసారి సిట్టింగ్‌లకే అవకాశం ఇస్తుందా? లేక మార్పులు చేర్పులు చేస్తుందా? అన్న చర్చ జరుగుతోంది. ఓవైపు పసునూరి దయాకర్ ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి ఈసారి మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, కడియం కావ్య పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే జనగామ ప్రాంతానికి చెందిన డాక్టర్ పగిడిపాటి సుగుణాకర్రాజుతో పాటు మాజీ ఎంపీపీ, సీనియర్ నాయకుడు రామగళ్ల పరమేశ్వర్ తదితరులు వరంగల్ టికెట్ కావాలని దరఖాస్తు చేసుకున్నారు. మహబూబాబాద్ స్థానం నుంచి ప్రొఫెసర్ సీతారాంనాయక్ ఎంపీగా ఉండగా.. ఇక్కడినుంచి అవకాశం ఇస్తే పోటీ చేసేందుకు పలువురు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి రామచంద్రునాయక్, మాజీ ఎమ్మెల్యే మాలోతు కవిత పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ ఒకరు సైతం టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. చాలా చోట్ల ఇప్పటికే లోక్‌సభ అభ్యర్థుల పేర్లు పరోక్షంగా ప్రకటించినా.. వరంగల్, మహబూబాబాద్ స్థానాలపై తేల్చకపోవడం చర్చనీయాంశం కాగా, టీఆర్ఎస్ జాబితా వెల్లడిలో జాప్యం జరిగే సూచనలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది. మహబూబాబాద్‌లో ఈ నెల 16న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సన్నాహక సమావేశం కూడా రద్దు చేశారు. కాంగి‘రేసు’లో ఎవరో..? కాంగ్రెస్ నుంచి వరంగల్, మహబూబాబాద్ స్థానాల కోసం 77 మంది టిక్కెట్ల కోసం దరఖాస్తు చేసుకోగా.. ఎవరికి ఆ టికెట్ దక్కుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలోనే వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల డీసీసీ అధ్యక్షుడిగా నాయిని రాజేందర్‌రెడ్డి, మహబూబాబాద్ జిల్లాకు భరత్‌చంద్రారెడ్డి, జనగామకు రాఘవరెడ్డిలను నియమించారు. ఈ కమిటీల ద్వారా వరంగల్ లోక్‌సభ స్థానం కోసం 34, మహబూబాబాద్ కోసం 43 మంది దరఖాస్తులను టీపీసీసీ ఎన్నికల కమిటీ పరిశీలన కోసం పంపించారు. రాష్ట్రవ్యాప్తంగా 17 లోక్‌సభ స్థానాల అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు చేసిన ఎన్నికల కమిటీ వరంగల్ నుంచి నాలుగు, మహబూబాబాద్ నుంచి రెండు పేర్లను ఏఐసీసీకి పంపించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ప్రధానంగా వరంగల్ కోసం గత ఎన్నికల్లో ఓటమి చెందిన సర్వే సత్యనారాయణ, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, దొమ్మాటి సాంబయ్య, ఇందిర, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, మానవతారాయ్‌లతో పాటు 34 మంది దరఖాస్తు చేసుకున్నారు. అలాగే మహబూబాబాద్ కోసం మాజీ ఎంపీ పోరిక బలరాంనాయక్, బెల్లయ్యనాయక్‌లతో పాటు 43 మంది దరఖాస్తులను టీపీసీసీ ఎన్నికల కమిటీ పరిశీలించినట్లు తెలిసింది. త్వరలోనే ప్రకటిస్తారని చెప్తున్నా.. ఎవరికి టికెట్ దక్కుతుందనేది సస్పెన్స్‌గా మారింది. బీజేపీలో కనిపించని సందడి.. ‘దేశం’లో అస్పష్టత కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసినా బీజేపీలో ఎన్నికల సందడి కనిపించడం లేదు. ఒకవైపు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి ఎంపీ టికెట్ల కోసం తమదైన శైలిలో ప్రయత్నాలు సాగుతుండగా బీజేపీలో మాత్రం స్తబ్దుగా ఉంది. గత లోక్‌సభ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఓటమి చెందారు. టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గాల వారీగా సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ పోటీలో నిలబడే ఆశావహుల దగ్గరి నుంచి దరఖాస్తులను స్వీకరించింది. నోటిఫికేషన్ విడుదల కాగానే అభ్యర్థులను ప్రకటించేందుకు రెండు పార్టీలు సిద్ధమవుతుండగా బీజేపీ మాత్రం దరఖాస్తుల స్వీకరణ చేపట్టడం లేదని తెలుస్తోంది. ఇదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమిగా కాంగ్రెస్, టీజేఎస్‌లతో కలిసి నడిచిన టీడీపీ ఈసారి పోటీ చేస్తుందా? లేదా? తెలియ డం లేదు.మునుపెన్నడూ లేనిరీతిలో టీడీపీలోనూ అభ్యర్థుల ఎంపికపై స్పష్టత రావడంలేదు. కాగా సీపీఐ, సీపీఎం పార్టీలు అభ్యర్థులను బరిలో దింపేందుకు కసరత్తు చేస్తున్నట్లు ప్రకటించాయి. -
కలహాల కమలం
సాక్షి ప్రతినిధి, వరంగల్ : వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ అధిష్టానానికి సొంత పార్టీలో వర్గపోరు ఇబ్బందిగా మారింది. జిల్లాలో అంతంతమాత్రంగానే ఉన్న కమలం పార్టీకి ముఖ్యనాయకుల మధ్య కలహాలు.. ఎన్నికల పోరును ఎదుర్కొనే పరిస్థితి లేకుండా చేస్తున్నాయి. కేంద్రంలో అధికార పార్టీగా వరంగల్ ఎంపీ స్థానాన్ని గెలుచుకోవాలని బీజేపీ వ్యూహాలు అమలు చేస్తోంది. గతంలో వరంగల్ లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించిన పార్టీగా మళ్లీ ఈ సీటు కైవసం చేసుకోవచ్చనే ఆలోచనతో పార్టీ అధిష్టానం ఉంది. సమర్థుడికి టికెట్ ఇచ్చి విజయం కోసం గట్టిగా కృషి చేయాలనే వ్యూహంతో ముందుకెళ్తోంది. బీజేపీ అధిష్టానం తీరు ఇలా ఉంటే... జిల్లాలోని ఆ పార్టీ నాయకుల తీరు మాత్రం విరుద్ధంగా ఉంది. జిల్లాలోని పార్టీ రెండుగా చీలిపోయి ఎవరికివారుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీ అగ్రనేతలు వచ్చిన సమయాల్లోనూ జిల్లా నాయకులు ఇలాగే వ్యవహరిస్తుండడం బీజేపీ శ్రేణులకు ఆందోళన కలిగిస్తోంది. ఏ పార్టీకి లేని విధంగా వరంగల్ నగర జిల్లా, వరంగల్ గ్రామీణ జిల్లాగా బీజేపీకి జిల్లాలో రెండు శాఖలు ఉన్నాయి. సాంకేతి కంగా రెండు శాఖలను రెండు జిల్లాలుగా పార్టీ నేతలు పేర్కొంటున్నారు. రెం డు శాఖలు ఎవరికివారుగానే వ్యవహరిస్తున్నారు. జిల్లాకు చెందిన రాష్ట్ర స్థాయి కీలక నేతలే గ్రూపులు పెంచి పోషిస్తున్నారని కార్యకర్తలు వాపోతున్నారు. వరంగల్ లోక్‌సభ ఎన్నిక వ్యూహంపై బీజేపీ సన్నాహక సమావేశాన్ని జూలై 13న నిర్వహించాలని నిర్ణయించారు. లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన నాయకులు ఒకేచోట సమావేశం కావాల్సి ఉంది. అయితే వరంగల్ నగర, వరంగల్ గ్రామీణ శాఖలు పార్టీ సమావేశాలను వేర్వేరుగా నిర్వహించారు. లోక్‌సభ ఎన్నికను సవాలుగా భావిస్తున్న బీజేపీ అధిష్టానం ముందుగా నిర్ణయించిన సమావేశానికి పార్టీ రాష్ట్ర ఇన్చార్జి కృష్ణదాస్‌ను పంపించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. పార్టీ రెండు శాఖలను సమన్వయం చేయాల్సిన కిషన్‌రెడ్డి వేర్వేరుగా నిర్వహించిన రెండు సమావేశాల్లో పాల్గొన్నారు. లోక్‌సభ పరిధి సమావేశం ఒక్కటిగా జరగాల్సి ఉండగా... రెండు చోట్ల జరగడంపై కృష్ణదాస్ అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడి సమక్షంలోనే వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తే కార్యకర్తలు, నాయకులు ఒక్కటిగా ఎలా పనిచేస్తారని బీజేపీలో చర్చ జరుగుతోంది. గతంలో అధికార పదవులు అనుభవించిన సీనియర్ నాయకులు... కొత్త నాయకత్వాన్ని తీసుకురావడంలో పట్టుదలకు పోయి పార్టీకి నష్టం చేస్తున్నారని కాషాయ పార్టీలో చర్చ జరుగుతోంది. జాతీయ భావాలున్న వారిని, గతంలో బీజేపీ అనుకూల సంఘాల్లో పనిచేసిన వారిని పార్టీకి దగ్గరగా చేసే కార్యక్రమం విషయంలో సీనియర్లు ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. కేంద్రంలో అధికార పార్టీగా ఉప ఎన్నికలో సత్తా చూపాలని బీజేపీ అధిష్టానం ఆలోచిస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర మం త్రులు, బీజేపీ జాతీయ నాయకులు, రాష్ట్ర స్థాయిలో ఎమ్మెల్యేలు తరచూ జిల్లాకు వచ్చి సమావేశాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని కొందరు సీనియర్ నాయకులు ఉద్దేశపూర్వకంగానే ఈ కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. బీజేపీని ఎలా బలోపేతం చేయాలనే అంశాలను పక్కనబెట్టి... పార్టీలోని ప్రత్యర్థులను ఎలా అణచివేయాలనే ఉద్దేశంతోనే ఈ సీని యర్ల వ్యవహారశైలి ఉంటోందని వాపోతున్నారు. జిల్లా పార్టీ కార్యాలయానికి రావడానికి ఇష్టపడని వారికి రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతలు అప్పజెప్పడం బీజేపీలోనే చెల్లుబాటవుతోందని కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. ఇలాంటి నేతలు ఉన్న పార్టీకి ఉప ఎన్నికలో గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉంటాయని గుసగుసలాడుకుంటున్నారు. -
'వరంగల్ సీటు బీజేపీకే ఇవ్వండి'
వరంగల్: వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో బీజేపీకే సీటు కేటాయించాలని ఆ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ టి. రాజేశ్వరరావు అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. వరంగల్‌లో బీజేపీ అభ్యర్థి గెలిస్తే కేంద్రంలో మంత్రి పదవి వస్తుందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్కు బీజేపీయే ప్రత్యమ్నాయమన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు సెలవు ప్రకటించారని.. ఆ పార్టీ ఇక విశ్రాంతి తీసుకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. రేవంత్ తీరు సరైంది కాదు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరు సరైంది కాదని రాజేశ్వర్‌రావు అభిప్రాయపడ్డారు. బీజేపీ ఓటుకు నోటును వ్యతిరేకిస్తుందని ఆయన అన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకొన్న టీఆర్ఎస్కు ఓటుకు నోటుపై మాట్లాడే అర్హత లేదన్నారు. టెక్నికల్‌గా ఇతర పార్టీ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న వారిని ఎలా మంత్రులుగా సాగిస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వానికి కావాల్సిన మెజారిటీ ఉన్నప్పటికీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను లోబరుచుకొందని రాజేశ్వరరావు దుయ్యబట్టారు.